Brain Fog Symptoms: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? బ్రెయిన్ ఫాగ్ కావొచ్చు..
Brain Fog Symptoms: సాధారణంగా వయసు పెరిగిన తర్వాత కొంతమంది విషయాలు మరిచిపోవడం సహజం.
Brain Fog Symptoms: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? బ్రెయిన్ ఫాగ్ కావొచ్చు..
Brain Fog Symptoms: సాధారణంగా వయసు పెరిగిన తర్వాత కొంతమంది విషయాలు మరిచిపోవడం సహజం. కానీ 30 ఏళ్ల వయసులోనే చిన్న చిన్న విషయాలు మరిచిపోవడం, ఆలోచన మందగిస్తుందంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను బ్రెయిన్ ఫాగ్గా పిలుస్తున్నారు.
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏమిటి?
వైద్యుల ప్రకారం బ్రెయిన్ ఫాగ్ అనేది డిమెన్షియా వంటి పెద్ద వ్యాధి కాదు. కానీ ఈ సమస్య ఉన్నప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. మానసిక అలసట, ఆలోచన స్పష్టంగా లేకపోవడం, ఏకాగ్రత తగ్గడం, మీటింగ్లు లేదా పనిలో దృష్టి నిలవకపోవడం, మాట్లాడేటప్పుడు సాధారణ పదాలు కూడా గుర్తుకురాకపోవడం, ముందు సులభంగా చేసే పనులు కూడా ఇప్పుడు కాస్త కష్టంగా అనిపించవచ్చు.
ఈ సమస్య ఎందుకు వస్తుంది?
నిపుణుల ప్రకారం బ్రెయిన్ ఫాగ్కు కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఎక్కువ మానసిక ఒత్తిడి (Stress),
తక్కువ నిద్ర, పోషకాహార లోపం, ఎక్కువ సమయం మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ ముందు గడపడం. అయితే ఇది మెదడు పనిచేయడం ఆగిపోయిందని కాదు. మెదడుకు విశ్రాంతి, శ్రద్ధ అవసరం ఉందని ఇచ్చే సంకేతంగా మాత్రమే భావించాలి.
30 ఏళ్ల వయసులో ఎందుకు ఎక్కువగా కనిపిస్తోంది?
జీవశాస్త్ర పరంగా చూస్తే 30 ఏళ్ల వయసు మానసిక సామర్థ్యం బాగా ఉండే దశ. కానీ ఇప్పటి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక బాధ్యతలు, పిల్లల పెంపకం, సోషల్ మీడియా పోలికలు, కుటుంబ బాధ్యతలు, విపరీతమైన అంచనాలు వంటివి దీనికి కారణాలుగా చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం ఎక్కువ పని గంటలు, తక్కువ నిద్ర వంటివి మన దృష్టి, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతాయని తేలింది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కొన్ని పోషకాహార లోపాలు కూడా బ్రెయిన్ ఫాగ్కు కారణం కావచ్చు. ముఖ్యంగా విటమిన్ B12, విటమిన్ D3,
ఐరన్ లోపం వంటివి దీనికి కారణాలుగా చెప్పొచ్చు. ఈ లోపాలు ఉంటే చిన్న చిన్న పనులకే అలసిపోవడం, చేతులు, కాళ్లలో సూదులు గుచ్చినట్లు అనిపించడం, జుట్టు రాలడం, చర్మం పసుపు రంగులోకి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.
జీవనశైలిలో చేయాల్సిన మార్పులు
బ్రెయిన్ ఫాగ్ సమస్య బారినపడకుండా ఉండాలంటే.. రోజుకు 7–8 గంటలు నిద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. తగినంత మంచి నీరు తాగాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. మొబైల్, ల్యాప్టాప్ స్క్రీన్ సమయం తగ్గించాలి.
అకస్మాత్తుగా గందరగోళం కలగడం, తీవ్రమైన తలనొప్పి, మాట్లాడడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.




