Gold Imports in India :భయపెడుతున్న బంగారం దిగుమతులు...దేశం అప్పులపాలౌతుందా? నిపుణులు ఏమంటున్నారు?

Gold Imports in India
x

Gold Imports in India :భయపెడుతున్న బంగారం దిగుమతులు...దేశం అప్పులపాలౌతుందా? నిపుణులు ఏమంటున్నారు?

Highlights

Gold Imports in India: మనదేశంలో బంగారం అంటే కేవలం అభరణం కాదు..అదో భావోద్వేగం. భద్రతకు సంకేతం. కానీ, ఈ బంగారం ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. తాజాగా విడుదలైన గణాంకాలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమౌతుంది.

Gold Imports in India: మనదేశంలో బంగారం అంటే కేవలం అభరణం కాదు..అదో భావోద్వేగం. భద్రతకు సంకేతం. కానీ, ఈ బంగారం ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. తాజాగా విడుదలైన గణాంకాలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమౌతుంది.

భారీగా బంగారం దిగుమతులు

2025-26 ఆర్థిక సంవత్సరంలో అంటే గతేడాది ఏప్రిల్ నుండి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు భారత్‌లోకి బంగారం దిగుమతులు ఏకంగా 28.73% పెరిగి 69 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఏడాది ఇదే సమయంలో ఇవి 53.52 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండటం గమనార్హం. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 15 బిలియన్ డాలర్ల పెరుగుదల నమోదైంది. ఈ బంగారం దిగుమతి పెరుగుదల ప్రభావం దేశ వాణిజ్య లోటుపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వాణిజ్య లోటు 310.60 బిలియన్ డాలర్లకు చేరగా, గత ఏడాది ఇది 261.80 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే దిగుమతులు అధికం అవుతూ, ఎగుమతులు తగ్గడం దేశ ఆర్థిక స్థితిపై ఒత్తిడిని పెంచుతోంది.

దిగుమతులు ఎందుకు పెరుగుతున్నాయి?

దీనికి ప్రధాన కారణం మనకు బంగారంపై ఉన్న మక్కువే. వివాహాలు, పండుగలు, పెట్టుబడులు ఇలా కారణం ఏమైనా కావొచ్చు... బంగారం కొనుగోలు తగ్గడం లేదు. ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,50,660 వద్ద ఉంది. ధరలు పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. కొన్ని రోజుల క్రితం రికార్డు స్థాయిలో ధరలు పెరిగినా కొనుగోలు తగ్గకపోవడం భారతీయ వినియోగదారులు బంగారంపై ఎంత మక్కువ చూపుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

భారత్‌కు బంగారం ఎక్కడి నుంచి వస్తుంది?

భారత్‌కు వచ్చే బంగారంలో దాదాపు 40% స్విట్జర్లాండ్ నుంచి వస్తోంది. ఆ తర్వాత యూఏఈ (16%), దక్షిణాఫ్రికా (10%) ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో స్విట్జర్లాండ్ నుంచి దిగుమతులు 719.30% పెరగడం పెద్ద చర్చకు దారి తీసింది. బంగారం దిగుమతులు పెరగడం వలన దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు కూడా పెరుగుతోంది. 2025 డిసెంబర్ త్రైమాసికంలో ఇది జీడీపీలో 1.3%, అంటే 13.2 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది భవిష్యత్తులో రూపాయి విలువపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

వెండి కూడా పెరుగుదలలోనే

బంగారం మాత్రమే కాదు, వెండి దిగుమతులు కూడా 142.87% పెరిగి 11.43 బిలియన్ డాలర్లకు చేరాయి. వెండి పారిశ్రామిక రంగాల్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా రంగాల్లో విస్తృతంగా ఉపయోగించడం దీనికి కారణం. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కొన్ని ఆంక్షలు విధించింది. అనవసర దిగుమతులను తగ్గించి విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యం.

నిపుణుల అభిప్రాయం ఏమిటి?

దేశం అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఇప్పుడే లేదు. కానీ ఈ ట్రెండ్ కొనసాగితే ఆర్థిక సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎగుమతులు పెంచడం, దిగుమతులను నియంత్రించడం అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారానికి బదులుగా ప్రభుత్వం తీసుకొచ్చిన గోల్డ్‌ బాండ్లపై పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వలన ఆయా రంగాలకు ఊతం ఇచ్చినట్టు అవుతుంది. బంగారం భద్రతే కానీ, దేశానికి ముప్పు తెచ్చే విధంగా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories