
Gulf Countries
Gulf Countries: మధ్య ప్రాచ్యంలో యుద్ధంతో గల్ఫ్ దేశాలు.. బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై దాడి జరిగితే దాని పరిణామాలు తమపై తీవ్రంగా ఉంటాయని ఆందోళన చెందుతున్నాయి.
Gulf Countries: కొట్టుకునే వాళ్ళు ముగ్గురే.. కానీ, ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ప్రపంచమంతా నష్టపోతోంది. అంతేకాదు.. పక్కనున్న దేశాలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. ఏ మిస్సైల్ ఎప్పుడు ఎక్కడ నుంచి వచ్చి పడుతుందో అర్ధం కాదు. అసలు ఏమి చేయాలో తెలీని పరిస్థితి. ఇదంతా గల్ఫ్ దేశాల గురించే. గల్ఫ్ దేశాలు ఇప్పుడు అణుధార్మిక భయంతో బిక్కుబిక్కు మంటున్నాయి. అమెరికాతో స్నేహం చేసినందుకు అన్నిరకాలుగానూ నష్టపోవడమే కాకుండా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిన స్థితి. వారు ఇరాన్ మీద దాడి చేయలేరు. ఇరాన్ దాడులను అడ్డుకోవడానికి ప్రయత్నాలు మాత్రమే చేయగలరు. అమెరికా మీద కోపంతో ఆ దేశానికి మితృలనే కారణంతో గల్ఫ్ దేశాల మీద విరుచుకుపడుతోంది ఇరాన్. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు అల్లకల్లోలం అయిపొయాయి. ఇటు చమురు అమ్ముకునే పరిస్థితి లేదు. అటు టూరిజం పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు యుద్ధం ఎప్పుడు ఆగుతుందో అర్ధం కాదు. అక్కరకు రావలసిన అమెరికా ఏం చేస్తుందో ఎవరికీ అంతుపట్టదు.
ఇవన్నీ అలా ఉంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలకు అణు ధార్మిక పదార్ధాల భయం పట్టుకుంది. ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై దాడి జరుగుతుందేమోనని అత్యంత ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే.. గత శనివారం, బుషెహర్ ప్లాంట్‌కు కేవలం 350 మీటర్ల దూరంలో ఒక క్షిపణి పడింది. ఇది కూడా ప్లాంట్‌పై దాడి జరుగుతుందనే ఆందోళనలను పెంచింది. ప్లాంట్‌పై నిరంతర దాడులు జరిగితే రేడియోధార్మిక అవశేషాలు వెలువడతాయని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది.
ఇది గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హెచ్చరించారు. ఆ సదుపాయంపై దాడి జరగడం వల్ల టెహ్రాన్‌కు పెద్ద సమస్యలు రావని అరాఘ్చి చెబుతున్నారు. అది కూడా నిజమే అనిపిస్తుంది.
ఎందుకు గల్ఫ్ దేశాల ఆందోళన?
గల్ఫ్ దేశాలైన కువైట్, బహ్రెయిన్, ఖతార్ బుషెహర్ నగరానికి సమీపంలో ఉన్నాయి. ఆసక్తికరంగా, ఇరాన్ రాజధాని అయిన టెహ్రాన్ కూడా బుషెహర్‌కు అంత దగ్గరగా లేదు. ఈ గల్ఫ్ దేశాలలోని ప్రధాన నగరాలకు, బుషెహర్‌కు మధ్య ఉన్న సుమారు దూరాన్ని (సముద్ర దూరం) చూద్దాం.
- కువైట్ నగరం: 270 కి.మీ.
- మనామా: 350 కి.మీ.
- దమ్మామ్, ధహ్రాన్, అల్ ఖోబర్: 400 కి.మీ
- దోహా: 450 కి.మీ.
- రియాద్: 750 కి.మీ.
ఈ సమస్య తీవ్రమైనదేనా?
ఈ ప్లాంట్‌పై దాడి జరిగితే, సీసియం-137 అనే ప్రమాదకరమైన ఐసోటోప్ వాతావరణంలోకి విడుదల అవుతుంది. దాని భౌగోళిక స్థానం కారణంగా, ఇది కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈలోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించవచ్చనే అంచనాలు ఉన్నాయి. దీనివలన ఆహారం, నేల,నీరు కలుషితమయ్యే అధిక అవకాశం కూడా ఉంది.
ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచగలదని అల్ జజీరా తన రిపోర్టులో పేర్కొంది. ఆరోగ్య, పర్యావరణ ప్రభావాలతో పాటు, ఇది ఆర్థిక వ్యవస్థను కూడా కుప్పకూల్చగలదు. ఇతర రంగాలతో పాటు మత్స్య పరిశ్రమ కూడా తీవ్రంగా దెబ్బతింటుంది.
గల్ఫ్ దేశాలు తమ తాగునీటి కోసం సముద్రపు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లపై ఎక్కువగా ఆధారపడతాయి. రేడియోధార్మిక ఐసోటోపులు సముద్రపు నీటితో కలిస్తే వాటిని వేరు చేయడం కష్టం.
ఈ నేపథ్యంలో అమెరికా లేదా ఇజ్రాయేల్ బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై దాడి చేయకుండా ఉండాలని కోరుకోవడం తప్ప ప్రస్తుతం ఏమీ చేయలేని స్థితిలో గల్ఫ్ దేశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire


