Chicken Price : రంజాన్ డిమాండ్, ఎండల ఎఫెక్ట్.. రికార్డు స్థాయికి చేరిన చికెన్ ధర

Chicken Price : తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఎండల తీవ్రతతో కోళ్ల ఉత్పత్తి తగ్గడం వల్ల హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ కిలో చికెన్ ధర రూ. 325 కి చేరుకుంది.

CR Reddy
Published on: 15 March 2026 8:05 AM IST
Chicken Prices
X

 Chicken Prices

Chicken Price : నాన్ వెజ్ ప్రియులకు భానుడు గట్టి షాకే ఇచ్చాడు. ఆదివారం వచ్చిందంటే చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగని సగటు జీవికి ఇప్పుడు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి వరకు రూ.270 నుండి రూ.300 మధ్యలో ఊగిసలాడిన కిలో చికెన్ ధర, ఇప్పుడు ఒక్కసారిగా రూ.325 మార్కును దాటేసింది. వేసవి ఎండల తీవ్రత పెరగడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడం, ఎండ దెబ్బకు ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడటం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. సప్లై తక్కువగా ఉండటం, డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ధరల పరిస్థితి చూస్తే.. భాగ్యనగరం హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.325 కి చేరింది. లైవ్ బర్డ్ ధర ఫారాల వద్ద రూ.170 పలుకుతుండగా, రిటైల్ షాపుల్లో రూ.197 గా ఉంది. ఇక విజయవాడ విషయానికి వస్తే, అక్కడ స్కిన్‌లెస్ కిలో రూ.317 వద్ద కొనసాగుతోంది. కరీంనగర్ వంటి పట్టణాల్లో కూడా చికెన్ ధరలు హైదరాబాద్‌తో పోటీ పడుతూ రూ.325 వద్దే ఉన్నాయి. చిత్రమైన విషయం ఏంటంటే.. చికెన్ రేట్లు ఇంతగా పెరుగుతున్నా, గుడ్ల ధరలు మాత్రం కాస్త ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో డజను గుడ్లు రూ.64 కే లభిస్తున్నాయి.

ఇక నాటుకోడి ప్రియుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. నాటుకోడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో నాటుకోడి రూ.750 నుండి రూ.800 వరకు పలుకుతోంది. రంజాన్ మాసం కావడంతో చికెన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. దీనికి తోడు ఎండల వల్ల కోళ్లు చనిపోతుండటంతో ఉత్పత్తిదారులకు తీరని నష్టం వాటిల్లుతోంది. గతేడాది సంక్రాంతి సమయంలో బాయిలర్ కోడి ధర రూ. 350 కి చేరిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే మరో వారం రోజుల్లో చికెన్ ధర రూ.350 మార్కును సులువుగా దాటేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే రోజుల్లో ఎండలు మరింత ముదరనున్నాయి. ఇది పౌల్ట్రీ రంగానికి పెద్ద సవాల్‌గా మారనుంది. ఎండ తీవ్రతను తట్టుకోలేక కోళ్లు చనిపోతుండటంతో యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. ఉత్పత్తి తగ్గితే ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, మే నెల నాటికి చికెన్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండకపోవచ్చని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం రోజున చికెన్ సెంటర్ల వద్ద జనం రద్దీ కనిపిస్తున్నా, పెరిగిన రేట్లు చూసి చాలామంది తక్కువ పరిమాణంలోనే కొనుగోలు చేస్తూ సరిపెట్టుకుంటున్నారు.

CR Reddy

CR Reddy

Next Story