Ration Card : సచివాలయాల చుట్టూ తిరగక్కర్లేదు.. ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
Ration Card : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు సేవలు ఇకపై 'మీ సేవ' కేంద్రాల్లోనూ లభ్యం. కొత్త కార్డు, సభ్యుల చేరిక, మార్పుల కోసం సచివాలయాలకు వెళ్లాల్సిన పనిలేదు.
Ration Card
Ration Card : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అదిరిపోయే తీపికబురు అందించింది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా అందులో మార్పులు చేర్పులు చేయాలన్నా ఇకపై ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన పనిలేదు. పౌర సరఫరాల శాఖ సేవలను మరింత వేగవంతం చేస్తూ, సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీ సేవ కేంద్రాల ద్వారా కూడా రేషన్ సేవలను సులభంగా పొందవచ్చు.
మీ సేవలో 9 రకాల సేవలు
ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డు కావాలన్నా లేదా ఉన్న కార్డులో సభ్యుల పేర్లు చేర్చాలన్నా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటం, అధికారులు ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో సామాన్యులకు చుక్కలు కనిపించేవి. ఈ ఇబ్బందులను గమనించిన ఏపీ ప్రభుత్వం, రేషన్ కార్డు సేవలను మీ సేవ పోర్టల్‌కు కూడా అనుసంధానించింది. దీనివల్ల ప్రజలు తమకు నచ్చిన సమయంలో దగ్గరలోని మీ సేవ కేంద్రానికి వెళ్లి కొత్త కార్డు దరఖాస్తు, సభ్యుల తొలగింపు, పేర్ల సవరణ, కార్డు విభజన, అడ్రస్ మార్పు, డూప్లికేట్ కార్డు పొందటం వంటి 9 రకాల పనులను చిటికెలో పూర్తి చేసుకోవచ్చు.
కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే
రేషన్ కార్డులో మార్పులు చేయించుకోవాలనుకునే వారు కొన్ని కీలక పత్రాలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొత్తగా పెళ్లయిన వారు కార్డులో పేరు చేర్చుకోవాలంటే పెళ్లి పత్రిక లేదా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పించాలి. చిరునామా మార్పు లేదా ఇతర సవరణల కోసం బర్త్ సర్టిఫికేట్, మార్కుల లిస్టు లేదా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లను గుర్తింపు కార్డులుగా వాడవచ్చు. ఈ పత్రాలను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయగానే మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
నిరంతర ప్రక్రియ
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి గడువు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ అని, అర్హత ఉన్న వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మీరు దరఖాస్తు చేసిన తర్వాత రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. మీ ఆర్థిక స్థితిగతులు, నిబంధనల ప్రకారం మీకు అర్హత ఉందని తేలితే వెంటనే ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డును జారీ చేస్తుంది. గతంలో ఇచ్చిన సాధారణ కార్డుల కంటే ఇవి మరింత మన్నికగా, క్యూఆర్ కోడ్ వంటి ఆధునిక ఫీచర్లతో ఉంటున్నాయి.
అర్హులందరికీ రేషన్ అందడమే లక్ష్యం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. అనర్హుల ఏరివేతతో పాటు, నిజమైన పేదలకు రేషన్ కార్డు అందేలా చూడాలని అధికారులను ఆదేశించింది. సచివాలయాల్లో సిబ్బంది కొరత లేదా పని ఒత్తిడి వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ మీ సేవ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కార్డుల్లో ఉన్న తప్పులను సవరించుకోవాలని పౌర సరఫరాల శాఖ సూచిస్తోంది.




