Vikarabad: ఆస్తి తగాదాలతో తండ్రిపై పెట్రోలు పోసి అంటించిన కొడుకు
Vikarabad: వికారాబాద్ జిల్లా రూప్ సింగ్ తండాలో ఆస్తి తగాదాలతో నిద్రిస్తున్న తండ్రి, పిన్నిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుమారుడు. పోలీసుల అదుపులో నిందితుడు
Vikarabad
Vikarabad: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో కన్నతండ్రినే హతమార్చేందుకు ప్రయత్నించాడు ఒక దుర్మార్గుడు. జిల్లాలోని పరిగి మండలం రూప్ సింగ్ తండాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి తగాదాలతో ఒక వ్యక్తి తన తండ్రిని, పిన్నిని, ఆమె కొడుకును పెట్రోల్ పోసి చంపేందుకు ప్రయత్నించాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంజి పై కప్పుపై నుంచి పెట్రోల్ ను వారిపై .పోశాడు నిందితుడు. తరువాత మంట వెలిగించాడు. ఎక్కువ మోతాదులో పెట్రోల్ పోయడంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హైదరాబాద్ మెరుగైన చికిత్స కోసం తరలించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తన తండ్రి ఆస్తిలో వాటాకోసం చాలాకాలంగా గొడవ చేస్తున్నాడు. ఆస్తిలో ఎక్కువ వాటా తనకే కావాలని పట్టుపడుతున్నాడు. ఈ క్రమంలో తనకు ఆస్తి రాకుండా తన సవతి తల్లి అడ్డుగా ఉందని కోపం పెంచుకున్నాడు. ఈ తగాదాల నేపథ్యంలోనే తండ్రిని, సవతి తల్లిని, ఆమె కొడుకును హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. అర్థరాత్రి సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా, నిందితుడు గుట్టుచప్పుడు కాకుండా ఇంటి పైకప్పు ఎక్కాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పైకప్పు పైనుండి కింద నిద్రిస్తున్న తండ్రి, పిన్ని మరియు ఆమె కుమారుడిపై పోశాడు. వారు తేరుకునేలోపే నిప్పు అంటించడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. నిద్రలో ఉన్న వారు మంటల ధాటికి హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు.
వారి కేకలు విన్న స్థానికులు వారిని రక్షించడానికి ప్రయత్నించారు. అయితే, అప్పటికే వారికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని హైదరాబాద్ కు మెరుగైన చికిత్స కోసం తరలించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆస్తి కోసం కన్న కొడుకే తండ్రిని చంపే ప్రయత్నం చేయడం అక్కడి ప్రజల్లో ఆందోళనకు దారితీసింది.




