Health Tips: నిద్రను దూరం చేస్తున్న 7 శత్రువులు ఇవే..!
రోజంతా అలసినా రాత్రి నిద్ర పట్టడం లేదా? మీ నిద్రను దూరం చేస్తున్న ఆ 7 ప్రధాన శత్రువులు ఎవరో తెలుసుకోండి. మొబైల్ వాడకం నుంచి ఆహారపు అలవాట్ల వరకు.. నిపుణులు సూచిస్తున్న ఈ చిన్న మార్పులతో రాత్రిపూట హాయిగా నిద్రపోండి.
Health Tips: నిద్రను దూరం చేస్తున్న 7 శత్రువులు ఇవే..!
Health Tips: నిద్ర అనేది శరీరానికి కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, అది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి పునాది. అయితే, మంచం మీద గంటల తరబడి గడుపుతున్నా చాలా మందికి 'నాణ్యమైన నిద్ర' కరువవుతోంది. నేడు 'ప్రపంచ నిద్ర దినోత్సవం' సందర్భంగా, మన నిద్రను దూరం చేస్తున్న ఆ అలవాట్లు ఏంటో, వాటిని ఎలా అధిగమించాలో నిపుణుల మాటల్లో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీ నిద్రను దూరం చేసే 7 ప్రధాన శత్రువులు ఇవే:
బెడ్ మీద మొబైల్ వాడకం: నిద్రపోయే ముందు స్మార్ట్‌ఫోన్ చూడటం అతిపెద్ద శాపం అని నిపుణులు చెబుతున్నారు. స్క్రీన్ నుంచి వచ్చే 'బ్లూ లైట్' మన శరీరంలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుందని వెల్లడించారు. నిద్రకు గంట ముందే గ్యాడ్జెట్స్‌ను పక్కన పెట్టడం ఉత్తమం అని సూచించారు.
ఆలస్యంగా కెఫిన్ తీసుకోవడం: సాయంత్రం వేళల్లో తాగే కాఫీ, టీ లేదా ఎనర్జీ డ్రింక్స్‌లోని కెఫిన్ శరీరంలో చాలా గంటల పాటు ఉంటుంది. ఇది మన మెదడును అప్రమత్తంగా ఉంచి, రాత్రి నిద్రపోవడం కష్టతరం చేస్తుందని పేర్కొన్నారు.
నిద్ర వేళలు: రోజుకో సమయానికి పడుకోవడం వల్ల శరీరంలోని 'బయోలాజికల్ క్లాక్' గందరగోళానికి గురవుతుందన్నారు. రోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి లేవటం అలవాటు చేసుకోవాలని సూచించారు.
రాత్రిపూట భోజనం: పడుకునే ముందు మసాలాలతో కూడిన భారీ ఆహారం తీసుకోవడం వల్ల అసిడిటీ లేదా అసౌకర్యం కలుగుతుంది. నిద్రకు కనీసం 2-3 గంటల ముందే భోజనం ముగించాలని నిపుణులు చెబుతున్నారు.
నిద్ర ఎక్కువైతే: పగటిపూట 30-40 నిమిషాల కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల రాత్రిపూట సహజంగా వచ్చే నిద్ర తగ్గిపోతుందని వెల్లడించారు.
అతిగా ఆలోచించడం: మంచం ఎక్కాక కూడా ఆఫీసు పని లేదా వ్యక్తిగత సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటే మనస్సు చురుగ్గా ఉండి నిద్ర రాదు. ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు దీనికి మంచి పరిష్కారం అని సూచిస్తున్నారు.
అసౌకర్య వాతావరణం: గదిలో వెలుతురు ఎక్కువగా ఉండటం, శబ్దం లేదా సరిగ్గా లేని పరుపు కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. నిశ్శబ్దంగా, చీకటిగా, చల్లగా ఉండే గది నిద్రకు అనుకూలం.
మంచి నిద్ర కోసం కొన్ని చిట్కాలు..
* పడుకునే ముందు పుస్తకాలు చదవడం లేదా మెలోడీ సంగీతం వినడం అలవాటు చేసుకోండి.
* సాయంత్రం వేళల్లో క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
* గది వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చుకోండి.
గుర్తుంచుకోండి.. ఈరోజు మీరు పోగొట్టుకునే నిద్ర, రేపటి మీ పని సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి, ఈ రోజే మీ అలవాట్లను మార్చుకోండి అంటూ నిపుణులు సూచిస్తున్నారు.




