Dhurandhar 2 Ban: దురంధర్ 2 మూవీ నిలిపేయండి.. కోర్టులో పిటిషన్
Dhurandhar 2 Ban: బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న దురంధర్ 2 మూవీని నిలిపివేయాలని చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
Dhurandhar 2 Ban
Dhurandhar 2 Ban: ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్ 2' విడుదలై ఐదురోజులు అయింది. ఈ చిత్రం అన్నిచోట్లా అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం 500 కోట్లకు పైగా వసూలు చేసింది. మల్టీప్లెక్స్‌లలో ఉదయం నుండి అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా షోలు నడుస్తున్నాయి. కొంతమంది ఈ సినిమాపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు చెన్నైకి చెందిన ఒక న్యాయవాది ఈ చిత్రానికి వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి, సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఒక న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. 'ధురందర్ 2' చిత్రంలో రాజకీయ ఇతివృత్తాలు ఉన్నాయని, ఇది ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేయగలదని పిటిషనర్ వాదించారు.
తమిళనాడులో ఎన్నికలు ప్రకటించారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఇటువంటి పరిస్థితులలో, రాజకీయ ప్రేరేపిత లేదా వివాదాస్పద కంటెంట్‌తో కూడిన చిత్రాలను విడుదల చేయడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్ వాదించారు. పిటిషనర్ మౌఖిక వాదనలు విన్న తర్వాత, ఈ విషయంపై అధికారికంగా రిట్ పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం అతనికి ఆదేశించింది. పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే అత్యవసర విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది.
రాజకీయంగా సున్నితమైన ఇతివృత్తాలున్న చిత్రాలు ఎన్నికల సమయంలో తరచుగా న్యాయపరమైన వివాదాలను ఎదుర్కొంటాయి. మద్రాస్ హైకోర్టు పిటిషన్‌ను అధికారికంగా స్వీకరించిన తర్వాత ఆ సినిమా భవితవ్యం తేలుతుంది. ఇలాంటి వివాదమే నటుడు విజయ్ చిత్రం 'జననాయకన్'కు కూడా ఎదురైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఆ చిత్రానికి సర్టిఫికెట్‌ను నిలిపివేసి, సమీక్ష కోసం భారత ఎన్నికల సంఘానికి పంపింది. ఈ నేపథ్యంలో దురంధర్ 2 మూవీని కోర్టు నిలిపివేస్తుందేమో అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, కరాచీలోని ల్యారీ అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, మాధవన్ మరియు సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించారు. పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడి ఉగ్రవాదులను ఎదుర్కొనే ఒక భారతీయ సైనికుడి కథాంశం ఇది. 'ధురందర్ 2' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 750 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు బ్రేక్ చేసింది.




