Top
logo

సతులకు పదవులు...పతుల అధికారం

సతులకు పదవులు...పతుల అధికారం
X
Highlights

వాళ్లు జిల్లాల రాతను మార్చే ప్రజాప్రతినిధులు. ఆ మహిళలు జిల్లాకు ప్రథమ పౌరురాళ్లు. అయినా అధికారం అంతా భర్తలదే....

వాళ్లు జిల్లాల రాతను మార్చే ప్రజాప్రతినిధులు. ఆ మహిళలు జిల్లాకు ప్రథమ పౌరురాళ్లు. అయినా అధికారం అంతా భర్తలదే. సతుల పవర్ మొత్తం, వెనకాలే వుండి నడిపిస్తున్నారు పతులు. మీటింగ్ నుంచి మినిట్స్ వరకు భర్తలే డిసైడ్ చేస్తారట. సాధికారతతో మహిళలకు జడ్పీ పీఠం దక్కినా, అధికారం మాత్రం పతుల చేతిలోనే బందీగా మారిందట. సొంత పార్టీ నుంచే కాక, విపక్షాలు, మహిళా సంఘాల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నా, భర్త శిఖామణులు మాట వినడం లేదట.

స్థానిక సంస్థల పదవుల్లో మహిళలకు ప్రాధాన్యతనిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అందుకే జిల్లా పరిషత్ పదవుల్లో మహిళలకు యాభై శాతం పదవులు దక్కాయి. దాంతో మంచిర్యాల జడ్పీ చైర్మన్ పదవి, నల్లాల భాగ్యలక్ష్మీకి, నిర్మల్ జడ్పీ చైర్మన్ పదవి విజయలక్ష్మీకి లభించాయి. మహిళలకు పదవులకు కట్టబెట్టడం వల్ల మహిళా సాధికారత సాధించొచ్చన్నది పాలకుల ఆశయం. సర్కారు ఆశయం ఏమోగాని, భర్తలు మాత్రం భార్య వెనకాల వుండి, మొత్తం అధిరాన్ని అనుభవిస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. పేరుకు మాత్రం మహిళా జడ్పీ చైర్మన్‌లు. కానీ మొత్తం పెత్తనం మాత్రం భర్తలదేనట. మహిళా సాధికారత ఆశయానికి అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారని, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్మన్ పదవి, కోటపల్లి జడ్పీటీసీ నల్లాల భాగ్యలక్ష్మిని వరించింది. అయితే భాగ్యలక్ష్మీ భర్త నల్లాల ఓదేలు చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే. పేరుకు భాగ్యలక్ష్మీ చైర్మనైనా అధికారాలు, పెత్తనం అంతా ఓదేలు చెలాయిస్తున్నారని, సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా పరిషత్‌లో ఏం జరగాలన్నా , చైర్మన్‌ భాగ్యలక్ష్మీని కాకుండా భర్త ఓదేలే శాసిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అధికారులు అధికారిక సమాచారం ఇవ్వాలన్నా ఓదేలకు ఇవ్వాల్సిందేనట. లేకుంటే పని అంగుళం కూడా కదలదట. దాంతో జడ్పీ సీఇఒ నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఓదేలును కలిసిన తర్వాతే చైర్మన్‌ను ‌కలుస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి.

జిల్లా పరిషత్‌లో చక్రం తిప్పడమే ‌కాకుండా, అధికారిక కార్యక్రమాల్లోనూ ఆధిపత్యం చెలాయిస్తున్నారట. లక్షిట్‌పేటలో ఈ‌మధ్యకాలంలో జడ్పీచైర్మన్ భాగ్యలక్ష్మీ, గురుకుల సైన్స్ ఫెయిర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఓదేలు కూడా హజరయ్యారు. పైగా తానే ఛైర్మన్ అన్నట్లుగా సభా వేదికపై కూర్చోవడమే కాకుండా, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. జడ్పీ డిపాక్టో చైర్మన్ గా వ్యవహరిస్తున్నారని ఆయన తీరు‌పై మహిళలు మండిపడుతున్నారట. ఇతర పార్టీల నేతలు సైతం, ఓదేలు తీరును విమర్శిస్తున్నారట.

ఇక నిర్మల్ జడ్పీ చైర్మన్ కోరిపేలి విజయలక్ష్మీది ఇదే కథ. చైర్మన్ భర్త ప్రాథమిక సంఘం చైర్మన్. ఈయన ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ కంటే కూడా, జిల్లా పరిషత్ చైర్మన్‌గానే పెత్తనం చెలాయిస్తున్నారట. జిల్లా పరిషత్ ఎజెండా స్టాండింగ్ కమిటీ సమావేశాలను సైతం రాంకిషన్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారట. విజయలక్ష్మి పేరుకు మాత్రమే పరిమితం అయ్యారని, జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతుందట. పైగా అధీకారులు సైతం చైర్మన్ భర్త ఆదేశాలను అమలు చేస్తున్నారట. పాలనా వ్యవహరాలను రాంకిషన్ రెడ్డి పర్యవేక్షిస్తారని, అందుకే ఏది చేయాలన్నా, చైర్మన్‌కు బదులుగా భర్త, రాంకిషన్ రెడ్డి అనుమతిని అధికారులు తీసుకోవడం కంపల్సరీ అట. అదేపనిగా జోక్యం చేసుకుంటుండటంతో, ఇబ్బందులు పడుతున్నారట అధికారులు. రెండు జిల్లాలో సతుల అధికారాన్ని , పతులు చెలాయించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. భర్తల జోక్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.


Next Story