Adulterated Watermelon: ఎర్రటి పుచ్చకాయ వెనుక ప్రమాదకరమైన 'ఎరిథ్రోసిన్'.. నిజమైన పుచ్చకాయను గుర్తించే చిట్కాలు ఇవే!

Adulterated Watermelon: వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ రాకముందే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో జనం ఉపశమనం కోసం పుచ్చకాయల వైపు మొగ్గు చూపుతున్నారు.

Arun Chilukuri
Published on: 24 March 2026 1:09 PM IST
Adulterated Watermelon
X

Adulterated Watermelon: ఎర్రటి పుచ్చకాయ వెనుక ప్రమాదకరమైన 'ఎరిథ్రోసిన్'.. నిజమైన పుచ్చకాయను గుర్తించే చిట్కాలు ఇవే!

Adulterated Watermelon: వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ రాకముందే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో జనం ఉపశమనం కోసం పుచ్చకాయల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, మార్కెట్లో లభించే పుచ్చకాయలు అన్నీ సహజంగా పండినవి కావు. వేగంగా పండించడమే కాకుండా, లోపలి భాగం ఎర్రగా కనిపించేలా కొందరు వ్యాపారులు ప్రమాదకరమైన ఇంజెక్షన్లు వాడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుచ్చకాయ కల్తీని గుర్తించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొన్ని కీలక చిట్కాలను అందించింది.

టిష్యూ పేపర్ టెస్ట్: రంగు కలిపారో లేదో ఇలా తెలుసుకోండి!

పుచ్చకాయ ఎర్రగా ఉండటం కోసం 'ఎరిథ్రోసిన్' అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. దీనిని గుర్తించడం చాలా సులభం. పుచ్చకాయను కోసిన తర్వాత ఒక చిన్న కాటన్ బాల్ లేదా టిష్యూ పేపర్ తీసుకోండి. ఎర్రటి భాగంపై ఆ టిష్యూను పెట్టి సున్నితంగా రుద్దండి. టిష్యూ పేపర్ ఎర్రగా మారితే అది కల్తీ పుచ్చకాయగా భావించాలి. రంగు మారకపోతే అది సహజంగా పండినట్లు లెక్క.

కార్బైడ్ కల్తీ.. పసుపు మచ్చలుంటే ప్రమాదమే!

మామిడి పండ్ల మాదిరిగానే పుచ్చకాయలను త్వరగా పండించేందుకు కార్బైడ్ ఉపయోగిస్తున్నారు. పుచ్చకాయ పైభాగంలో అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు కనిపిస్తే అది రసాయనాలతో పండిన పండుగా అనుమానించాలి. ఒకవేళ అలాంటి పండును కొనుగోలు చేస్తే, తినడానికి ముందు ఉప్పు నీటితో శుభ్రంగా కడగడం మంచిది.

ఇంజెక్షన్ రంధ్రాలను గమనించండి

పుచ్చకాయను కొనే ముందు దాని తొక్కను క్షుణ్ణంగా పరిశీలించాలి. పండుపై అక్కడక్కడ చిన్న రంధ్రాలు కనిపిస్తే అవి ఇంజెక్షన్ గుర్తులు కావచ్చు. లోపలికి రసాయనాలను పంపేందుకు ఈ రంధ్రాలను ఉపయోగిస్తారు. కాబట్టి, రంధ్రాలు ఉన్న పండ్లను కొనకపోవడమే మీ ఆరోగ్యానికి క్షేమం.

పుచ్చకాయతో కలిగే ప్రయోజనాలు:

సహజంగా పండిన పుచ్చకాయలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

నీటి శాతం: ఎండల వల్ల వచ్చే డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.

పోషకాలు: ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఎ మరియు సి లభిస్తాయి.

వేసవిలో ఆరోగ్యం కోసం పుచ్చకాయను తినండి.. కానీ కల్తీ విషయంలో పైన పేర్కొన్న జాగ్రత్తలు తప్పక పాటించాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story