Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. ఏడాదిలో 11% కుదేలు.. సామాన్యుడి జేబుకు చిల్లు!
Indian Rupee: డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఏడాది కాలంలోనే 11 శాతం మేర క్షీణించి రికార్డు పతనాన్ని నమోదు చేసింది.
Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. ఏడాదిలో 11% కుదేలు.. సామాన్యుడి జేబుకు చిల్లు!
Indian Rupee: అంతర్జాతీయ పరిణామాలు, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే ఆందోళనకర స్థాయిలో పడిపోతోంది. గత ఏడాది కాలంలో రూపాయి ఏకంగా రూ.10 మేర క్షీణించడం భారత ఆర్థిక వ్యవస్థపై బహుముఖ ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ పతనం సామాన్యుడిపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఏడాదిలోనే 11 శాతం పతనం..
గత ఏడాది మే 2వ తేదీన డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 83.76 వద్ద ఉండగా, ప్రస్తుతం అది 93.49 స్థాయికి చేరుకుంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే రూపాయి విలువ సుమారు 11 శాతం పడిపోయింది. ముడి చమురు ధరలు బ్యారెల్ 100 డాలర్ల వద్దే కొనసాగితే, రూపాయి మరింత క్షీణించి 95 స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా భారతదేశం తన చమురు అవసరాలలో ఎక్కువ భాగం దిగుమతులపైనే ఆధారపడుతుంది. రూపాయి పతనంతో చమురు దిగుమతి భారం పెరిగి, రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే తయారీ రంగంలో వాడే ముడి పదార్థాల ధరలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచి, ఆర్‌బీఐ (RBI)కి పెద్ద సవాలుగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఐసీఆర్ఏ (ICRA) గణాంకాల ప్రకారం, దేశ వాణిజ్య లోటు గతేడాది ఫిబ్రవరిలో 14.4 బిలియన్ డాలర్లు ఉండగా, ఫిబ్రవరి 2026 నాటికి అది రెట్టింపు అయి 27.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కరెన్సీ అస్థిరత కారణంగా విదేశీ పెట్టుబడిదారులు మార్కెట్ నుంచి వేగంగా వెనక్కి తగ్గుతున్నారు. కేవలం ఈ నెలలోనే స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.77,000 కోట్లకు పైగా వారి నిధులను ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది మొత్తం మీద ఈ విలువ రూ.90,000 కోట్లు దాటడం గమనార్హం.
రూపాయి పతనం వల్ల అన్ని రంగాలకు నష్టం జరగదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గడం వల్ల మన ఎగుమతులకు డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. ఐటీ (IT) సేవలు, వస్త్రాలు, కెమికల్స్, ఆటోమొబైల్ రంగాలు విదేశీ మారక ద్రవ్యం ద్వారా అధిక లాభాలను ఆర్జించే అవకాశం ఉందని చెబుతున్నారు. డాలర్లలో వచ్చే ఆదాయాన్ని రూపాయల్లోకి మార్చుకున్నప్పుడు వీరికి అధిక ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. రూపాయి విలువను నిలబెట్టేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ డాలర్లను విక్రయించడం ద్వారా మార్కెట్‌లో రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ముమ్మర ప్రయత్నాలను చేస్తుంది. అయితే, ఇది విదేశీ మారక నిల్వలను హరించివేస్తుంది. ఒకవైపు ఆర్థిక వృద్ధిని కాపాడటం, మరోవైపు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం మధ్య ఆర్‌బీఐ సమతుల్యత పాటించాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, రూపాయి విలువలో వస్తున్న ఈ భారీ మార్పులు దేశ విదేశీ వాణిజ్యాన్ని, సామాన్యుడి జేబును తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయని అంటున్నారు.




