భట్టిపై ఆ నలుగురి కోపమెందుకు?

భట్టిపై ఆ నలుగురి కోపమెందుకు?
x
Highlights

ఆయన ఇరగదీశాననుకున్నారు. వన్‌ మ్యాన్ షోలా అపోజిషన్‌ బెంచీ నుంచి అదరగొట్టాననుకున్నారు. కీలకమైన అన్ని బిల్లులపై ధారాళంగా మాట్లాడాను, విపక్ష నాయకుడిగా...

ఆయన ఇరగదీశాననుకున్నారు. వన్‌ మ్యాన్ షోలా అపోజిషన్‌ బెంచీ నుంచి అదరగొట్టాననుకున్నారు. కీలకమైన అన్ని బిల్లులపై ధారాళంగా మాట్లాడాను, విపక్ష నాయకుడిగా చెలరేగిపోయా అనుకున్నారు. కానీ పక్కపక్కనే కూర్చున్న సొంత పార్టీ సభ్యులు రగిలిపోతున్నారని మాత్రం గ్రహించలేకపోయారు. అదే ఇప్పుడు గాంధీభవన్‌లో కుంపట్లు రాజేస్తోంది. ఆయన అనుకున్నది ఒక్కటి జరిగింది ఒక్కటా? ఎందుకిలా వన్‌మ్యాన్‌ షో...రివర్స్‌ రిజల్ట్ ఇచ్చింది?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో వన్ మెన్ షో గా నడిచిందనే చర్చ సీఎల్పీలో జరుగుతోంది. సభ ఎనిమిది రోజులు నడిచినా అన్ని అంశాలను కేవలం సీఎల్పీ నేతనే సభలో ప్రసంగించారనే చర్చ పార్టీలో ఉంది. పన్నెండు బిల్లులు, ఐదు ముఖ్య అంశాల పై చర్చ జరుగుతే అన్నింటిలో మెజార్టీ అంశాల పై భట్టి మాత్రమే ప్రసంగించారనే వాదన పార్టీలో జోరుగా వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో, ధాటిగా గొంతు వినిపించానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అనుకుంటున్నారు. నిజంగా అదే జరిగింది. అధికారపక్షమే కాదు, సొంత పక్షం ఎమ్మెల్యేల అభిప్రాయమూ అదే. ఇప్పుడు అదే భట్టి విక్రమార్కపై గాంధీభవన్‌లో మంటలకు కారణమైందన్న చర్చ జరుగుతోంది.

అసెంబ్లీలో కాంగ్రెస్ తరపున భట్టి వన్‌ మ్యాన్ షో జరిగినట్టుంది. అసెంబ్లీ ఎనిమిది రోజులు సాగితే, దాంట్లో అత్యధికంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కనే కాంగ్రెస్ తరపున ఆక్రమించారనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం ఆరుగురు సభ్యులున్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే సభకు హాజరయ్యారు. భద్రాచలం ఎమ్మెల్యే పోడేం వీరయ్య అనారోగ్యం కారణంగా సభకు రాలేదు. ఎనిమిది రోజుల సభలో పన్నెండు బిల్లులు, ఐదు ముఖ్య అంశాలపై చర్చ జరిగింది. ముఖ్య అంశాలల్లో కరోనా, కొత్త రెవెన్యూ బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు వ్యతిరేక తీర్మానం, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ది అంశాలపై చర్చ జరిగింది. ఈ అన్ని అంశాల్లో కూడా సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సభలో ఎక్కువ సేపు మాట్లాడారు. రెవెన్యూ, ప్రైవేటు యూనివర్సీటీల బిల్లుపై మాజీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడినా స్వల్పమే. ములుగు ఎమ్మెల్యే సీతక్క సైతం యూనివర్సీటీల్లో అధ్యాపకుల రిటైర్మెంట్ ఏజ్ పెంచడం బిల్లుపై మాట్లాడే అవకాశం వచ్చినా, భట్టితో పోలిస్తే తక్కువ టైమే. మిగతా అన్ని బిల్లులు, స్వల్పకాల చర్చలపై కూడా పూర్తిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రమే మాట్లాడి, కాంగ్రెస్ నుంచి తానొక్కడినే ఉన్నట్లుగా వ్యవహరించారని సీఎల్పీలో టాక్. గతంలో సీఎల్పీ నేత ముఖ్యమైన అంశాలపై మాట్లాడి, మిగతా అంశాలపై అందరి సభ్యులకూ మాట్లాడే అవకాశం ఇచ్చే ఆనవాయితి ఉండేది. కానీ ఈసభలో మాత్రం అన్ని సబ్జెక్ట్‌లు తనవే అన్నట్టుగా మిగతా సభ్యులను విస్మరించారని పార్టీలోనే రుసరుసల గుసగుసలు గుప్పుమంటున్నాయి.

కరోనా టైంలో గిరిజన గ్రామాలు తిరిగి, జనంలోనే వున్న తనకు, ఈ అంశంపై వివరంగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క , అసెంబ్లీ లాబీల్లో ఆవేదన వ్యక్తం చేశారట. ఇది సరైన సాంప్రదాయం కాదని, పార్టీకి మిగిలిందే కొందరు, కనీసం అసెంబ్లీలోనైనా మాట్లాడి, ప్రజలకు తామున్నామని భరోసా ఇచ్చే అవకాశం ఇవ్వాల్సిందిపోయి, ఇలా పక్కనపెట్టడం ఏమాత్రం సముచితం కాదని మాట్లాడారట. మొత్తానికి వన్‌ మ్యాన్ షోలా అసెంబ్లీలో కాంగ్రెస్ తరపున చెలరేగిపోయానని భట్టి భావిస్తుంటే, అటు పార్టీ నేతలు మాత్రం రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌ అంటే భట్టీ ఒక్కడేనా అంటూ మండిపడుతున్నారట. మొత్తానికి భట్టీ ఒకటి తలిస్తే, మరోటి జరుగుతోందంటున్నారు విశ్లేషకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories