Health Tips: వేసవిలో చియా, సబ్జా గింజలు తింటే శరీరంలో జరిగేది ఇదే.. ఈ తప్పులు మాత్రం చేయకండి
Chia seeds and sabja seeds: వేసవి కాలంలో శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వాటిలో చియా సీడ్స్, సబ్జా సీడ్స్ (బేసిల్ గింజలు) ప్రత్యేకమైనవి.
Chia seeds and sabja seeds
వేసవి కాలంలో శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వాటిలో చియా సీడ్స్, సబ్జా సీడ్స్ (బేసిల్ గింజలు) ప్రత్యేకమైనవి. ఇవి చిన్న గింజలే అయినా పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. సమ్మర్‌లో వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చియా, సబ్జా గింజల్లో ఉండే పోషకాలు
చియా గింజల్లో శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మాగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ లాంటివి అధికంగా ఉంటాయి. అదేవిధంగా సబ్జా గింజలకలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తుక్మరియా లేదా బేసిల్ సీడ్స్ అని కూడా అంటారు. సబ్జా గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు (అల్ఫా లినోలెనిక్ యాసిడ్) కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వేసవిలో ఇవి ఎందుకు మంచివి?
చియా, సబ్జా గింజలు శరీరానికి సహజమైన చల్లదనం ఇస్తాయి. అందుకే వేసవిలో వీటిని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. అలాగే శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్లేందుకు కూడా సహాయం చేస్తాయి.
చియా, సబ్జా గింజలను ఎలా తినాలి?
ఈ గింజలను తీసుకునే సరైన విధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం. రాత్రి సమయంలో ఈ గింజలను నీటిలో నానబెట్టాలి. కొంతసేపటికి ఇవి జెల్‌లా మారతాయి. ఉదయం ఒక గ్లాస్ నీటిలో వేసుకుని తాగవచ్చు. కావాలంటే కొద్దిగా నిమ్మరసం కలిపి తాగవచ్చు. అలాగే పెరుగులో కలిపి తినవచ్చు, స్మూతీలు లేదా పుడ్డింగ్‌లలో ఉపయోగించవచ్చు. కొబ్బరి నీటిలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి.
ఈ తప్పులు చేయకండి..
చాలామంది చియా లేదా సబ్జా గింజలను నేరుగా (నానబెట్టకుండా) తింటారు. ఇది పెద్ద తప్పు. ఎందుకంటే ఈ గింజలు నీటిలో నానిన తర్వాతే తినాలి. లేకపోతే గొంతులో ఇర్కుకోవడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే రోజుకు రెండు టీ స్పూన్లకు మించి నానబెట్టిన గింజలు తీసుకోకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త
కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ గింజలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు తీసుకుంటున్నవారు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది. అలాగే కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలతో అలెర్జీ ఉంటుంది. ఉదాహరణకు నువ్వులు, పల్లీలు తిన్నప్పుడు అలెర్జీ వచ్చే వారికి చియా గింజల వల్ల కూడా అలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది.




