ఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?

Who will Get Narsapur MLA Ticket | KCR | TRS | Live News
x

ఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?

Highlights

Narsapur: నర్సాపూర్‌లో ముగ్గురు నాయకుల పేరిట భారీగా ఫ్లెక్సీలు...

Narsapur: తెలంగాణలో ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవు.! దానికింకా చాలా సమయం ఉంది.! అయినా ఆ నియోజకవర్గంలో మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికల వేడి మొదలైందట. ఈసారి టికెట్ నాకంటే నాకే వస్తుందంటూ ముగ్గురు నేతలు వేర్వేరుగా ప్రచారం చేసుకుంటున్నారట. ఆ నియోజకవర్గ పరిధిలోని మారుమూల గ్రామాల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఆ ముగ్గురు నేతలు అక్కడ వాలిపోతున్నారట. ఇంతకీ ఆ ముగ్గురిలో టికెట్‌ దక్కేది ఎవరికి? ఇంతకీ అది ఏ నియోజకవర్గం? ఆ ముగ్గురు నేతలు ఎవరు..?

ఆ నియోజకవర్గమే మెదక్ జిల్లాలోని నర్సాపూర్. అధికార పార్టీకి చెందిన ముగ్గురు నేతలు... ఎమ్మెల్యే సీటు కోసం ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాల్లో వారున్నారట. ఎన్నికలు ఇప్పుడే లేకున్నా నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారట. ఒక వర్గానికి చెందిన వారు ఇంకో వర్గం వారిని తమ వర్గంలో కలుపుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. అలా ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ తమకే వస్తుందంటూ ముమ్మర ప్రచారాలు చేసుకుంటున్నారట.

నర్సాపూర్ నియోజకవర్గానికి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి. ఈయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుడు. కాకపోతే మదన్‌రెడ్డికి ఈ మధ్య ఆరోగ్యం సరిగ్గా లేదు. వయోభారంతో మోకాళ్ల శస్త్రచికిత్స చేయించుకున్నారు. అలా కొన్నాళ్లు విశ్రాంతి తీసుకొని ఈ మధ్యే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నర్సాపూర్‌ నుంచి రెండుసార్లు గెలిచిన మదన్‌రెడ్డి.. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్‌ విజయం నమోదు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తున్నారట. మదన్‌రెడ్డికి ఆరోగ్యం సరిగ్గా లేదు... ఈసారి టికెట్‌ కష్టమేనని పార్టీలోని వ్యతిరేక వర్గం ప్రచారం మొదలుపెట్టడంతో ఆయన అలర్ట్‌ అయ్యారట. నియోజకవర్గాన్ని చుట్టేస్తూ... ఈసారి టికెట్‌ నాకే అంటూ చెప్పుకొస్తున్నారట. ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రచారం చేసుకుంటున్న వారిలో మొదటి వ్యక్తి మదన్‌రెడ్డి.

ఇక, రెండో వ్యక్తి సునీతాలక్ష్మారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఈమెది. అయితే, హస్తం పార్టీని వీడి కారెక్కిన సునీతా లక్ష్మారెడ్డికి కూడా నియోజకవర్గవ్యాప్తంగా బలమైన క్యాడరే ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఆరోగ్యం సహకరంచడం లేదు కాబట్టి... ఈసారి ఎన్నికల్లో సునీతకే టికెట్ వస్తుందని ఆమె వర్గం ప్రచారం మొదలు పెట్టేసిందట. ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న సునీత... పార్టీ హైకమాండ్ దగ్గర మంచి మార్కులే ఉన్నాయని చెబుతున్నారు.

ఇక మూడో వ్యక్తి. బీసీ సామాజికవర్గం నాయకుడు, నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళీయాదవ్‌ కూడా లైన్‌లోనే ఉన్నారట. మున్సిపల్‌ ఛైర్మన్‌గా, నర్సాపూర్‌ వ్యాప్తంగా మంచి పట్టున్న మురళీ... ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్‌ సాధిస్తారని చెప్పుకుంటున్నారట ఆయన అనుచరులు. మదన్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం, సునీతాలక్ష్మారెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చినా.. ఆమె కూడా మూడుసార్లు శాసనసభ్యురాలిగా పనిచేయడంతో, తనకు ఓసారి చాన్స్‌ ఇవ్వాలని హైకమాండ్‌ దగ్గర లాబీయింగ్‌ మొదలు పెట్టారట.

ఇలా ఎన్నికలు ఇప్పుడే వచ్చాయా అన్నట్టు, నియోజకవర్గంలో పర్యటనలతో పాటు ఏదైనా పండుగ, కార్యక్రమాలు జరిగిన కూడా ఈ ముగ్గురు నాయకుల పేరిట భారీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయట. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మోకాలు శస్త్రచికిత్స చేయించుకొని విరామం తర్వాత నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు మొన్నీ మధ్య జరిగిన సునీతా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ బ్యానర్లు ఏర్పాటు చేసి ఆమె జన్మదినోత్సవాలను వేడుకగా నిర్వహించారు ఆమె అనుచరులు. మురళీ కూడా ఇలాగే, నిత్యం ప్రజల మధ్యే ఉంటూ తన క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారట.

ముగ్గురు నేతల ప్రచారాలు, పర్యటనలు చూసి నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారట. ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్‌ వస్తుందో లేదో ఇప్పుడప్పుడే తెలియదు కానీ వీళ్లు మాత్రం జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. మరి, అధినేత కరుణ ఈ ముగ్గురిలో ఎవరిపై ప్రసరిస్తుందో, ఎవరిని ఎమ్మెల్యేగా నిలబెడుతారో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories