LPG crisis: ఎల్పీజీ సరఫరాపై కేంద్రం భరోసా.. భయపడవద్దని విజ్ఞప్తి

LPG crisis: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్, చమురు సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేసింది.

KVD Varma
Published on: 17 March 2026 5:06 PM IST
LPG crisis: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్, చమురు సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
X

LPG crisis

LPG crisis: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. దీంతో ఎల్పీజీ సరఫరాపై ఆందోళనలు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్ నిరంతరాయంగా లభించేలా తగిన చర్యలు తీసుకున్నామని కేంద్రం తెలిపింది.

ముడి చమురు లోడింగ్ కార్యకలాపాల సమయంలో ఫుజైరా ఆయిల్ టెర్మినల్‌పై దాడి జరిగింది. ఆ తర్వాత, భారత జెండాతో ఉన్న 'జగ్ లాడ్కి' అనే ట్యాంకర్ ఫుజైరా సింగిల్ పాయింట్ మూరింగ్ నుండి సురక్షితంగా బయలుదేరిందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. మన దేశం కోసం 80,800 మెట్రిక్ టన్నుల ముర్బన్ ముడి చమురుతో ఈ నౌక ఆదివారం ఉదయం 10:30 గంటలకు (ఐఎస్‌టి) బయలుదేరగా, అందులోని భారతీయ సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎల్పీజీ సిలిండర్ల కోసం భయాందోళనలతో ఒక్కసారిగా ప్రజలు బుకింగ్స్ చేయడం మొదలు పెట్టారు. దీంతోకంగారు పడొద్దనీ.. అలా చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తులు కూడా పనిచేస్తునట్టు కనిపిస్తోందని ప్రభుత్వం చెప్పింది. దేశీయ ఎల్పీజీ బుకింగ్‌లు శుక్రవారం 88.8 లక్షల నుండి శనివారం 77 లక్షలకు పడిపోయాయి. ఆన్‌లైన్ బుకింగ్‌లు 84% నుండి 87%కి పెరిగాయి. LPG పంపిణీ కేంద్రాల వద్ద సరఫరా నిలిచిపోయినట్లు ఎక్కడ రిపోర్ట్స్ రాలేదు. అయితే, గతంలో అసాధారణంగా అధిక సంఖ్యలో కాల్స్ రావడం వల్ల కొన్ని గ్యాస్ డిపోల వద్ద వ్యవస్థకు అంతరాయాలు ఏర్పడి, పెద్ద క్యూలైన్లు ఏర్పడ్డాయని చెబుతున్నారు.

ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా, బెంగళూరులోని ఫుడ్ అండ్ బేవరేజెస్ పరిశ్రమపై LPG కొరత ప్రభావం చూపడం ప్రారంభించింది. వాణిజ్య LPG సరఫరాలు సాధారణ స్థాయిలలో సుమారు 20%కి పరిమితం కావడంతో, తమ వ్యాపారం దాదాపు 30% తగ్గిందని నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు తెలిపాయి. గ్యాస్ ఆదా చేయడానికి అనేక రెస్టారెంట్స్ తమ మెనూలను తగ్గించాయి. వేయించిన స్నాక్స్, కబాబ్‌ల వంటి వంటకాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. అలాగే వర్కింగ్ అవర్స్ కూడా తగ్గించాయి.

కొన్ని పెద్ద సంస్థలు వంట కొనసాగించడానికి కట్టెల వాడకానికి మారాయి. అయితే, తమకుండే స్థల పరిమితుల కారణంగా అటువంటి ప్రత్యామ్నాయాలు కష్టమని చిన్న దుకాణాలు చెబుతున్నాయి. పేయింగ్ గెస్ట్ వసతులు, హాస్టళ్లు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు కూడా ఫుడ్ కోసం ఇబ్బందులు రావచ్చని హెచ్చరించాయి.

బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ చెబుతున్నాడని ప్రకారం, గ్యాస్ కొరత కారణంగా మెనూల నుండి అనేక ప్రసిద్ధ వంటకాలను తొలగించడంతో, రెస్టారెంట్లు సుమారు 25–30% నష్టాలను ఎదుర్కొంటున్నాయి. వినియోగదారుల ఫుట్ ఫాల్ కూడా తగ్గిందని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీలో, రాజధానిలో వంటగ్యాస్ సరఫరా స్థిరంగా ఉందని ఆహార సరఫరాల శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. దేశీయ వినియోగదారులకు ప్రాధాన్యతనిస్తూ, మార్కెట్లను పర్యవేక్షించడానికి, నిల్వలను నిరోధించడానికి, ఎల్‌పిజి సరసమైన పంపిణీని నిర్ధారించడానికి ఢిల్లీ ప్రభుత్వం 70 ప్రత్యేక బృందాలను మోహరించింది.

KVD Varma

KVD Varma

Next Story