Kukkunuru: కుక్కునూరులో భూ మాఫియా బరితెగింపు.. అడవిని నరికేసి అక్రమ నర్సరీలు..

Kukkunuru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అటవీ భూముల ఆక్రమణ యథేచ్ఛగా సాగుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 March 2026 5:10 PM IST
Kukkunuru
X

Kukkunuru: కుక్కునూరులో భూ మాఫియా పంజా: అటవీ, ప్రభుత్వ భూములు కబ్జా.. నర్సరీల పేరుతో లక్షల్లో వ్యాపారం..!

కుక్కునూరు, ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో భూ ఆక్రమణదారులు బరితెగిస్తున్నారు. విలువైన అటవీ మరియు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి, వ్యాపార సామ్రాజ్యాలను నిర్మిస్తున్నారు. జామాయిల్, జామ నర్సరీల ఏర్పాటు పేరుతో సాగుతున్న ఈ అక్రమ దందాకు స్థానిక అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జేసీబీలతో అడవి ధ్వంసం.. సరిహద్దుల గందరగోళం:

మండల పరిధిలోని బంజరాగూడెం, తొండిపాక, ఇబ్రహీంపేట, మిట్టగూడెం, గణపవరం సహా పదికి పైగా గ్రామాల్లో ఈ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. రెవెన్యూ మరియు అటవీ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వెంకటాపురం గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏండ్ల నాటి భారీ వృక్షాలను మిషన్లతో నరికివేసి, జేసీబీలతో భూమిని చదును చేస్తున్నారు. ట్రెంచ్‌లను పూడ్చివేసి మరీ నర్సరీలను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

అధికారుల 'నీది-నాది' ఆట.. ఆక్రమణదారులకు ఊతం:

భూ కబ్జాలపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అటవీ శాఖ అధికారులను అడిగితే అది రెవెన్యూ భూమి అని, రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే అది ఫారెస్ట్ ల్యాండ్ అని చెబుతూ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు. ఈ విభేదాలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు లక్షల రూపాయల విలువ చేసే జామాయిల్, జామ క్లోన్ నర్సరీలను ఏర్పాటు చేసి బహిరంగంగానే వ్యాపారం సాగిస్తున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి:

స్థానిక అధికారుల అండతోనే ఈ భూ ఆక్రమణలు జరుగుతున్నాయని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని కోరుతున్నారు. అక్రమ నర్సరీలను తొలగించి, ప్రభుత్వ భూములను కాపాడటంతో పాటు, ఆక్రమణదారులకు సహకరిస్తున్న అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story