Amaravati: చంద్రబాబు వార్నింగ్ 24 గంటల్లో నిందితులను పట్టుకోవాల్సిందే!

Amaravati:అమరావతి అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సీరియస్. ఇది విద్రోహ చర్యేనని అనుమానం వ్యక్తం చేస్తూ, 24 గంటల్లోగా నిందితులను పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 March 2026 7:01 AM IST
Amaravati
X

Amaravati: చంద్రబాబు వార్నింగ్ 24 గంటల్లో నిందితులను పట్టుకోవాల్సిందే!

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు..ఈ వ్యవహారం పై అధికార యంత్రాంగానికి కఠిన ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ప్రాంతంలో పైపులు తగలబడిన ఘటనను సాధారణ ప్రమాదంగా తీసుకోకుండా సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులను 24 గంటల అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.

ఈ ఘటనలో తగలబడిన పైపులు సాధారణ పరిస్థితుల్లో కాలిపోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి. నిపుణులు స్పష్టం చేస్తున్న దాని ప్రకారం పైపులు అగ్నికి ఆహుతి కావాలంటే సుమారు 130 నుండి 140 డిగ్రీల సెల్సియస్‌ వరకు అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందన్న సత్యాన్ని గ్రహించాలన్నారు. ఎవరో ఆకతాయిలు చేసిన నిర్వాకం కాదని, చిన్న నిప్పురవ్వ వల్ల లేదా యాదృచ్ఛిక కారణాలతో ఇంత పెద్ద ప్రమాదం జరగడం అసంభవమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులకు ఇటువంటి చర్యలు ఆటంకంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘటన వెనుక విద్రోహ చర్యలు ఉన్నాయేమో అన్న అనుమానం బలపడుతోందనీ. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు, డీజీపీతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు 24 గంటల్లో ఘటనకు గల అసలు కారణాలను బయటకు తీసుకురావాలని ఆదేశించారు. కేవలం ప్రాథమిక సమాచారం కాకుండా ఖచ్చితమైన దర్యాప్తుతో, పక్కా ఆధారాలతో కేసును నమోదు చేయాలని స్పష్టం చేశారు.

ఇదే తరహాలో రాజధాని ప్రాంతంలో ఇటీవల జరిగిన మూడు అగ్ని ప్రమాదాలను కూడా సీఎం ప్రస్తావించారు. ఈ ఘటనలను విడివిడిగా కాకుండా పరస్పరం సంబంధం ఉన్న కోణంలో పరిశీలించాలని అధికారులకు సూచించారు. అన్ని కేసులను ఒకే దిశలో లింక్ చేసి దర్యాప్తు చేస్తే నిజాలు బయటపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సీఎం ఆదేశాల నేపథ్యంలో పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, అగ్నిమాపక శాఖ అధికారులు కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేపట్టే అవకాశముంది. ఘటన స్థలంలో సాంకేతిక ఆధారాలు సేకరించడం, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ట్రాక్ చేయడం వంటి చర్యలు వేగవంతం కానున్నాయి.

రాజధాని ప్రాంతంలో భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని కూడా సీఎం సూచించినట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.. ఈ అగ్ని ప్రమాదం కేవలం యాదృచ్ఛిక సంఘటన కాదనే కోణంలో ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించడం గమనార్హం. 24 గంటల్లో నిజాలు వెలికితీయాలన్న సీఎం గట్టి ఆదేశాలు నేపథ్యంలో, ఈ కేసు ఎలా మలుపుతిరుగుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story