బరితెగించిన దొంగలు: కారు అద్దాలు పగలగొట్టి రూ. 3 లక్షలు లూటీ!

బోధన్ పట్టణంలోని గోశాల రోడ్డు వద్ద భారీ దొంగతనం జరిగింది. కారు అద్దాలు పగలగొట్టి రూ. 3 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 March 2026 5:16 PM IST
Theft in Bodhan
X

బరితెగించిన దొంగలు: కారు అద్దాలు పగలగొట్టి రూ. 3 లక్షలు లూటీ!

బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో దుండగులు బరితెగించారు. నిత్యం రద్దీగా ఉండే గోశాల రోడ్డు వద్ద శుక్రవారం మధ్యాహ్నం సినిమా ఫక్కీలో కారు అద్దాలు పగలగొట్టి రూ. 3 లక్షల నగదును అపహరించుకుపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఘటన వివరాలు:

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సాలూర మండలం జాడీ గ్రామానికి చెందిన హరిబాబు అనే వ్యక్తి పనుల నిమిత్తం బోధన్ పట్టణానికి వచ్చారు. తొలుత ఆయన కెనరా బ్యాంకులో రూ. 3 లక్షల నగదును డ్రా చేసుకున్నారు. ఆ నగదును తన కారులో ఉంచి, మరిన్ని డబ్బుల కోసం గోశాల రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంకు లోపలికి వెళ్లారు.

కుప్పకూలిన బాధితుడు:

హరిబాబు బ్యాంకు పనులు ముగించుకుని తిరిగి వచ్చేసరికి తన కారు అద్దాలు ధ్వంసమై ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే కారు లోపల తనిఖీ చేయగా, తాను ఉంచిన రూ. 3 లక్షల నగదు కనిపించలేదు. దుండగులు అద్దం పగలగొట్టి నగదుతో ఉడాయించారని గ్రహించిన బాధితుడు అక్కడే లబోదిబోమంటూ కుప్పకూలిపోయారు.

రంగంలోకి పోలీసులు:

సమాచారం అందుకున్న బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ (SHO) వెంకటనారాయణ తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, యూనియన్ బ్యాంకు పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నగదు డ్రా చేసినప్పటి నుండి బాధితుడిని ఎవరైనా వెంబడించారా? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story