CancerAwareness : గర్భనిరోధక మాత్రల వల్ల క్యాన్సర్ వస్తుందా? అసలు నిజం ఇదే!

గర్భనిరోధక మాత్రల వల్ల క్యాన్సర్ వస్తుందనే వార్తల్లో నిజమెంత? WHO గ్రూప్-1 జాబితా వెనుక ఉన్న అసలు కారణాలను, నిపుణుల విశ్లేషణను ఈ స్టోరీలో చదవండి. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి, శాస్త్రీయ వాస్తవాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోండి.

Ganesh
Published on: 14 March 2026 4:52 PM IST
CancerAwareness : గర్భనిరోధక మాత్రల వల్ల క్యాన్సర్ వస్తుందా? అసలు నిజం ఇదే!
X

CancerAwareness : గర్భనిరోధక మాత్రల వల్ల క్యాన్సర్ వస్తుందా? అసలు నిజం ఇదే!

CancerAwareness : సోషల్ మీడియాలో ఇటీవల ఒక వార్త దావానలంలా వ్యాపిస్తోంది. "ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గర్భనిరోధక మాత్రలను 'గ్రూప్-1 కార్సినోజెన్' (క్యాన్సర్ కలిగించే కారకాలు) జాబితాలో చేర్చింది" అనేది ఆ వార్త సారాంశం. ఈ మాత్రలను సిగరెట్లు, పొగాకు, ఆస్బెస్టాస్‌తో పోలుస్తూ వస్తున్న పోస్ట్‌లు కోట్లాది మంది మహిళల్లో భయాందోళనలను కలిగిస్తున్నాయి. అయితే, ఈ వైరల్ వార్తలో ఎంతవరకు నిజముంది? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

WHOకు చెందిన 'ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్' (IARC) గర్భనిరోధక మాత్రలను 'గ్రూప్-1' జాబితాలో చేర్చిన మాట వాస్తవమే. కానీ, దీని వెనుక అసలు విషయాలు అనేకం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పలువురు నిపుణులు మాట్లాడుతూ.. WHO ఈ నిర్ణయాన్ని ఈరోజు తీసుకున్నది కాదని, దాదాపు 27 ఏళ్ల క్రితం అంటే 1999లో తీసుకుందని వెల్లడించారు. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు దీనిని ఇప్పుడే జరిగిన 'బ్రేకింగ్ న్యూస్'లా ప్రచారం చేయడం వల్ల అనవసరమైన గందరగోళం ఏర్పడిందని చెప్పారు.

సిగరెట్లు, గర్భనిరోధక మాత్రలు ఒకటేనా?

IARC జాబితా ప్రకారం సిగరెట్లు, ఈ మాత్రలు ఒకే గ్రూపులో ఉన్నప్పటికీ, వాటి ప్రమాద స్థాయి సమానం కాదని చెప్పారు. ఒక పదార్థం క్యాన్సర్‌కు కారణమవుతుందని చెప్పడానికి 'పుక్కా ఆధారాలు' ఉన్నప్పుడు మాత్రమే IARC దానిని గ్రూప్-1లో ఉంచుతుంది. అది ఎంత తీవ్రమైన క్యాన్సర్‌ను కలిగిస్తుంది అనే దాన్ని బట్టి కాదని వెల్లడించారు. ఎండ (సూర్యరశ్మి), మద్యం, సిగరెట్లు అన్నీ గ్రూప్-1లోనే ఉంటాయి. కానీ ఎండలో తిరగడం, సిగరెట్ తాగడం రెండూ ఒకే స్థాయి ప్రమాదాన్ని కలిగిస్తాయని చెప్పలేము కదా అని, అలాగే గర్భనిరోధక మాత్రలను సిగరెట్లతో పోల్చడం తప్పుడు పోలిక అని నిపుణులు చెబుతున్నారు.

శాస్త్రీయ పరిశోధనల ప్రకారం.. ఈ మాత్రల ప్రభావం శరీరంలోని వేర్వేరు భాగాలపై వేర్వేరుగా ఉంటుందని వెల్లడైంది. వీటిని దీర్ఘకాలం పాటు వాడే మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వచ్చే ముప్పు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని 2024 నాటి అధ్యయనాలు చెబుతున్నాయి. అదే సమయంలో, ఈ మాత్రలు అండాశయ క్యాన్సర్, గర్భాశయ లోపలి పొర క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయని వెల్లడైంది. WHO తన 2025 ఫ్యాక్ట్ షీట్‌లో ఈ మాత్రలను 'అనవసరమైన, హై-రిస్క్ ప్రెగ్నెన్సీలను నివారించే అత్యంత ప్రభావవంతమైన సాధనం'గా పేర్కొంది. ఇవి మాతృ మరణాలను తగ్గించడంలో ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించింది. అన్-సేఫ్ అబార్షన్లు, అవాంఛిత గర్భాల వల్ల కలిగే ముప్పుతో పోలిస్తే, ఈ మాత్రల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే పాత వార్తలను చూసి ఆందోళన చెందవద్దని, ప్రతి మందుకూ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మీరు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నట్లయితే, మీ మెడికల్ హిస్టరీని బట్టి వైద్యుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అని సూచించారు.

Ganesh

Ganesh

Next Story