Divyang Shakti: దివ్యాంగులకు ఉగాది కానుక.. ఉచిత బస్సు పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Divyang Shakti: ఏపీలో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం అయింది. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, సహాయకులకు 50% రాయితీ ఈ పథకం ద్వారా లభిస్తాయి.

KVD Varma
Published on: 18 March 2026 2:27 PM IST
Divyang Shakti: ఏపీలో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం అయింది.
X

Divyang Shakti

Divyang Shakti: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అద్భుత పథకాన్ని ప్రజలకు అందించింది. బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించి తమ ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం బస్సు ప్రయాణం విషయంలో దివ్యంగులకు కూడా పెద్ద బహుమతి అందించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులలో దివ్యంగులకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు అమలు చేసింది.

అధికారికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లతో కలిసి బుధవారం (మార్చి 18న) దివ్యంగ్ శక్తి పథకాన్ని ప్రారంభించారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు మరియు ఎక్స్‌ప్రెస్ బస్సులతో సహా అన్ని ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులలో దివ్యంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఈ పథకంలో అందిస్తారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా 207 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది. దీని అమలు, నిర్వహణ కోసం ఈ సొమ్ము ఖర్చు చేస్తారు. ఈ పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యంగులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పథకం కింద, 21 విభిన్న వర్గాలకు చెందిన 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వ్యక్తులు, అవసరమైతే సహాయకులతో పాటు ఉచితంగా ప్రయాణించవచ్చు.

మంగళగిరి బస్సు స్టేషన్ వద్ద ఈ పథకాన్ని పార్రంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ తరువాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దివ్యంగులతో పాటు బస్సులో ప్రయాణించారు. పెనుమాక వరకూ వీరి బస్సు ప్రయాణం కొనసాగింది. అంతేకాకుండా బస్సు ప్రయాణం అనంతరం దివ్యంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి కార్యాలయంలో భోజనం చేశారు. ఈ సందర్భంగా దివ్యంగులు ముఖ్యమంత్రికి తమ కృతఙ్ఞతలు తెలిపారు. వీరు తమతో కల్సి ప్రయాణించడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

దివ్యాంగ్ శక్తి పథకం ముఖ్య విశేషాలు ఇవే..

ఉచిత బస్సు ప్రయాణం: రాష్ట్రంలోని దివ్యాంగులు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఎటువంటి ఛార్జీ లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు.

వర్తించే బస్సులు: పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ ఉచిత సౌకర్యం లభిస్తుంది.

అర్హత: 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.

సహాయకులకు: దివ్యాంగులతో పాటు వచ్చే సహాయకులకు బస్సు టికెట్ ధరలో 50 శాతం డిస్కౌంట్ ఇస్తారు.

ఎన్ని వర్గాల దివ్యాంగులు? గతంలో కేవలం 4 వర్గాల దివ్యాంగులకే కొన్ని రాయితీలు ఉండేవి. ఇప్పుడు దానిని శారీరక, మానసిక వైకల్యం, ఆటిజం, తలసేమియా, పార్కిన్సన్స్ వంటి వ్యాధిగ్రస్తులతో సహా 21 వర్గాలకు విస్తరించారు .

లబ్ధిదారుల సంఖ్య: ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11.16 లక్షల మంది దివ్యాంగులకు, వారి సహాయకులతో కలిపి మొత్తం 12.76 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.

డిజిటల్ పాస్‌లు: భౌతిక సర్టిఫికెట్ల అవసరం లేకుండా QR కోడ్ ఆధారిత డిజిటల్ పాస్‌లను వాట్సాప్ లేదా ఆర్టీసీ మొబైల్ యాప్ ద్వారా పొందే వెసులుబాటు కల్పించారు.

KVD Varma

KVD Varma

Next Story