కమలంలో ఆ ఇద్దరు నేతల గురి ఏంటి?

కమలంలో ఆ ఇద్దరు నేతల గురి ఏంటి?
x
Highlights

జి. వివేక్‌ సన్నాఫ్‌ వెంకటస్వామి కాక. మోత్కుపల్లి నర్సింహులు, పేరుతో పాటు నోరున్న నేత. ఈ ఇద్దరిలో వివేక్ ఇప్పటికే బీజేపీలో చేరారు. మోత్కుపల్లి...

జి. వివేక్‌ సన్నాఫ్‌ వెంకటస్వామి కాక. మోత్కుపల్లి నర్సింహులు, పేరుతో పాటు నోరున్న నేత. ఈ ఇద్దరిలో వివేక్ ఇప్పటికే బీజేపీలో చేరారు. మోత్కుపల్లి నర్సింహులు రేపోమాపో చేరేందుకు సిద్దమయ్యారు. అయితే ఇద్దరు నేతలకు బీజేపీ నుంచి ఎలాంటి గట్టి హామి వచ్చిందో కానీ, తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ ఇద్దరు నేతలు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగా, పెద్ద పోస్ట్‌లే అడుగుతున్నారట.

తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ, అదే జోష్‌తో ఇక్కడ పాగా వేయాలని రకరకాల వ్యూహాలు రచిస్తోంది. అటు కాంగ్రెస్ నుంచి, ఇటు టీడీపీ నుంచి, వీలయితే టీఆర్ఎస్‌ నుంచి నేతలను ఆకర్షిస్తూ, బలోపేతం కావాలని స్ట్రాటజీలు వేస్తోంది. కాంగ్రెస్‌ను రీప్లేస్ చేసి, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోంది. అందులో భాగంగానే, తెలంగాణలో కీలక సామాజికవర్గమైన దళితులపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఆ వర్గానికి చెందిన బలమైన నాయకులను బీజేపీలోకి చేర్చుకుంటోంది.

పెద్దపల్లి మాజీ ఎంపీ, దళిత నాయకుడు, పారిశ్రామికవేత్త వివేక్‌‌కు, కాషాయ కండువా కప్పి, పార్టీలోకి తీసుకుంది బీజేపీ. అటు మరో దళిత నేత, టీడీపీ మాజీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులును సైతం, పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. ఈ ఇద్దరు దళిత నేతల రాకతో, తెలంగాణలతో కీలకమైన దళిత సామాజికవర్గాన్ని ఆకర్షించవచ్చన్నది అమిత్‌ షా వ్యూహం. అయితే ఆ ఇద్దరు నేతల మదిలో మెదులుతున్న ఆశలు, ఆశయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.

కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్, మళ్లీ టీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్, తిరిగి కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్. ఇలా కొన్నేళ్లుగా రెండు పార్టీల చుట్టూ తిరిగారు మాజీ ఎంపీ వివేక్. 2009లో పెద్దపెల్లి నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా ఎన్నికైన వివేక్‌ తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎ్‌సతో కలిసి పని చేశారు. అయితే 2014లో మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరి రెండోసారి ఆ పార్టీ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. 2017లో సింగరేణి ఎన్నికల సమయంలో తిరిగి గులాబీ గూటికి చేరారు. తర్వాత వివేక్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా సీఎం కేసీఆర్‌ నియమించారు. అయితే ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో పెద్దపల్లి సీటు ఆశించిన వివేక్‌కు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం టికెట్‌ నిరాకరించడంతో, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఆ టైంలో బీజేపీలో చేరి పెద్దపల్లి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా తగినంత సమయం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నారు. ఇటీవల పలుమార్లు ఆ పార్టీ నేతలతో చర్చల తర్వాత, కమలం తీర్థం పుచ్చుకున్నారు. కాగా కోల్‌బెల్ట్‌ ఏరియాలో గట్టి పట్టున్న వివేక్‌ చేరికతో ఆ ప్రాంతంలో పార్టీ బలోపేతమవుతుందని బీజేపీ నేతలు లెక్కలేస్తున్నారు.

ఇక మోత్కుపల్లి నర్సింహులు. టీడీపీ హయాంలో ఒక వెలుగు వెలిగారు. దళిత సామాజికవర్గంలో పేరున్న నేత. నోరున్న నేత. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీతో పాటు ఆయన ఉనికికి కూడా ప్రమాదం ఏర్పడింది. మొన్నటి ఎన్నికల్లో ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు. ఎటు వెళ్లాలో అర్థంకాక సతమతమవుతున్న మోత్కుపల్లిపై, కమలం చూపు పడింది. దీంతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్ మోత్కుపల్లి ఇంటికి వెళ్లి బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. దీనిపై మోత్కుపల్లి నర్సింహులు సైతం, సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

అయితే వివేక్, మోత్కుపల్లి ఇద్దరూ దళిత సామాజికవర్గంలో పేరున్న నాయకులే. బీజేపీనే స్వయంగా ఆహ్వానాలు పలుకుతుండటంతో, ఇక తమ సెకండ్ ఇన్నింగ్స్‌ ఉజ్వలంగా ఉండబోతోందని వారు కలలుకంటున్నారు. వివేక్, మోత్కుపల్లితో చర్చలు జరిపిన బీజేపీ పెద్దలు గట్టి హామీలే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇద్దరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నట్టుగా వాగ్దానాలిచ్చారని సమాచారం. అయితే, బీజేపీలో తామే కీలక దళిత నాయకులం అవుతామని భావిస్తున్న వివేక్, మోత్కుపల్లి, కీలక పోస్టులు అడిగారట.

తెలంగాణలో బీజేపీ చీఫ్‌గా తనను నియమించాలని అమిత్‌ షా, నడ్డాలను వివేక్ కోరినట్టు తెలుస్తోంది. దళితున్ని సీఎం చేస్తామని చెప్పి, కేసీఆర్ మోసం చేశారని అనేక సందర్భాల్లో అమిత్‌ షాతో పాటు కీలక నేతలు విమర్శించారు. దీంతో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే, తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందని ఆశిస్తున్నారు వివేక్. అందుకే తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారని తెలుస్తోంది. ఇటు మోత్కుపల్లి నర్సింహులు సైతం, ఇలాంటి డిమాండ్లే పెట్టారట. తెలంగాణలో దళిత ఓట్లు ఎటు మొగ్గితే, అటే అధికారమని తనను కలిసిన బీజేపీ నేతలతో మాట్లాడిన మోత్కుపల్లి, తనకు పార్టీలో కీలక పదవి ఇస్తే, దళిత ఓట్లను ఆకర్షించవచ్చని చెప్పారట.

ఇలా కమలంలో చేరిన, చేరబోతున్న ఇద్దరు దళిత నేతలు, తమదైన శైలిలో బీజేపీలో ఎదగాలని భావిస్తున్నారట. చేరిన సమయంలోనే పోస్టుల గురించి మాట్లాడుతున్నారట. ఎస్టీలు, ఎస్సీ ఓట్లపై ప్రత్యేక గురిపెట్టిన అమిత్‌ షా, గతంలో దళితలు, ఆదివాసీలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఆ వ్యూహంలో భాగంగానే, వివేక్, మోత్కుపల్లిని పార్టీలోకి తీసుకుంటున్నారట. అయితే మరి వీరికి ఎలాంటి హామిలిచ్చారు వారికెలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది కాలమే సమాధానం చెప్పాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories