logo

టచ్‌ చేసి చూడు అంటున్న గుట్కా కింగ్‌ లీడర్‌ ఎవరు?

టచ్‌ చేసి చూడు అంటున్న గుట్కా కింగ్‌ లీడర్‌ ఎవరు?
Highlights

గుట్కా సామ్రాజ్యానికి కింగ్ అతను అధికారంలో ఏ పార్టీ ఉంటే, ఆయన అదే పార్టీ కండువా కప్పుకుంటారు. గులాబీ పార్టీలో...

గుట్కా సామ్రాజ్యానికి కింగ్ అతను అధికారంలో ఏ పార్టీ ఉంటే, ఆయన అదే పార్టీ కండువా కప్పుకుంటారు. గులాబీ పార్టీలో ఓ ప్రముఖ నేతను ప్రసన్నం చేసుకుని, అధికార పార్టీలో నామినేటెడ్ పదవి పట్టేశాడు. పదవి అడ్డుపెట్టుకుని గుట్కా చలామణి చేస్తూ కింగ్ మేకర్ గా మారాడు. ఆయన అక్రమ వ్యాపారానికి సర్కారులో ఓ కీలక నేత సపోర్ట్ ఉండటంతో, ఆయనను టచ్ చేసేందుకు సైతం ఖాకీలు వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. ఇందూరు అధికార పార్టీలో గుట్కా చీకటి సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ఆ నేత ఎవరు..? ఆయన్ను పార్టీ పెద్దలు ఎందుకు కాపాడుతున్నారు.

నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ఆయన సీనియర్ నేత. తెలుగుదేశం పార్టీతో, పొలిటికల్ ఆరంగేట్రం చేసిన ఆయన ఏళ్ల తరబడి ఆ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఉద్యమ సమయంలో గులాబీ గూటికి చేరిన సదరు నేత...రాష్ట్ర స్దాయిలో కీలకంగా ఉండే ఓ నేతను ప్రసన్నం చేసుకుని ఆ నేత అనుచరునిగా ముద్ర వేసుకున్నాడు. పార్టీ కార్యక్రమాలకు భారీగా ఖర్చు పెడతాడు. ఇంతగా, ప్రసన్నం ఎందుకు చేసుకుంటున్నాడంటే, ఆయనొక గుట్కా కింగ్. తన చీకటి గుట్కా సామ్రాజ్యం వర్ధిల్లడానికి, ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీకి కొమ్ముకాస్తుంటాడు.

అధికార పార్టీల కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడని సదరు గుట్కా కింగ్, తనకు తెలిసిన ఆ బడా నేత ఆశీస్సులతో ఓ దశలో అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సైతం రెడీ అయ్యాడట. ఐతే గుట్కా వ్యాపారం ఆయనకు మచ్చగా మారడంతో పార్టీలో సౌమ్యునిగా ఉండే మరో నేతకు, ఆ సీటు కేటాయించారట. ఎమ్మెల్యే సీటుకు ప్రత్యామ్నయంగా ఆయనకు రాష్ట్రస్ధాయిలో నామినేటెడ్ పోస్టు కట్టబెట్టారట. పార్టీలో కీలక నేత సపోర్టు, తన హోదాతో వ్యాపారాన్ని విస్తరించాడనే టాక్ ఉంది.

జిల్లాలో గుట్కా దందా ఎవరు నడిపిస్తారని జిల్లా కేంద్రంలో చిన్న పిల్లాడిని అడిగినా టక్కున ఆయన పేరే చెప్పేస్తారట. అంతలా ఆ లీడర్ ఈ అక్రమ దందాలో ఫేమస్ అయ్యారట. ఇక ఇదే దందా చేసే చిన్నా చితక వ్యాపారులను తొక్కేయడం, వారిపై దాడులు చేయించి కేసులు బనాయించడం, తన దందాకు ఎవరూ అడ్డురాకుండా చేసుకోవడంలో ఆయన దిట్ట. ఇలాగే దాదాపుగా 30ఏళ్లుగా ఈ సామ్రాజాన్ని నడిపిస్తున్నారట. ఎవరైనా ఆయన జోళికి వెళితే పైస్ధాయి నుంచి ఫోన్లు వస్తాయనే ప్రచారం ఉంది. అందుకే గుట్కా కింగ్ ఎవరో తెలిసినా, తెలియనట్లు నటిస్తారట పోలీసులు.

నిజామాబాద్ జిల్లా గులాబీ పార్టీలో కొనసాగుతున్న సదరు నేతకు, కొంత కాలంగా అర్బన్‌లో ఉండే ఓ కీలక ప్రజాప్రతినిధితో పడటం లేదంట. ఫలితంగా కొద్ది రోజుల క్రితం ఓ భారీ గుట్కా డంప్‌ను పోలీసులు పట్టుకున్నారట. పక్కా సమాచారంతో గుట్కా పట్టుకున్న పోలీసులకు, రాష్ట్రస్థాయి నేత నుంచి ఫోన్లు రావడంతో, కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు ఈ కేసు నుంచి కీలక సూత్రధారిని వదిలి, పాత్రధారులపై కేసులు పెట్టారనే టాక్ నడుస్తోంది.

గతంలో ముడి పదార్ధాలు తీసుకొచ్చి ఇక్కడే గుట్కా తయారు చేసే సదరు నేత, కొద్దిరోజులుగా తన రూటు మార్చారు. హైదారాబాద్ నుంచి నిజామాబాద్‌కు రహస్యంగా గుట్కా డంపులు తీసుకొచ్చి జిల్లాకేంద్రలోని మూడు చోట్ల గోదాముల్లో దాస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాకు మొత్తం నిజామాబాద్ కేంద్రంగా సరఫరా చేస్తారట. ఇప్పటి వరకు గుట్కాను విక్రయించే చిరు వ్యాపారులు దాడుల్లో చిక్కుతున్నా ఆ బడా వ్యాపారి మాత్రం తెరపైకి రాలేదంటే ఎంతగా తన పలుకుబడి ఉపయోగించుకుంటున్నారో అర్దం చేసుకోవచ్చు. సాహసం చేసి పట్టుకున్నా ఆయన పేరు బయటకు చెప్పకుండా అధికార పార్టీలో రాష్ట్రస్ధాయిలో కీలకంగా ఉన్న ఓ నేత, ఆయనకు అండగా నిలుస్తున్నారట. అందుకే ఆయనే సూత్రధారి అని తెలిసినా, ఆయనను టచ్ చేసే సాహసం చేయటం లేదట పోలీసులు.

గుట్కా కింగ్‌గా వ్యాపారంలో, నామినేటెడ్ పోస్టుతో రాజకీయాల్లో రాణిస్తున్న సదరు నేత రాబోయే ఎన్నికల్లో ఏకంగా నిజామాబాద్ అర్బన్ సీటుకు ఎసరు పెట్టారట. నిషేధిత గుట్కాపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం చెబుతున్నా ఈ బడా వ్యాపారి అలియాస్ నేతకు సపోర్టు ఇస్తున్న రాష్ట్రస్థాయి నేత, ప్రజల ప్రాణాలను సైతం పరిగణలోకి తీసుకోవాలని ఇందూరు వాసులు కోరుతున్నారు. ఇలాంటి వారిని రాజకీయాలకు దూరంగా ఉంచితే అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు. గులాబీ బాస్ దృష్టి పెడితేనే ఈ అక్రమ వ్యాపారానికి చెక్ పడే అవకాశముందని చెబుతున్నారు. చూడాలి, రానున్న కాలంలో ఏం జరుగుతుందో.లైవ్ టీవి


Share it
Top