Stock Market: రిలయన్స్ జోరు.. ఐటీ, బ్యాంకింగ్ బేజారు! ఐదు రోజుల్లో అంబానీ అకౌంట్లో రూ.45,000 కోట్లు!
Stock Market: మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎఫెక్ట్ భారత మార్కెట్‌పై ఎలా ఉంది? రిలయన్స్ లాభాల బాట పడితే, దిగ్గజ బ్యాంకులు, ఐటీ కంపెనీలు ఎందుకు నష్టపోయాయి? గత వారం మార్కెట్ రిపోర్ట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకోండి.
Stock Market: రిలయన్స్ జోరు.. ఐటీ, బ్యాంకింగ్ బేజారు! ఐదు రోజుల్లో అంబానీ అకౌంట్లో రూ.45,000 కోట్లు!
మధ్య ప్రాచ్యంలో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో గత వారం భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. సెన్సెక్స్-నిఫ్టీలు ఒక్కోసారి భారీగా పతనమవుతూ, మరికొన్ని సార్లు కోలుకుంటూ ఇన్వెస్టర్లను ఊరించాయి. గత ఐదు రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ మొత్తంగా 30.96 పాయింట్లు పడిపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 36.6 పాయింట్ల స్వల్ప నష్టంతో ముగిసింది. వారం ప్రారంభంలో మూడు రోజులు లాభాల్లో ఉన్నప్పటికీ, గురువారం ఒక్కసారిగా వచ్చిన భారీ పతనం ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసిందని నిపుణులు చెబుతున్నారు. అయితే, శుక్రవారం మార్కెట్ మళ్లీ పుంజుకుని సెన్సెక్స్ 325 పాయింట్లు, నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో ముగియడం కాస్త ఊరటనిచ్చే విషయంగా పేర్కొన్నారు.
అంబానీ కంపెనీ పంట పండింది..
మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్లు మాత్రం పండగ చేసుకున్నారు. కేవలం ఐదు రోజుల్లోనే రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.45,943 కోట్లు పెరిగి రూ.19.14 లక్షల కోట్లకు చేరింది. రిలయన్స్‌తో పాటు భారతీ ఎయిర్టెల్ (రూ.24,462 కోట్లు), ఎస్బీఐ (రూ.10,707 కోట్లు) కూడా లాభపడ్డాయి. ప్రభుత్వ బీమా దిగ్గజం ఎల్ఐసీ (LIC), ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఇన్వెస్టర్లకు స్వల్ప లాభాలను అందించాయి.
మరోవైపు గత వారం దేశీయ దిగ్గజ కంపెనీలు గట్టి షాక్ తిన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో పాటు హెచ్‌యూఎల్ (HUL) మార్కెట్ విలువ రూ.18,009 కోట్లు తగ్గగా, బజాజ్ ఫైనాన్స్ రూ.15,338 కోట్లు, టాటా గ్రూప్‌నకు చెందిన టీసీఎస్ (TCS) రూ.7,127 కోట్ల మేర నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన మార్కెట్ క్యాప్‌లో రూ.6,171 కోట్లను కోల్పోయింది.
టాప్-10లో రిలయన్స్ నంబర్ వన్
మార్కెట్ విలువ పరంగా దేశంలోని టాప్-10 కంపెనీల ర్యాంకింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, హెచ్‌యూఎల్ నిలిచాయి. యుద్ధ పరిస్థితులు, గ్లోబల్ మార్కెట్ సంకేతాల దృష్ట్యా వచ్చే వారం కూడా మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




