Free Smartphones : వాళ్లకు రూ.15 వేల ఫోన్ ఫ్రీ.. పది లక్షల బీమా రెడీ.. చంద్రబాబు మార్క్ అడ్మినిస్ట్రేషన్

Free Smartphones
x

Free Smartphones

Highlights

Free Smartphones : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 28,500 మంది వీవోఏలకు రూ.15 వేల విలువైన స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేసింది. వీరికి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు.

Free Smartphones : ఏపీలో కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే వర్కర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్రామ సంఘ సహాయకులుగా పిలవబడే వీవోఏలకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేసి, వారి డిజిటల్ కష్టాలను తీర్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న వీవోఏలు ఇప్పుడు హైటెక్ సేవలకు సిద్ధమవుతున్నారు. కేవలం ఫోన్లే కాకుండా, వారి భద్రత కోసం బీమా సౌకర్యాన్ని కూడా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో పనిచేస్తున్న గ్రామ సంఘ సహాయకులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. విజయవాడలోని రామవరప్పాడు ఎం కన్వెన్షన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 28,500 మంది వీవోఏలకు ఒక్కొక్కటి రూ.15,000 విలువైన స్మార్ట్‌ఫోన్లను అందజేశారు. ప్రభుత్వం అందించే సేవలను ప్రజలకు మరింత వేగంగా, డిజిటల్ పద్ధతిలో చేరవేయడానికి ఈ ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు. ఎప్పటి నుంచో ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వీవోఏలకు ఇది నిజంగా పెద్ద ఊరట అని చెప్పాలి.

ఫోన్ల పంపిణీ మాత్రమే కాకుండా, వీవోఏల ప్రాణాలకు భరోసా కల్పించేలా రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే అమలు చేస్తామని మంత్రి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో నకిలీ సంఘాలపై నిఘా పెంచామని, వ్యవస్థలో ఉన్న లొసుగులను సరిచేస్తున్నామని ఆయన హెచ్చరించారు. నకిలీలను గుర్తించి ఎప్పటికప్పుడు తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మహిళా సాధికారతపై చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. "ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్త ఎదగాలి" అనేది సీఎమ్ ఆశయమని మంత్రి వెల్లడించారు. గ్రామీణ మహిళలు చిన్న తరహా పరిశ్రమలు పెట్టాలనుకుంటే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేయబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. దీనివల్ల స్థానికంగా మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

30 ఏళ్ల క్రితమే డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చి మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించింది చంద్రబాబేనని మంత్రి గుర్తు చేశారు. మార్చిలో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకాల ద్వారా డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు తక్కువ వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ఇన్ని పథకాలపై గ్రామాల్లో మహిళలకు మరింత అవగాహన కల్పించాల్సిన బాధ్యత వీవోఏలపై ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories