LPG Crisis: రాష్ట్రంలో ఎక్కడా వంట గ్యాస్ కొరత లేదు.. ఏపీ అధికారులు

LPG Crisis: ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా వంట గ్యాస్ కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని గమనిస్తున్నామని, సామాన్యులకు ఇబ్బందులు రానీయమని చెబుతున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 March 2026 10:24 PM IST
LPG Crisis: ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా వంట గ్యాస్ కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు.
X

LPG Crisis

LPG Crisis: మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎల్పీజీ (LPG) సరఫరాపై ప్రజల్లో కొంత అనిశ్చితి కనిపిస్తున్నా… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ సమాచారం ప్రకారం 12 మార్చి 2026 నాటికి రాష్ట్రంలో మొత్తం 17,962 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 161.19 లక్షల గృహ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నప్పటికీ, సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని ఏ బాట్లింగ్ ప్లాంట్‌లోనూ గ్యాస్ పూర్తిగా అయిపోయిన పరిస్థితి లేదని అధికారులు వెల్లడించారు. భారత్‌లో ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతుంది. ఈ దిగుమతుల్లో సుమారు 90 శాతం హార్ముజ్ జలసంధి మార్గం ద్వారా వస్తాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ఆ మార్గంపై ఆందోళనలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. దేశంలోని రిఫైనరీలు, పెట్రోకెమికల్ యూనిట్లకు ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని కేంద్రం ఆదేశించడంతో దేశీయ ఉత్పత్తి సుమారు 25 శాతం పెరిగింది. దేశంలో తయారయ్యే ఎల్పీజీని ముందుగా గృహ వినియోగదారులకు కేటాయించేలా చర్యలు చేపట్టారు.

ఇక వాణిజ్య వినియోగంపై కూడా కేంద్రం దృష్టి పెట్టింది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లకు ఎల్పీజీ కేటాయింపులను సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అవసరమైతే గృహ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.

LPG Crisis: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గృహ ఎల్పీజీ సిలిండర్ ధర ₹935గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం–2 పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఏడాదికి మూడు సిలిండర్లు 100 శాతం సబ్సిడీతో అందిస్తున్నది. అయితే మధ్యప్రాచ్య పరిస్థితులపై వచ్చిన వార్తల కారణంగా కొంతమంది వినియోగదారులు ముందుగానే గ్యాస్ బుకింగ్ చేయడం ప్రారంభించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో డెలివరీ సమయం కొంచెం పెరిగింది. సాధారణంగా 2.5 రోజుల్లో డెలివరీ అయ్యే సిలిండర్, కొన్ని చోట్ల కొద్దిగా ఆలస్యమవుతున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, అవసరమైనంత సరఫరా కొనసాగుతుందని పేర్కొంది. ముఖ్యంగా గృహ వినియోగం, ఆస్పత్రులు, అవసరమైన సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story