TTD Gas Supply : తిరుమల క్షేత్రాన్ని తాకిన యుద్ధ సెగ..గ్యాస్ కష్టాలు రాకుండా టీటీడీ మాస్టర్ ప్లాన్

TTD Gas Supply : పశ్చిమాసియా యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడకుండా టీటీడీ ముందస్తు చర్యలు తీసుకుంది. అన్నప్రసాదాల తయారీకి ఆటంకం కలగకుండా గ్యాస్ సరఫరా కొనసాగించాలని ఐఓసీఎల్ ను కోరింది.

CR Reddy
Published on: 12 March 2026 9:46 AM IST
TTD Gas Supply
X

TTD Gas Supply

TTD Gas Supply : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై నీలినీడలు కమ్మేలా చేస్తున్నాయి. ఈ సెగ ఇప్పుడు తిరుమల శ్రీవారి సన్నిధికి కూడా తాకింది. యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణలు విధిస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అప్రమత్తమైంది. కలియుగ వైకుంఠంలో భక్తులకు అందజేసే అన్నప్రసాదాల తయారీకి ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది.

తిరుమల కొండపై ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల తయారీ జరుగుతుంది. దీనికోసం టీటీడీకి రోజుకు సగటున 5 టన్నుల గ్యాస్ అవసరమవుతుంది. ఒక్క తిరుమలే కాకుండా తిరుపతి, తిరుచానూరులోని అనుబంధ ఆలయాలు, అన్నదాన సత్రాల్లో కూడా కమర్షియల్ గ్యాస్‌నే ఉపయోగిస్తారు. యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ సరఫరాలో కోత విధిస్తే, స్వామివారి ప్రసాదాల తయారీ నిలిచిపోయే ప్రమాదం ఉందని టీటీడీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) సంస్థకు కీలకమైన లేఖ రాశారు. తిరుమల క్షేత్రానికి ఇచ్చే గ్యాస్ సరఫరాను ఎట్టిపరిస్థితుల్లోనూ నిలిపివేయవద్దని కోరారు. తిరుమలను కేవలం కమర్షియల్ కోణంలోనే కాకుండా, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. గ్యాస్ సరఫరా ఆగితే అన్నప్రసాద వితరణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని లేఖలో వివరించారు.

టీటీడీ విజ్ఞప్తిపై ఐఓసీఎల్ (IOCL) సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చింది. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ, శ్రీవారి సేవలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా టీటీడీ యంత్రాంగం ముందుగానే మేల్కొనడం భక్తులకు ఊరటనిచ్చే అంశం. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆస్పత్రులు, విద్యాసంస్థలు మరియు ఆధ్యాత్మిక సంస్థలకు గ్యాస్ కోత ఉండదని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో తిరుమలలో గ్యాస్ కష్టాలు ఉండవని తెలుస్తోంది.

CR Reddy

CR Reddy

Next Story