హరీష్‌ రావుపైనే ఎందుకిలాంటి రచ్చ?

హరీష్‌ రావుపైనే ఎందుకిలాంటి రచ్చ?
x
Highlights

మొన్నటి వరకు మంత్రి పదవి ఇవ్వలేదని చర్చ. ఇప్పుడు పోయిపోయి అదే శాఖ ఎందుకిచ్చారని చర్చ. హరీష్‌ రావు విషయంలోనే ఎందుకీ రచ్చ అటు రాజకీయవర్గాలు, ఇటు సోషల్...

మొన్నటి వరకు మంత్రి పదవి ఇవ్వలేదని చర్చ. ఇప్పుడు పోయిపోయి అదే శాఖ ఎందుకిచ్చారని చర్చ. హరీష్‌ రావు విషయంలోనే ఎందుకీ రచ్చ అటు రాజకీయవర్గాలు, ఇటు సోషల్ మీడియా గ్రూపుల్లోనూ ఇదే డిస్కషన్. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు భాష్యం చెప్పుకుంటున్నారు. హరీష్‌ రావు అభిమానులకైతే ఒకవైపు సంబురం, మరోవైపు ఆందోళన హరీష్‌ రావుకు ఆర్థిక శాఖ నేపథ్యంలో, ఎందుకిలాంటి చర్చకు ఆస్కారమేర్పడుతోంది?

దాదాపు పది నెలల పాటు నియోజకవర్గానికే పరిమితమైన హరీశ్‌రావును, ఇప్పుడు మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకున్నట్టు? మంత్రిపదవి ఇచ్చి గౌరవించారని ఆయన అభిమానులు సంతోషించాలా? లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రంలోని పరిస్థితుల్ని చక్కదిద్దే బాధ్యతను అప్పజెప్పారనుకోవాలా? నిజంగా ఆయన పనితీరుకు పరీక్ష పెట్టడమేనా? లేక ఇంతకాలం హరీశ్‌రావును పక్కన పెట్టారని పార్టీ కార్యకర్తల్లో జరుగుతున్న చర్చను, అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నంలో భాగమా? అనే అనుమానాలు, ప్రశ్నలు, హరీష్‌ రావు అభిమాన వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలోనైతే, ఎవరికివారు తమకు తోచిన భాష్యం జోడిస్తున్నారు. దీంతో హరీష్‌ రావుకు ఆర్థిక శాఖపై జోరుగా చర్చ జరుగుతోంది.

హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కకు పెట్టినందుకు ఇంతకాలం ఒక లాంటి చర్చ జరిగితే, ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినందుకు మరో రకమైన చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం ప్రభుత్వానికి తక్షణ కర్తవ్యం. ఇలాంటి పరిస్థితుల్లో సమర్ధుడిగా గుర్తింపు పొందిన హరీశ్‌రావుకు ఆర్థిక శాఖను అప్పజెప్పడం ప్రాధాన్యత సంతరించుకొంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నీళ్ళ కోసం సాగునీటిపారుదల శాఖను హరీశ్‌కు కేటాయించారు. ఆయన పర్యవేక్షణలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అత్యంత వేగంగా జరిగాయి. తాజాగా ఇప్పడు ఆర్థిక మాంద్యం నేపథ్యంలో మరోసారి కీలకమైన బాధ్యతను అప్పగించారు కేసీఆర్.

ఒకవైపు దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్ళు తగ్గిపోతుండటం, నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుండటం, రాష్ట్ర ఆర్థిక వనరులు కుంచించుకుపోతుండటం, గడచిన ఐదేళ్ళలో అప్పులు భారీ స్థాయిలో పెరగడం, వాటిని వడ్డీతో సహా చెల్లించే భారం మీద పడటం, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడానికి మరింతగా అప్పులు చేయాల్సి రావడం, ఎఫ్ఆర్‌బీఎం పరిధికంటే ఎక్కువ అప్పులు చేయాల్సి రావడం, ఇలా అనేక సవాళ్ళ నేపథ్యంలో, హరీష్‌కు ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టారు. కేంద్రంతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ వీలైనంత ఎక్కువ స్థాయిలో గ్రాంట్లు, ఆర్థిక సాయాన్ని తీసుకురావడం, వివిధ రూపాల్లో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వివిధ ద్రవ్య సంస్థల నుంచి రుణాలు సమకూర్చుకోవడం, రాష్ట్ర అవసరాలపై స్పష్టత ఉన్న దృష్ట్యా, పరిమిత ఆర్థిక వనరులను సమర్ధవంతంగా కేటాయించడం హరీశ్‌రావు ముందున్న ప్రధాన సవాళ్ళు అంటున్నారు ఆర్థిక నిపుణులు.

అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు పథకాలను అమలుచేయడం, వాటికి నిధులను విడుదల చేయడం హరీష్ రావుకు కత్తిమీద సాము అంటున్నారు సెక్రటెరియట్ వర్గాలు. రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన హరీశ్‌రావు, ఈ బాధ్యతల్లో ఏ మేరకు సక్సెస్ సాధిస్తే, భవిష్యత్తులో ఆయన రాజకీయ ప్రాధాన్యత ఆ మేరకు పెరుగుతుందని కూడా అంటున్నారు ఆయన వీరాభిమానులు. చూడాలి, హరీష్‌ రావుకు ఆర్థిక శాఖ ముళ్లకిరీటం అవుతుందో లేదంటే పట్టిందల్లా బంగారమైనట్టు బంగారు కిరీటమవుతుందో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories