Kadapa: వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముస్లింల పూజలు

Kadapa: కడప జిల్లాలో మతసామరస్యానికి నిదర్శనం! ఉగాది పండగ వేళ శ్రీవెంకటేశ్వర స్వామిని తమ అల్లుడిగా భావించి, ముస్లిం సోదరులు పట్టువస్త్రాలు సమర్పించే అరుదైన ఆచారం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 March 2026 2:37 PM IST
Kadapa
X

Kadapa: వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముస్లింల పూజలు

కడప: కులమతాలకు అతీతంగా, గంగా-జమునా తెహజీబ్‌కు నిలువుటద్దంగా నిలుస్తోంది వైఎస్ఆర్ కడప జిల్లాలోని దేవుని కడప క్షేత్రం. ప్రతి ఏడాది ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడ ఒక అపురూప ఘట్టం ఆవిష్కృతమవుతుంది. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లుడిగా భావించే ముస్లిం సోదరులు, శతాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ స్వామివారికి పట్టువస్త్రాలు, పూజా సామగ్రిని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

అల్లుడైన శ్రీవారు.. ఆడపడుచు బీబీనాంచారమ్మ

స్థానిక ముస్లింల నమ్మకం ప్రకారం.. శ్రీవారి భార్య అయిన బీబీనాంచారమ్మను తమ ఇంటి ఆడపడుచుగా వారు భావిస్తారు. ఈ క్రమంలోనే శ్రీవేంకటేశ్వరుడు తమకు ‘అల్లుడు’ అవుతారని వారి నమ్మకం. అందుకే ప్రతి ఉగాది రోజున కొత్త అల్లుడికి, తమ ఆడపడుచుకు అందించాల్సిన కానుకలను ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో తీసుకువస్తారు.

ఘనంగా వేడుకలు

ఈ ఏడాది కూడా ఉగాది సందర్భంగా కడప నగరంలోని ముస్లిం సోదరులు మేళతాళాలతో, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా దేవుని కడప ఆలయానికి చేరుకున్నారు. తమ వెంట తెచ్చిన పట్టువస్త్రాలు, పండ్లు, పూలమాలలు, మరియు పూజా సామగ్రిని ఆలయ అర్చకులకు అందజేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ దృశ్యం చూస్తుంటే భక్తికి మతం అడ్డుకాదని మరోసారి నిరూపితమైంది.

గ్రామ దేవతలకు మొక్కులు

కేవలం శ్రీవారికే కాకుండా, ఉగాది నాడు గ్రామ దేవతలకు కూడా ముస్లింలు నైవేద్యాలు సమర్పించడం ఇక్కడ ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయం. ఈ వినూత్న ఆచారంపై మరింత సమాచారం అందిస్తున్నారు మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story