బిడ్డల భవిష్యత్తుకు అమ్మ పరుగు.. కాళ్లకు చెప్పులు లేకుండానే 5 కిలో మీటర్లు పరిగెత్తిన మహిళ..

Woman Farmer Participated in 5K Running Race
x

బిడ్డల భవిష్యత్తుకు అమ్మ పరుగు.. కాళ్లకు చెప్పులు లేకుండానే 5 కిలో మీటర్లు పరిగెత్తిన మహిళ

Highlights

5K Run Woman Farmer: ఆమె క్రీడాకారిణి కాదు అయినా ఆమె పరుగు పందెంలో గెలిచింది.

5K Run Woman Farmer: ఆమె క్రీడాకారిణి కాదు అయినా ఆమె పరుగు పందెంలో గెలిచింది. తన బిడ్డల భవిష్యత్తు కోసం ఐదు కిలో మీటర్లు ఆగకుండా పరిగెత్తింది. కాళ్లకు చెప్పులు లేకుండానే పోటీలో పాల్గొని అందరినీ అబ్బుర పరిచింది. సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ నిరుపేద మహిళా రైతు. ఇంతకీ ఎవరా మహిళా ? ఆమె చేసిన సాహసమేంటి ? ఏంటా కథ...?

కుటుంబ పోషణ కోసం సైకిల్ తొక్కడం, సాహసాలు చేయడం లాంటివి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కాని నిజ జీవితంలోనూ అలాంటి వారు ఉన్నారనటానికి ఈ మహిళా రైతు నిదర్శనం. తన పిల్లల చదువు కోసం ఓ పరుగు పందెంలో పాల్గొని విజయం సాధించింది. కుటుంబ అవసరాల కోసం రిస్క్ చేసి మరీ డబ్బులు గెలుచుకుంది. గెలవాలన్న సంకల్పం ఉంటే ఎలాగైనా లక్ష్యం చేరుకోవచ్చని నిరూపించింది సిద్దిపేట జిల్లాకు చెందిన మల్లం రమ.

సుమారు 5 వందల మంది మహిళలు పాల్గొన్న 5 కిలో మీటర్ల పరుగు పోటీలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పరుగెత్తి విజేతగా నిలిచి ఔరా అనిపించింది రమ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 30 ఏళ్లు పై బడిన మహిళలకు 5 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన మల్లం రమ అనే మహిళా రైతు పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి అందరి చేత శభాష్ అనిపించుకుంది.

మల్లంపల్లి గ్రామానికి చెందిన సంపత్-రమ దంపతులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే పిల్లల్ని మంచి స్కూల్‌లో చదివించాలన్న ఈ దంపతుల కోరికకి ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అడ్డం పడుతూనే ఉన్నాయ్. అలాంటి టైమ్‌లోనే హుస్నాబాద్‌లో పరుగు పోటీలు పెట్టారని మహిళా సంఘాల ద్వారా తెలుసుకున్న మల్లం రమ పోటీలో పాల్గొనాలనుకుంది. అయితే ఎలాంటి సాధన చేయని రమకి ఇంటి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ వ్యవసాయ బావి వద్దకు ప్రతిరోజు గేదెలను తీసుకెళ్లి, తిరిగి తీసుకురావడమే ఓ శిక్షణగా పనికొచ్చింది. పందెంలో గెలిచి ప్రధమ విజేతగా నిలిచింది.

పెద్ద ఎత్తున మహిళలు పోటీలో పాల్గొనగా రమ విజేతగా నిలిచి లక్ష రూపాయలు గెలిచింది. పరుగు పోటీలో పాల్గొని విజయం సాధించడం సంతోషంగా ఉందని అంటుంది. తన బిడ్డల భవిష్యత్తు కోసమే బయటకొచ్చానని ఈ డబ్బుతో తన పిల్లలకి మంచి చదువు చెప్పిస్తానంటుంది. ఈ 5 కిలో మీటర్ల పరుగు పోటీలో మహిళా రైతు రమతో పాటు రెండు, మూడు స్థానాల్లో సైతం మహిళా రైతులే విజయం సాధించారు. అన్ని సౌకర్యాల మధ్య సాధన చేసిన వారే పోటీల్లో గెలవలేకపోతున్న ఈ రోజుల్లో కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా పరుగు పందెంలో గెలిచిన అమ్మలు ప్రతీ ఒక్కరికి స్పూర్తిగా నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories