Health Tips: ప్రోటీన్ సప్లిమెంట్లు వాడుతున్నారా? అతిగా తీసుకుంటే ఈ అవయవాలు దెబ్బతినవచ్చు!
Health Tips: కండరాల పుష్టి కోసం ప్రోటీన్ సప్లిమెంట్లు వాడుతున్నారా? అయితే జాగ్రత్త! ప్రోటీన్ పౌడర్లను అతిగా తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకోండి.
Health Tips: ప్రోటీన్ సప్లిమెంట్లు వాడుతున్నారా? అతిగా తీసుకుంటే ఈ అవయవాలు దెబ్బతినవచ్చు!
Health Tips: కండరాల పుష్టి కోసం, బాడీ బిల్డింగ్ కోసం ఈ రోజుల్లో యువత ప్రోటీన్ షేక్స్, సప్లిమెంట్లను విరివిగా వాడుతున్నారు. ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషకమే అయినప్పటికీ, అవసరానికి మించి తీసుకుంటే అది మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రోటీన్‌ను అవసరానికి మించి అతిగా తీసుకుంటే కలిగే ఆరోగ్య నష్టాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అతిగా తీసుకుంటే వచ్చే అనర్థాలు ఇవే..
ప్రోటీన్ సప్లిమెంట్ల మితిమీరిన వినియోగం వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఏర్పడుతుందన్నారు. రక్తంలోని ప్రోటీన్‌ను ప్రాసెస్ చేయడం కిడ్నీలకు పెద్ద పని, దీర్ఘకాలం పాటు అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలపై భారం పెరిగి, అవి దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రోటీన్‌ను తీసుకోవడం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
చాలా మందిలో ప్రోటీన్ పౌడర్లు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి సమస్యలు కనిపిస్తాయి. అలాగే శరీరంలో ప్రోటీన్ స్థాయిలు పెరిగే కొద్దీ దానిని జీర్ణం చేయడానికి నీటి అవసరం కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. తగినంత నీరు తాగకపోతే శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుందని చెబుతున్నారు. కొన్ని సప్లిమెంట్లలో రుచి కోసం చక్కెర, అధిక క్యాలరీలు కలుపుతారని, ఇది కండరాలు పెరగడానికి బదులు అనవసరంగా బరువు పెరిగేలా చేస్తుందని వివరించారు. కేవలం సప్లిమెంట్లపైనే ఆధారపడి సహజమైన ఆహారాన్ని పక్కన పెట్టడం వల్ల శరీరానికి అందాల్సిన ఇతర విటమిన్లు, ఖనిజాలు అందవని హెచ్చరించారు.
అసలు ప్రోటీన్ ఎంత అవసరం అంటే..
ప్రతి వ్యక్తికి ప్రోటీన్ అవసరం వారి వయస్సు, బరువు, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి కిలో బరువుకు సుమారు 0.8 గ్రాముల నుంచి 1 గ్రాము ప్రోటీన్ సరిపోతుందని చెబుతున్నారు. (ఉదాహరణకు మీరు 60 కిలోల బరువు ఉంటే, రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ అవసరం). అథ్లెట్లు, క్రీడాకారులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నిపుణుల సలహాతో మరికొంత ఎక్కువ తీసుకోవచ్చని సూచిస్తున్నారు.




