AP 10th inter Exams Postponed: ఏపీలో రేపు జరగాల్సిన టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా

AP 10th and inter Exams Postponed: ఆంధ్రప్రదేశ్ లో రేపు అంటే మార్చి 21 శనివారం జరగాల్సిన టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ చెప్పారు.

KVD Varma
Updated on: 20 March 2026 12:19 PM IST
AP 10th inter Exams Postponed: ఆంధ్రప్రదేశ్ లో రేపు అంటే మార్చి 21 శనివారం జరగాల్సిన టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా
X

AP 10th inter Exams Postponed

AP 10th and inter Exams Postponed: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయి. ఈ మధ్యలో ఉగాది పండుగ రావడంతో ఒక సెలవు రోజు వచ్చింది. అలాగే శుక్రవారం కూడా రంజాన్ పండుగ సందర్భంగా సెలవు ఇచ్చారు. దీంతో రెండు రోజుల సెలవు అనంతరం రేపు అంటే మార్చి 21 పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ, ఇప్పుడు వీటిని వాయిదా వేశారు.

మంత్రి నారా లోకేష్ ప్రకటన..

శనివారం జరగాల్సిన పదో తరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. తన X (గతంలో ట్విట్టర్) ఎకౌంట్ లో ఒక పోస్ట్ ద్వారా ఆయన ఈ విషయాన్నీ తెలిపారు. శుక్రవారం జరగాల్సిన ఈద్-ఉల్-ఫితర్(రంజాన్) పండుగ శనివారం నిర్వహిస్తున్ననేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.

మంత్రి లోకేష్ తన సోషల్ మీడియా పోస్ట్ లో వెల్లడించిన ప్రకారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష గతంలో నిర్ణయించిన మార్చి 21వ తేదీకి బదులుగా మార్చి 25వ తేదీన జరుగుతుంది. పదో తరగతి థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పరీక్ష మార్చి 21వ తేదీకి బదులుగా ఏప్రిల్ 2వ తేదీన జరుగుతుంది. మిగతా అన్ని పరీక్షలు టైమ్‌టేబుల్ ప్రకారమే జరుగుతాయి.

ట్వీట్ లో ఏముందంటే..

“ప్రియమైన విద్యార్థులారా రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) పండుగను మార్చి 21-2026న జరుపుకునే అవకాశం ఉన్నందున విద్యార్థుల ప్రయోజనాల రీత్యా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొన్ని పరీక్షలను వాయిదా వేసింది.”

“21.03.2026న జరగాల్సిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం IPE (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I & లాజిక్ పేపర్-I) పరీక్షను ఇప్పుడు 25.03.2026 (బుధవారం) నాడు నిర్వహిస్తారు. అంతేకాకుండా, 21.03.2026న జరగాల్సిన SSC థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పరీక్షను 02.04.2026కు వాయిదా వేయడం జరిగింది. మిగతా అన్ని పరీక్షలు యథాతథ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు ఈ సవరించిన తేదీలను గమనించి, అందరికీ విస్తృతంగా తెలియజేయాలని కోరుతున్నాము.” అంటూ మంత్రి నారా లోకేష్ తన ట్వీట్ (X) వేదికగా తెలిపారు.




ఏపీ ఎస్ఎస్సి(పదో తరగతి) పబ్లిక్ పరీక్షలు 2026 మార్చిలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఒకే సెషన్‌లో నిర్వహిస్తారు. విద్యార్థులు తమ హాల్ టికెట్‌పై పేర్కొన్న రిపోర్టింగ్ సమయానికి చాలా ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇప్పటివరకూ ప్రశాంతంగా పరీక్షలు జరుగుతూ వస్తున్నాయి.

ప్రతి పరీక్ష రోజున పరీక్షా కేంద్రానికి ఏపీ ఎస్ఎస్సి హాల్ టికెట్ 2026ను తీసుకురావడం తప్పనిసరి. కాగా, ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా మండలి జారీ చేసిన అధికారిక పాస్ లేకుండా విద్యార్థులను పరీక్షా హాలులోకి అనుమతించడం లేదు.

KVD Varma

KVD Varma

Next Story