కేటీఆర్‌ దూకుడుతో సీనియర్లలో టెన్షన్ ఎందుకు.. భవిష్యత్ నిర్ణయాలకు సిద్దమవుతున్న సీనియర్లు?

కేటీఆర్‌ దూకుడుతో సీనియర్లలో టెన్షన్ ఎందుకు.. భవిష్యత్ నిర్ణయాలకు సిద్దమవుతున్న సీనియర్లు?
x
Highlights

టీఆర్‌ఎస్‌లో సీనియర్ నేతలకు ఇప్పుడు కొత్త టెన్షన్‌ మొదలైంది. ఎప్పుడేం అవుతుందోనని కంగారు పడుతున్నారట. ఇక ఫ్యూచరేంటని దిగాలు చెందుతున్నారట. దానికంతటికీ...

టీఆర్‌ఎస్‌లో సీనియర్ నేతలకు ఇప్పుడు కొత్త టెన్షన్‌ మొదలైంది. ఎప్పుడేం అవుతుందోనని కంగారు పడుతున్నారట. ఇక ఫ్యూచరేంటని దిగాలు చెందుతున్నారట. దానికంతటికీ కారణం, ఒక యువ నాయకుడట. పార్టీలో, ప్రభుత్వంలో మంత్రి, వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ ప్రాధాన్యత అమాంతం పెరిగిపోయింది. త్వరలోనే కేటీఆర్ సీఎం కాబోతున్నా రంటూ ప్రచారం మొదలు కావడంతో నేతలంతా కెటిఆర్ చుట్టూనే తిరుగుతున్నారు. ఇక పార్టీ లో, ప్రభుత్వం లో అంతా కెటిఆర్ హవానే కొనసాగుతోంది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నియామకం దగ్గర నుంచి ఐఏఎస్ ల బదిలీల వరకు కెటిఆర్ మార్క్ కనపడుతోందంటూ పార్టీలో, పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. అయితే, యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పార్టీలో సీనియర్లకు భవిష్యత్ పై బెంగ కలిగిస్తోందట.

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు సైలెంట్ అయిపోయారు. ఇక మరికొందరు నేతలు వివిధ ఉన్నత పదవుల్లో పనిచేసి వారి పదవీకాలం ముగియటంతో వారూ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించటం లేదు. కొంతమంది నేతలైతే అసలు కనపడటమే మానేశారు.

ఇక సీనియర్ నేతలు కొంతమంది ఓటమిపాలు కావడంతో, వారి నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, టీఆరెఎస్‌లో చేరటంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేలకు పార్టీ పుల్ పవర్స్ ఇవ్వటంతో నియోజకవర్గాల్లో ఈ నేతలు పూర్తిగా సైలెంట్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డయానే చర్చ జోరుగా సాగుతోంది.

టీఆర్ఎస్ లో మొదటి నుంచి కేసీఆర్ కు వెన్నంటి ఉన్న మధుసూధనాచారికి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, తొలి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా అవకాశం దక్కింది. నాలుగున్నరేళ్ల పాటు స్పీకర్ గా పనిచేసిన మధుసూధనాచారి 2018 ఎన్నికల్లో, ఓటమిపాలు కావడం ఆయనకు శాపంగా మారింది. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మండలి చైర్మన్ చేస్తారని ప్రచారం జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు. ఇక దీనికి తోడు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్ఎస్ లో చేరటంతో మధుసూదనాచారి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇక రాజకీయంగా ఆయన భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ టీఆర్ఎస్ లోనే జరుగుతోంది.

ఇక మరో సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయిందనే చర్చ జరుగుతోంది. పార్టీలో నర్సన్న అని కేసీఆర్ ఆప్యాయంగా పిలిచే నాయిని పదవి కాలం త్వరలోనే ముగియబోతోంది. అయితే ఆయనను మళ్లీ రెన్యువల్ చేయరనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. అదే కనుక జరిగితే పార్టీలో నాయిని ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఆ తర్వాత మాత్రం ఆయన జిల్లాకే పరిమితమయ్యారు. ఇక తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశాలకు ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటంతో తుమ్మల ఇటువైపు రావటం మానేశారు. మరో మాజీ మంత్రి జూపల్లి కష్ణారావు ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధిష్టానాన్ని దిక్కరించి తన అనుచరులను బరిలో నిలబడటం ఆయనకు మైనస్ గా మారింది. పార్టీలో తాను కొనసాగుతానని ప్రెస్ మీట్ పెట్టీ మరి చెప్పినా ఆయన పట్ల పార్టీ హైకమాండ్ ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక మండలి చైర్మన్‌గా పనిచేసిన స్వామి గౌడ్ తన పదవీకాలం ముగిసిన తర్వాత ఆయనకు పార్టీకి మధ్య గ్యాప్ బాగానే పెరిగిందనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆయన భావించినా, ఇప్పుడు అపాయింట్ మెంట్ కూడా దొరకటం లేదన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. మరో నేత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరేటప్పుడు ఏదో ఒక పదవి ఆశించే చేరారు. కానీ ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి పదవీ దక్కకపోవడంతో, ఆయనా మౌనంగానే వున్నారు. ఓవైపు పార్టీ పూర్తిగా కేటీఆర్ కంట్రోల్ లోకి రావటంతో, టీఆర్ఎస్ లో చాలామంది సీనియర్ నేతలకు భవిష్యత్ లో పదవులు దక్కటం కష్టమేననన్న చర్చ కూడా జరుగుతోంది.

ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముద్ర అటు పార్టీపై ఇటు ప్రభుత్వంపై కనిపిస్తోంది. పార్టీ పదవుల్లో ఎమ్మెల్సీల ఎంపిక విషయంలోనూ కేటీఆర్ మార్క్ స్పష్టం. ఎమ్మెల్సీలు శంభిపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్ లాంటి యువ నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం రావడంతో పార్టీలో యువ తారక మంత్రం పనిచేస్తోందన్న వాదనా వినిపిస్తోంది. ఇక తాజాగా ప్రభుత్వంలో ఐఎఎస్ ల బదిలీల్లో ను కేటీఆర్ ముద్ర వుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీలో కూడా యువతరానికి పెద్ద పేట వేసే అవకాశాలు వున్నాయి. దీంతో సీనియర్లకు పార్టీలో ప్రాధాన్యత తగ్గినట్లేనన్న చర్చ రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది.

రాజ్యసభ పదవులు ఆశిస్తున్న నేతలు, ఎమ్మెల్సీ పదవుల కోసం వెయిట్ చేస్తున్న నేతలు ఈ పదవులు దక్కక పోతే భవిష్యత్ కోసం సీరియస్ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారట. ఇప్పుడు తప్పితే మళ్లీ అవకాశం రాదని భావిస్తున్న నేతలు కేసీఆర్ కు కలిసే అవకాశం లేక కెటిఆర్ కు తమ మనసులోని మాట ను చెప్పుకునే అవకాశం లేక మధనపడుతున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories