Dental Health: పళ్లు జివ్వుమంటున్నాయా? ఈ 5 అలవాట్లే దానికి కారణం కావచ్చు.. జాగ్రత్త!
"మీ పళ్లు వేడి లేదా చల్లని పదార్థాలు తిన్నప్పుడు జివ్వుమంటున్నాయా? పళ్లపై గట్టిగా బ్రష్ చేయడం నుంచి ఆహారపు అలవాట్ల వరకు.. మీ దంతాల ఎనామెల్‌ను, నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆ 5 సాధారణ అలవాట్లు ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకోండి.
Dental Health: పళ్లు జివ్వుమంటున్నాయా? ఈ 5 అలవాట్లే దానికి కారణం కావచ్చు.. జాగ్రత్త!
Dental Health: వేడి టీ తాగినప్పుడో లేదా చల్లని ఐస్‌క్రీమ్ తిన్నప్పుడో పళ్లు జివ్వుమనడం అనేది ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. కేవలం బ్రష్ చేయడం, నాలుకను శుభ్రం చేసుకోవడం ద్వారా నోటి ఆరోగ్యం బాగుంటుందని చాలా మంది భావిస్తారు. కానీ, మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు దంతాల రక్షణ కవచమైన 'ఎనామెల్'ను దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దంత సమస్యలు కేవలం వయసు వల్ల మాత్రమే కాకుండా, మన జీవనశైలి వల్ల కూడా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీ దంతాలకు హాని కలిగించే ఆ 5 ముఖ్యమైన అలవాట్లు ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. పళ్లపై పగబట్టినట్లు బ్రష్ చేస్తున్నారా..
పళ్లను గట్టిగా రుద్దితేనే తెల్లగా మెరుస్తాయని అనుకోవడం పెద్ద పొరపాటని నిపుణులు చెబుతున్నారు. పళ్లపై పగబట్టినట్లు బ్రష్ చేయడం వల్ల దంతాల పైపొర అయిన ఎనామెల్ అరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పళ్లు సున్నితంగా మారి సెన్సిటివిటీ సమస్య వస్తుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా చిగుళ్లు వాపుకు గురై రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉందని సూచించారు. ఎప్పుడూ మృదువైన బ్రష్‌తో సున్నితంగా తోముకోవడం దంతాలకు శ్రేయస్కరం అని చెబుతున్నారు.
2. ఆహారపు అలవాట్లలో జాగ్రత్త..
నేటి కాలంలో జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. వీటిలో ఉండే అధిక చక్కెర, వెనిగర్, అజినోమోటో వంటివి దంత క్షయానికి దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే అతి చల్లని లేదా అతి వేడి పదార్థాలను వెంటవెంటనే తీసుకోవడం వల్ల కూడా దంతాల రంగు మారి పసుపు పచ్చగా తయారవుతాయని చెబుతున్నారు.
3. తక్కువ నీరు తాగడం
శరీరానికే కాదు, నోటి ఆరోగ్యానికి కూడా నీరు చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. తగినంత నీరు తాగకపోతే నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గుతుందని, లాలాజలం నోటిలోని బ్యాక్టీరియాను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుందని, అది తగ్గితే నోటి దుర్వాసనతో పాటు చిగుళ్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
4. అందరికీ ఒకటే టూత్‌పేస్ట్ వాడుతున్నారా..
చాలా ఇళ్లలో కుటుంబ సభ్యులందరూ ఒకే రకమైన టూత్‌పేస్ట్ వాడుతుంటారు. కానీ ప్రతి ఒక్కరి దంత అవసరాలు వేరుగా ఉంటాయి. మీకు పళ్లు జివ్వుమనే సమస్య ఉంటే దానికి తగిన 'సెన్సిటివిటీ' పేస్ట్ వాడాలి. చిన్న సమస్య కదా అని నిర్లక్ష్యం చేయకుండా, దంత వైద్యుడి సలహాతో మీకు సరిపోయే డెంటల్ ఉత్పత్తులను ఎంచుకోవడం ముఖ్యం అని చెబుతున్నారు.
5. సోషల్ మీడియా చిట్కాలతో ముప్పు..
ఈ రోజుల్లో చాలా మంది యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి పళ్లను తెల్లగా చేసుకునేందుకు రకరకాల ఇంటి చిట్కాలు పాటిస్తున్నారు. నిమ్మరసం, వంట సోడా వంటివి మితిమీరి వాడితే అవి దంతాల ఎనామెల్‌ను శాశ్వతంగా దెబ్బతీస్తాయని, నిపుణుల సలహా లేకుండా ఇలాంటి ప్రయోగాలను పళ్లపై చేయడం ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు.
దంతాలు మన అందానికే కాదు, ఆరోగ్యానికి కూడా ముఖ్యం అని, మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే పళ్లు బలంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పైన పేర్కొన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా మీ చిరునవ్వును కలకాలం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని సూచించారు.




