బీజేపీలో బండికి బ్రేకులేస్తోంది ఎవరు?

బీజేపీలో బండికి బ్రేకులేస్తోంది ఎవరు?
x
Highlights

పడుతూ లేస్తున్న తెలంగాణ బీజేపీ బండిని ట్రాక్‌ ఎక్కించాలన్నది ఆయన లక్ష్యం. పట్టాలపై పరుగులు పెట్టించి, పాలానా సౌధాన్ని చేరాలన్నది కొత్త సారథి ఆశయం....

పడుతూ లేస్తున్న తెలంగాణ బీజేపీ బండిని ట్రాక్‌ ఎక్కించాలన్నది ఆయన లక్ష్యం. పట్టాలపై పరుగులు పెట్టించి, పాలానా సౌధాన్ని చేరాలన్నది కొత్త సారథి ఆశయం. కానీ ఎక్కడికక్కడ బండికి బ్రేకులేస్తున్నారట కొందరు సొంత పార్టీ నేతలు. దీంతో బీజేపీ బండికి కొత్త స్పేర్‌ పార్ట్స్ తగిలించి, సీనియర్లకు చెక్‌ పెట్టాలనిడిసైడయ్యాడట. ఇంతకీ బండికి బ్రేకులేస్తోంది ఎవరు?

తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన బీజేపీ జాతీయ నాయకత్వం ఓ సామాన్యుడికి పార్టీ పగ్గాలు అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు అన్న మెసేజ్ ఇవ్వటానికో ఏమో కానీ, పార్టీలో సీనియర్లను కాదని బండి సంజయ్ కు బాధ్యతలు అప్పగించింది. అయితే ఇదే ఇప్పుడు పార్టీలో ప్రచ్చన్న యుద్దానికి దారి తీసిందన్న చర్చ, కాషాయ సర్కిల్స్‌లో జరుగుతోంది.

ఒకప్పుడు తెలంగాణలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రం. కానీ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా, టీఆర్ఎస్‌కు దీటుగా ఎదగాలన్న వ్యూహంతో పోరాడిన బీజేపీకి, గత ఎన్నికలు ఎనలేని బూస్టింగ్ నిచ్చాయి. కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఆ పార్టీ, దక్షిణాదిపైన, మరీ ముఖ్యంగా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ సమయంలో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ఆ పార్టీలో కొత్త జోష్‌ను తీసుకువచ్చింది. మరీ ముఖ్యంగా సీనియర్లతో కానిది బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి యువ నాయకులు టీఆర్‌ఎస్‌కి చెందిన హేమాహేమీ ప్రత్యర్థులపై గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక సంజయ్ లాంటి నాయకుడికి ఉన్న మాస్ ఫాలోయింగ్ పార్టీలో టాప్ లీడర్ గా మార్చేసింది.

అయితే ఇదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి కోసం కసరత్తులు చేసిన పార్టీ అధిష్టానం చివరకు బండి సంజయ్ కు పట్టం కట్టి అందర్నీ, సర్‌ప్రైజ్ చేసింది. నిజానికి పలువురు సీనియర్లు అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. చివరి వరకు పార్టీలోని సీనియర్ల పేర్లే ప్రముఖంగా వినిపించాయి. కానీ ఆఖరికి సంజయ్‌కు పదవి దక్కడంతో వారంతా షాక్ కు గురయ్యారు.

అదే నివురుగప్పిన నిప్పును ఎగదోసింది. సంజయ్ మొదటిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన సమయంలో సీనియర్లందరూ హాజరయ్యారు. అయితే ఆ రోజు సంజయ్ కోసం భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన అభిమానులు తరలివచ్చారు. అది సీనియర్లకు అస్సలు మింగుడపడలేదని టాక్. అసలే పార్టీ బలోపేతం కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడి, చివరకు అధ్యక్ష పదవికి నోచుకోకపోవడంతో రగిలిపోతున్న సీనియర్లకు, సంజయ్‌‌ మందీమార్బలం అసహనానికి గురి చేసిందట. ఇక ఆ రోజు మొదలు, అధ్యక్షుడి హోదాలో సంజయ్‌ పాల్గొన్న కార్యక్రమాల్లో, సీనియర్లు కనిపించడం మానేశారని కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. బండికి దూరం దూరం జరుగుతున్నారని చర్చించుకుంటున్నారు. కరోనా పేరుతో ఇళ్లకే పరిమితం అవుతున్నారట. దీంతో అందుబాటులో ఉన్న వారితోనే టిఆర్‌ఎస్‌పై పోరుకు సంజయ్ సిద్ధమవుతున్నారట.

కొత్తగా బాధ్యతలు చేపట్టిన సంజయ్‌కు సీనియర్ల సహాయ నిరాకరణపై మిగతా సీనియర్లు, సామాన్య కార్యకర్తలు గుర్రుగా వున్నారట. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి పార్టీ అభివృద్ధికి పని చేయాల్సింది పోయి, ఇలా ఎడమొహం పెడమొహంగా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఈ వ్యవహారంలో సంజయ్ ముందు కొంత నొచ్చుకున్నా, అందరినీ కలుపుకుని వెళ్ళడమే అధ్యక్షుడిగా తన బాధ్యత అని చెప్తుకుంటున్నారట. పనిలో పనిగా తన సన్నిహితుల ద్వారా సీనియర్ల సహాయనిరాకరణను అధిష్టానం చెవిలో వేసేందుకు ప్రయత్నిస్తున్నారట.

మరోవైపు ఇదే సమయంలో కొత్త కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టిన సంజయ్, తన టీంతో కమిటీలను ఫామ్ చేసి పార్టీలో తన ప్రత్యర్థులకు చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీ బండిని పరుగులు పెట్టించాలనుకుంటున్న సంజయ్‌కు, సీనియర్లు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. చూడాలి, బీజేపీలో సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా మారిన కోల్డ్‌వార్‌ ఎప్పుడు చల్లారుతుందో? బండి ఎప్పుడు పట్టాలెక్కుతుందో?


Show Full Article
Print Article
More On
Next Story
More Stories