Top
logo

Municipal Elections 2020: ఆదిలాబాద్‌లో ఎంఐఎం ఎఫెక్ట్‌తో లాభం ఎవరికి...నష్టం ఎవరికి?

Municipal Elections 2020: ఆదిలాబాద్‌లో ఎంఐఎం ఎఫెక్ట్‌తో లాభం ఎవరికి...నష్టం ఎవరికి?
X
ఆదిలాబాద్‌లో ఎంఐఎం ఎఫెక్ట్‌తో లాభం ఎవరికి...నష్టం ఎవరికి?
Highlights

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మున్సిపాల్టీల్లో ఎంఐఎం ఎఫెక్ట్‌ వుంటుందా? వుంటే, ఏ పార్టీకి లాభం...ఏ పార్టీకి నష్టం?...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మున్సిపాల్టీల్లో ఎంఐఎం ఎఫెక్ట్‌ వుంటుందా? వుంటే, ఏ పార్టీకి లాభం...ఏ పార్టీకి నష్టం? ఫ్రెండ్లీ పోటీ అంటున్న టీఆర్ఎస్‌కు ప్లస్సా...మైనసా....? పోలరైజేషన్‌పై ఆశలు పెంచుకున్న కాషాయానికి ఎంఐఎం పోటీ బూస్ట్‌నిస్తుందా? మైనార్టీ ఓట్లు తనవేనంటున్న కాంగ్రెస్‌‌ పరిస్థితి ఏంటి? ఎంఐఎం పోటీ, ఏ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు ఎంఐఎం, మరోవైపు బీజేపీ, ఇంకోవైపు టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు అత్యధిక స్థానాలు గెలిచేందుకు అస్త్రాలకు పదునుపెడుతున్నాయి. దీంతో నాలుగు ప్రధాన పార్టీలు విడివిడిగా పోటీ చేస్తుండటంతో, ఎవరి ఓట్లు చీలుతాయి అది ఎవరికి లాభంగా మారుతుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే ఈ మొత్తం మున్సిపోల్స్‌ వార్‌లో దూకుడుగా ఆయుధాలు సంధిస్తున్న ఎంఐఎం, మిగతా అన్ని పార్టీలను పరేషాన్ చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో విస్తరించడానికి సకల అస్త్రాలనూ సంధిస్తోంది గాలిపటం పార్టీ ఎంఐఎం. ఇప్పటికే భైంసాలో తన హవా కొనసాగిస్తోంది. భైంసాలో ఆల్రెడీ ఇద్దరు ఎంఐఎం వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడం, ఆ పార్టీ బలానికి సూచికంటున్నారు విశ్లేషకులు.

సింగరేణి ప్రాంతాలపై గురిపెట్డింది‌‌ ఎంఐఎం. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలపై గురిపెట్టారు. ఆ ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను తనవైపు తిప్పుకునేలా ప్రచారాంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తుతున్నారు. వీటితో పాటు బిజెపి మతతత్వ విధానాలను అనుసరిస్తోందంటూ ముస్లిం వర్గాలతో పాటు మిగతా వర్గాలనూ ఆకట్టుకునేలా ప్రసంగాలిస్తున్నారు అసదుద్దీన్.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పదకొండు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గులాబీ పార్టీతో స్నేహ పూర్వకపోటీ చేస్తోంది ఎంఐఎం. భారీగా సీట్లు సాధించి కనీసం ఐదు మున్సిపాలిటీల్లో కారు పార్టీతో కలిసి వైస్ చైర్మన్ పదవులు దక్కించుకుంటామన్న ధీమాలో వున్నారు ఎంఐఎం నాయకులు. కాంగ్రెస్ బలహీనంగా ఉండటం తమకు అనుకూలమని లెక్కలేస్తున్నారు. మరోవైపు టిఆర్‌ఎస్, ఎంఐఎం వేర్వేరుగా పోటీ చేస్తుండటంతో భైంసా, నిర్మల్ పురపాలికల్లో ఎవరు అధిక సీట్లు సాధిస్తే వారే చైర్మన్ అయ్యే పరిస్థితులున్నాయి. దీంతో ఎంఐఎం కంటే మెరుగైన ఫలితాల సాధన టిఆర్‌ఎస్‌కు సైతం సవాల్‌కు మారింది. టీఆర్ఎస్‌ నాయకులు, ఎంఐఎం అభ్యర్థుల్లేని చోట, టీఆర్ఎస్‌కు సహకరిస్తోంది గాలిపటం. అయితే ఎంఐఎం విస్తరణ మాత్రం, లోలోపల అధికార పార్టీకి వణుకు పుడుతోంది. త్రిముఖ పోటీలో గులాబీ పార్టీ తక్కువ సీట్లు సాధిస్తే, చైర్మన్ పదవులు ఇవ్వాలని ఎంఐఎం డిమాండ్‌ చేసే అవకాశముందన్నది గులాబీ పార్టీ టెన్షన్.

అటు భైంసాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అనేక చోట్ల ఎంఐఎం దూకుడుతో తమకే లాభమని లెక్కలేస్తోంది బీజేపీ. మతం ప్రాతిపదికన ఓట్లు చీలి, మెజారిటీ తమవైపే వుంటారని సమీకరణాలు చూసుకుంటోంది. అటు కాంగ్రెస్‌ అనుకూల మైనార్టీ ఓట్లను ఎంఐఎం చీల్చే ప్రమాదముందని హస్తం పార్టీ ఆందోళన చెందుతోంది. ఇలా బీజేపీ మినహా అధికార టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు ఎంఐఎం దూకుడుతో టెన్షన్‌ పడుతున్నాయి. చూడాలి, ఓటింగ్‌కు ముందే అలజడి రేపుతున్న ఎంఐఎం, ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో.Web TitleWhich party effects with MIM in Adilabad Municipal elections
Next Story