ఉద్యమగడ్డ దుబ్బాకలో ఎర్రజెండాల మౌనమెందుకు?

ఉద్యమగడ్డ దుబ్బాకలో ఎర్రజెండాల మౌనమెందుకు?
x
Highlights

రాష్ట్రంలో ఎక్కడ చూసినా దుబ్బాక ఉప ఎన్నికల పైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే త్రిముఖ పోరులో ప్రచార శైలిలో హోరాహోరీగా కొనసాగుతుంటే, మరోవైపు ఒకప్పుడు...

రాష్ట్రంలో ఎక్కడ చూసినా దుబ్బాక ఉప ఎన్నికల పైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే త్రిముఖ పోరులో ప్రచార శైలిలో హోరాహోరీగా కొనసాగుతుంటే, మరోవైపు ఒకప్పుడు వెలుగు వెలిగిన పార్టీలు ఎక్కడ..? ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తున్నాయి..? బీజేపీని ఓడించాలని బహిరంగ ప్రకటనలు చేస్తూనే వామపక్షాలు ఎవరికి మద్దతు ఇస్తున్నాయి..?

తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికపై రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బైపోల్‌లో ఎలాగైనా గెలిచి, ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత లేదని నిరూపించుకోవాలని టీఆర్ఎస్, దుబ్బాక విజయంతో, తెలంగాణలో తిరుగులేని శక్తిగా నిలవాలని బీజేపీ, కాంగ్రెస్‌లు ఊరూవాడా తిరుగుతున్నాయి. అయితే, నిత్యం ప్రజాపక్షం తామేనని చెప్పుకునే వామపక్షాలు మాత్రం, ఇంతవరకు దుబ్బాకపై గుంభనంగానే వున్నాయి. అటు తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం కూడా, అసలు దుబ్బాకతో తమ పార్టీకి సంబంధమేలేదన్నట్టుగా పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్య పండగలాంటి ఎన్నికల్లో, ఈ పార్టీలు అసలు పాల్గొనకపోవడంపై విమర్శలు అన్నీ ఇన్నీ కావు.

దుబ్బాక అంటేనే ఉద్యమ గడ్డ. వామపక్షాలకు చెక్కుచెదరని క్యాడర్‌ వుందక్కడ. అయినా తోక పార్టీలుగా ఏదో ఒక ప్రధాన పార్టీ వెనక తిరగడమే తప్ప, సొంతంగా పోటీ చెయ్యాలన్న ఆలోచనే లేదు వాటికి. ప్రతి ఎన్నికల్లోనూ డిపాజిట్లు గల్లంతు అవుతున్న టైంలో, దుబ్బాకలో పోటీ చేసి, ఉనికి చాటుకోవాల్సిన లెఫ్ట్‌ పార్టీలు సైలెంట్‌ అయిపోయాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో తాము ప్రత్యక్షంగా పోటీ చేయడం లేదని వామపక్ష పార్టీలు ఇప్పటికే ప్రకటన చేశాయి. దాంతోపాటు బిజెపి అభ్యర్థిని ఓడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి బహిరంగంగానే పలుమార్లు ప్రకటన చేశారు. కానీ కనీసం ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నామో మాత్రం చెప్పలేదు. సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత మౌనంగా ఉన్నా సిపిఐ నేత చాడ వెంకట్ రెడ్డి, దుబ్బాక ఉప ఎన్నికల్లో లోలోపల అధికార పార్టీకే మద్దతు ఇస్తున్నారన్నది రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ. అందుకే ఏ పార్టీకీ మద్దతు ఇవ్వకుండా, బీజేపీని మాత్రం ఓడించాలని చెప్పి, పరోక్షంగా అధికార పార్టీకి సపోర్ట్‌ ఇచ్చినట్టయ్యిందని, పార్టీ కార్యకర్తలే రగిలిపోతున్నారు. చాడ వెంకటరెడ్డి తీరుపై సీపీఐలో అసంతృప్తి పెరుగుతోందట.

ఇక సీపీఎం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జాడ కానరావడం లేదు. ఆందోళనలు, నిరసనలు, ఉద్యమాలను పక్కనపెట్టేసిన తమ్మినేని, కనీసం దుబ్బాక బైపోల్‌ గురించి మాట్లాడనే లేదు. సీపీఐ తరహాలోనే లోలోపల టీఆర్ఎస్‌కు మద్దతిచ్చేందుకే, తమ్మినేని మౌనాన్ని ఆశ్రయించారని కామ్రేడ్స్‌ మండిపడుతున్నారట. డైరెక్ట్‌ సపోర్ట్ చేసినా ఏంకాదుకానీ, ఇలా పరోక్ష లాలూచీ రాజకీయాలేంటని సీపీఎం కార్యకర్తలు ఫైర్‌ అవుతున్నారట.

మరోవైపు కనీసం బూత్ స్థాయి నాయకులు కూడా లేని తెలంగాణ జన సమితి, అభ్యర్థిని నిలబెట్టె స్థితిలో కూడా లేదు. ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తుందో కూడా చెప్పలేని స్థితిలో కోదండరాం పార్టీ ఉంది. గత అనుభవాల దృష్ట్యా టీజేఎస్, కాంగ్రెస్ కు సపోర్ట్ చేయొచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇస్తేనే, దుబ్బాకలో కాంగ్రెస్‌కు కోదండరాం సహకరించే విధంగా షరతు పెట్టొచ్చన్న అంచనాలున్నాయి. ఇదీ దుబ్బాకలో వామపక్షాలు టీజేఎస్‌ల రాజకీయం.


Show Full Article
Print Article
Next Story
More Stories