Iran Oil Exports: యుద్ధంలో ఇరాన్ ఆయిల్ గేమ్.. గల్ఫ్ దేశాలకు గట్టి దెబ్బ!

Iran Oil Exports: యుద్ధం నడుస్తున్నా ఇరాన్ తన చమురు ఎగుమతులను కొనసాగిస్తూ, హోర్ముజ్ ద్వారా భారీగా ఆదాయం గడిస్తోంది. గల్ఫ్ దేశాల చమురు వ్యాపారానికి గట్టి దెబ్బ

KVD Varma
Published on: 23 March 2026 11:33 AM IST
Iran Oil Exports: యుద్ధం నడుస్తున్నా ఇరాన్ తన చమురు ఎగుమతులను కొనసాగిస్తూ, హోర్ముజ్ ద్వారా భారీగా ఆదాయం గడిస్తోంది.
X

Iran Oil Exports

Iran Oil Exports: యుద్ధంలోనూ ఇరాన్ ఆర్థిక అవసరాలను దిగ్విజయంగా నెరవేర్చుకుంటోంది. ఒకపక్క యుద్ధంతో ఇరాన్ లొంగదీసుకోవాలని అనుకుంటున్న అమెరికా ప్రయత్నాలు గట్టిగానే సాగుతున్నాయి. ఎప్పుడు ఏ మిసైల్ వచ్చిపడుతుందో తెలీని పరిస్థితి. అయినా, ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. ధీటుగా అమెరికాను ఎదుర్కొంటూనే మరోవైపు తన చమురు వ్యాపారాన్ని మరింత పెంచుకుంది. అదే సమయంలో హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేయడం ద్వారా తన పట్టు పెంచుకుంది. అంతేకాకుండా, అక్కడ నుంచి వెళ్లే ప్రతి షిప్ నుంచి సుంకాలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటోంది. అమెరికాకు మిత్రదేశాలుగా నిలిచిన గల్ఫ్ దేశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఇరాన్ నేరుగా ఈ దేశాలనే టార్గెట్ చేసింది. అటు క్షిపణి దాడులు చేస్తూనే.. మరోవైపు చమురు వ్యాపారంలో వారి అవకాశాలను గండి కొట్టింది ఇరాన్.

యుద్ధాన్ని అవకాశంగా మార్చుకుని..

ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్‌లతో జరుగుతున్న యుద్ధాన్ని ఒక అవకాశంగా మార్చుకుంది. ప్రపంచ చమురు సంక్షోభానికి భయపడి, అమెరికా ఖార్గ్ ద్వీపం సమీపంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది కానీ చమురు టెర్మినల్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకోలేదు. దీనిని అవకాశంగా తీసుకుని, ఇరాన్ ఖార్గ్ టెర్మినల్‌ను పనిచేసే స్థితిలోనే ఉంచి, ఒక "ఘోస్ట్ ఫ్లీట్" ద్వారా చైనాకు సరఫరాను కొనసాగిస్తోంది.

అంతర్జాతీయ ఇంధన సంస్థ, ఎస్&పి గ్లోబల్ లెక్కల ప్రకారం, ఇరాన్ ప్రతిరోజూ 1.7 నుండి 2 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. ఆ దేశ చమురు ఎగుమతుల్లో దాదాపు 90% ఇప్పటికీ ఖార్గ్ టెర్మినల్ నుండే జరుగుతుండడం గమనార్హం.

దక్షిణ పార్స్ గ్యాస్ క్షేత్రంపై అమెరికా చేసిన దాడి ఎగుమతులపై ప్రభావం చూపింది. కానీ, గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపివేయలేకపోయింది. మరోవైపు హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే విదేశీ నౌకలపై ఇరాన్ ఒక్కో నౌకకు సుమారు 165 మిలియన్ల రూపాయల 'యుద్ధ పన్ను' కూడా విధిస్తోందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అలా యుద్ధం హోరాహోరీగా సాగుతున్నప్పటికీ, ఇరాన్ తన ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం క్షీణించకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. యుద్ధంలో ఇదే కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే, ప్రపంచ ఆయిల్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా ఇరాన్ చమురు క్షేత్రాలపై పూర్తిస్థాయిలో దాడులు చేయలేకపోతోంది. ఎందుకంటే, ఆయిల్ సంక్షోభం అంటూ తలెత్తితే.. ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై తీవ్ర వ్యతిరేకత చూపే అవకాశం ఉంది. ఇప్పటికే యుద్ధం విషయంలో ఇంటా, బయటా వస్తున్న విమర్శలతో అమెరికా ఆత్మరక్షణలో పడింది.

గల్ఫ్ దేశాల చమురు వ్యాపారం పై పెద్ద దెబ్బ..

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ, దాని నిరంతర దాడులు సౌదీ అరేబియా, ఖతార్, ఇరాక్, కువైట్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలకు సరఫరాలను ప్రభావితం చేశాయి. సురక్షితమైన సముద్ర మార్గాల కొరత, పెరిగిన దాడులు, రవాణాపరమైన ఇబ్బందుల కారణంగా వారి మొత్తం ఉత్పత్తిలో 70% తగ్గుదల ఏర్పడినట్లు రిపోర్స్ సూచిస్తున్నాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితి వ్యాపారపరంగా అగమ్యగోచరంగా మారింది. మరోవైపు తమ మీద ఇరాన్ దాడులు చేస్తున్నా.. ఏమీ చేయలేని పరిస్థితిలో గల్ఫ్ దేశాలు పడిపోయాయి. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తే.. ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్ యుద్ధ వ్యూహానికి తిరుగులేకుండా పోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హోర్ముజ్ జలసంధి మూసివేత.. ఈ దేశాల వ్యాపారం ఢమాల్!

సౌదీ అరేబియా

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియా, ఉత్పత్తిని కొనసాగించడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. చమురు ఉత్పత్తి రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల నుండి 8 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయింది. తూర్పు-పశ్చిమ పైప్‌లైన్ ద్వారా యాన్బుకు చమురు రవాణా చేస్తున్నా.. ఇది సరిపోవడం లేదు. హోర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల నిల్వ ట్యాంకులు నిండిపోయాయి. దీంతో అరామ్కో అనేక చమురు బావులను తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చింది.

ఖతార్

ప్రపంచ ఎల్ఎన్జి అవసరాలలో 20% ఖతార్ సరఫరా చేస్తుంది. ఖతార్‌లోని రాస్ లఫాన్ గ్యాస్ కేంద్రంపై జరిగిన దాడుల నేపథ్యంలో, "ఫోర్స్ మేజర్" విధించారు. అంటే సరఫరాలకు హామీ ఉండదు. ఈ దేశం ఎల్ఎన్జి ఎగుమతి సామర్థ్యం 17% తగ్గింది మరియు ఓడరేవులలో ట్యాంకర్లు నిలిచిపోవడంతో, ప్రపంచ ధరలపై ఒత్తిడి పెరుగుతోంది.

ఇరాక్

ఇరాక్‌లోని బీపీ, ఈఎన్ఐ, టోటల్ వంటి విదేశీ కంపెనీలు తమ సిబ్బందిని వెనక్కి తీసుకుంటున్నాయి. హోర్ముజ్ జలసంధి మూసివేత ఫలితంగా ఉత్పత్తి రోజుకు 4.3 మిలియన్ల బ్యారెళ్ల నుండి 1.3 మిలియన్ల బ్యారెళ్లకు పడిపోయింది. ఇది సుమారు 70% క్షీణత. ప్రత్యామ్నాయ పైప్‌లైన్‌లు లేకపోవడంతో స్టోరేజీ ఫుల్ అయిపొయింది. దీంతో వెస్ట్ ఖుర్నా, మజ్నూన్ వంటి ప్రధాన క్షేత్రాలలో పనులు నిలిచిపోయాయి.

కువైట్

కువైట్ పూర్తిగా హోర్ముజ్ జలసంధిపై ఆధారపడి ఉంది. దిగ్బంధనం మరియు "యుద్ధ పన్ను" కారణంగా ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. ఒక్కో ఓడపై విధించిన 165 మిలియన్ యువాన్ల సుంకం, బీమా సంక్షోభం ఎగుమతులను దాదాపు సున్నాకు తగ్గించాయి. బావులలో పెరిగిన ఒత్తిడి 50% ఉత్పత్తిని నిలిపివేయడానికి దారితీసింది. ట్యాంకర్లు ఓడరేవులలో నిలిచిపోయాయి. కానీ అవి ముందుకు సాగే ధైర్యం చేయలేకపోతున్నాయి.

యూఏఈ

అబుదాబి-ఫుజైరా పైప్‌లైన్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నప్పటికీ, మొత్తం డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. మిగిలిన చమురు హోర్ముజ్ జలసంధిలో నిలిచిపోయింది. ఇరాన్ దాడుల వల్ల ఓడల బీమా ప్రీమియంలు 400% పెరిగాయి. దీంతో, వాణిజ్యం మరింత ఖరీదైనదిగా మారి, ఫుజైరా ఓడరేవులో కార్యకలాపాలు తగ్గాయి.

ఇరాన్ చమురు కొనుగోళ్లపై మినహాయింపును పొడిగించిన అమెరికా..

ప్రపంచ చమురు, ఇంధన మార్కెట్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం గురించి అమెరికా కూడా ఆందోళన చెందుతోంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, మార్చి 20న, ఇరాన్ చమురు కొనుగోలుపై ఆంక్షల నుండి 30 రోజుల మినహాయింపును జారీ చేసింది. ఈ మినహాయింపు ప్రస్తుతం సముద్రంలో ఉన్న ఇరాన్ చమురు ట్యాంకర్ల కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ ప్రకటనను అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ చేశారు. ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ మినహాయింపు మార్చి 20 నుండి ఏప్రిల్ 19 వరకు చెల్లుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న ఈ సరఫరాను తాత్కాలికంగా ప్రపంచానికి అందుబాటులోకి తీసుకురావడం వల్ల, సుమారు 14 కోట్ల బ్యారెళ్ల చమురు ప్రపంచ మార్కెట్లోకి వేగంగా విడుదల అవుతుందని స్కాట్ బెస్సాంట్ అన్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన లభ్యత పెరిగి, సరఫరాపై ఉన్న తాత్కాలిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

అదండీ విషయం.. యుద్ధంలో బలం ఒక్కటే సరిపోదు.. బుర్ర కూడా కావాలని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. బలహీనం అని అనుకున్న ఇరాన్ ను బలవంతమైనదిగా అందరూ భావించే అమెరికా యుద్ధంలో కనీసం నిలువరించలేకపోతుండడం ఇప్పుడు ఆ సామెతకు పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు.

KVD Varma

KVD Varma

Next Story