BoneHealth: ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండే!
BoneHealth: మీ ఎముకలు బలహీనపడుతున్నాయా? కాల్షియం లోపం (హైపోకాల్సెమియా) అంటే ఏమిటి, దాని లక్షణాలు, నివారణ మార్గాలను ఈ స్టోరీలో తెలుసుకోండి. ఎముకల దృఢత్వానికి నిపుణులు సూచిస్తున్న ఆ ఆరోగ్య చిట్కాల పూర్తి వివరాలను ఇందులో తెలుసుకోండి.
BoneHealth: ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండే!
BoneHealth: మన శరీర సౌష్టవానికి, దృఢత్వానికి కాల్షియం అత్యంత కీలకమైన ఖనిజం. దంతాల నుంచి ఎముకల వరకు ప్రతిదానిని బలంగా ఉంచడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, కొన్ని రకాల వ్యాధుల కారణంగా చాలామందిలో కాల్షియం స్థాయిలు పడిపోతున్నాయి. వైద్య పరిభాషలో ఈ స్థితిని 'హైపోకాల్సెమియా' అని పిలుస్తారు. మన శరీరంలో కాల్షియం స్థాయిలు పడిపోతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి, నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కాల్షియం లోపానికి ప్రధాన కారణాలు ఇవే..
శరీరంలో కాల్షియం తగ్గడానికి కేవలం ఆహారపు అలవాట్లే కాదు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతాయని డాక్టర్లు వివరించారు. శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డి తప్పనిసరి. దీని లోపం ఉంటే మీరు ఎంత కాల్షియం తీసుకున్నా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలోని ఖనిజాల సమతుల్యత దెబ్బతింటుంది. అలాగే థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంధులలో సమస్యలు ఉన్నా, అవి కాల్షియం స్థాయిలపై ప్రభావం చూపుతాయని వెల్లడించారు. పేగులు పోషకాలను సరిగ్గా శోషించుకోలేకపోవడం వల్ల కూడా ఈ లోపం ఏర్పడుతుందని అన్నారు.
శరీరంలో కాల్షియం తగ్గుతున్నప్పుడు ఈ కింది సంకేతాలు కనిపిస్తాయి..
* చిన్న గాయాలకే ఎముకలు విరగడం లేదా తీవ్రమైన నొప్పి రావడం.
* తరచుగా కండరాలు పట్టేయడం, ఒత్తిడికి గురవ్వడం.
* నిరంతరం నీరసంగా అనిపించడం, కీళ్లలో అసౌకర్యం.
* పళ్లు బలహీనపడటం లేదా త్వరగా పుచ్చిపోవడం.
నిపుణుల సూచనలు ఇవే..
* రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, జున్ను (చీజ్), ఆకుకూరలను భాగం చేసుకోవాలి.
* విటమిన్ డి కోసం ప్రతిరోజూ కొంత సమయం ఉదయం ఎండలో గడపడం శ్రేయస్కరం.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
* లక్షణాలు తీవ్రంగా ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా, డాక్టర్ సలహా మేరకు మాత్రమే కాల్షియం సప్లిమెంట్లను వాడాలి.
ఎముకల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం భవిష్యత్తులో నడవలేని స్థితికి దారితీస్తుంది. కాబట్టి సరైన ఆహారం, వ్యాయామంతో కాల్షియం స్థాయిలను కాపాడుకోవడం అవసరం అని నిపుణులు చెబుతున్నారు.




