Srikakulam: గుప్తనిధుల వేటలో విగ్రహాల ధ్వంసం? సోంపేటలో ఉద్రిక్తత!!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువలో కలకలం. పురాతన కోటిలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని నంది విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించి, కిలోమీటరు దూరంలోని పొలాల్లో ధ్వంసం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 March 2026 5:00 PM IST
Srikakulam
X

Srikakulam: గుప్తనిధుల వేటలో విగ్రహాల ధ్వంసం? సోంపేటలో ఉద్రిక్తత!!

సోంపేట (శ్రీకాకుళం జిల్లా): పురాతన దేవాలయాలకు నిలయమైన బారువలో గుర్తుతెలియని దుండగులు బరితెగించారు. ప్రసిద్ధ కోటిలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని ఉమామహేశ్వర స్వామి గుడిలో ఉన్న నంది విగ్రహాన్ని అపహరించి, దానిని ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఘటన వివరాలు:

శనివారం ఉదయం అర్చకులు ఆలయానికి చేరుకోగా, నంది విగ్రహం కనిపించకపోవడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆలయానికి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న నూకలూరు పొలాల్లో నంది విగ్రహం ముక్కలు ముక్కలుగా ధ్వంసమైన స్థితిలో లభ్యమైంది.

సీసీ ఫుటేజీలో రికార్డు:

పోలీసులు ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు గుర్తించారు. పురాతన ఆలయం కావడంతో విగ్రహం కింద ఏవైనా గుప్తనిధులు ఉంటాయనే దురాశతోనే దుండగులు విగ్రహాన్ని పెకలించి, బయటకు తీసుకెళ్లి ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

పాలకుల నిర్లక్ష్యంపై ఆగ్రహం:

ఆలయాల్లో వరుసగా జరుగుతున్న ఇటువంటి దాడులు, విగ్రహాల ధ్వంసంపై భక్తులు, స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పురాతన కట్టడాలకు సరైన భద్రత కల్పించడంలో పాలకులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story