Breastfeeding: బిడ్డకు తల్లిపాలు ఆపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Breastfeeding: శిశువుకు తల్లిపాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో, అవసరమైన సమయంలో సరిగా ఆపడం కూడా అంతే ముఖ్యం. తల్లిపాలు ఆపేటపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

KVD Varma
Published on: 12 March 2026 8:35 AM IST
Breastfeeding: శిశువుకు తల్లిపాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో, అవసరమైన సమయంలో సరిగా ఆపడం కూడా అంతే ముఖ్యం.
X

Breastfeeding

సోషల్ మీడియా ప్రాచుర్యం పెరిగిన తరువాత ప్రొఫెషనల్స్ చాలామంది తమ ఎకౌంట్స్ ద్వారా ఎప్పుడూ ఎదో ఒక ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంటున్నారు. ప్రజలకు కావలసిన సమాచారాన్ని వారు తమ సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా తెలియపరుస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో డాక్టర్స్ ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ ద్వారా హెల్త్ కు సంబంధించిన అంశాలపై టిప్స్ ఇస్తూ వస్తున్నారు. ఆరోగ్యం అనగానే మనకు ఎన్నో సందేహాలు. చిన్న చిన్న విషయాలపై అవగాహన లేక.. ఇబ్బంది పడుతుండడం సహజం. ఇలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు డాక్టర్స్. ఇదిగో అలా డాక్టర్ శాంతి శ్రీ తన ఇంస్టా ఎకౌంట్ లో తల్లిపాలు ఆపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని తన రీల్ లో వివరించారు.

ఆ వివరాలు మీకోసం..

శిశువుకు తల్లిపాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో, అవసరమైన సమయంలో వాటిని సరిగా ఆపడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది మహిళలు తల్లిపాలను ఒక్కసారిగా ఆపేస్తే రొమ్ములో గడ్డలు, నొప్పి, వాపు వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి తల్లిపాలను ఆపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను చాలా వరకు నివారించవచ్చు.

ఒక్కసారిగా ఆపకూడదు

తల్లిపాలను ఒక్కసారిగా ఆపడం వల్ల రొమ్ములో పాలు నిల్వవుతాయి. దీంతో రొమ్ము గట్టిగా మారడం, గడ్డలు కట్టడం, నొప్పి రావడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే తల్లిపాలను క్రమంగా తగ్గిస్తూ ఆపడం మంచిది.

కొంచెం మాత్రమే పాలు తీసేయాలి

రొమ్ము నొప్పిగా అనిపించినప్పుడు లేదా బాగా గట్టిగా అనిపించినప్పుడు కొంచెం మాత్రమే పాలు తీసేయాలి. పూర్తిగా పిండేయడం వల్ల శరీరం మళ్లీ పాలను తయారు చేయడం ప్రారంభిస్తుంది. దీంతో పాలు తగ్గకుండా మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది.

చల్లని కాంప్రెస్ ఉపయోగించాలి

రొమ్ములో వాపు లేదా నొప్పి ఉంటే చల్లని గుడ్డ లేదా ఐస్ ప్యాక్ ను కొద్దిసేపు పెట్టుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

బిగుతైన బ్రా ధరించాలి

ఈ సమయంలో రొమ్ముకు సరైన సపోర్ట్ ఇచ్చే బిగుతైన.. సౌకర్యంగా ఉండే బ్రా ధరించడం మంచిది. ఇది రొమ్ములో పాలు ఎక్కువగా నిల్వ కాకుండా ఉండటానికి సహాయపడుతుంది.

అవసరమైతే వైద్యుల సలహా

నొప్పి ఎక్కువగా ఉండటం, జ్వరం రావడం లేదా రొమ్ములో గడ్డలు ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

తల్లిపాలను ఆపడం ఒక సహజ ప్రక్రియ. అయితే ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మహిళలకు అసౌకర్యం కలగవచ్చు. క్రమంగా పాలను తగ్గిస్తూ, శరీరాన్ని ఆ ప్రక్రియకు అలవాటు చేసుకుంటే గడ్డలు, నొప్పి వంటి సమస్యలను సులభంగా నివారించవచ్చు.



KVD Varma

KVD Varma

Next Story