Top
logo

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పుడెక్కడ?

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పుడెక్కడ?
X
Highlights

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఆయనో ముఖ్యనేత. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్రం నుంచి ...

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఆయనో ముఖ్యనేత. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు ఐదుసార్లు శాసనసభ్యునిగా విజయం సాధించారు. ప్రస్తుతం లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనకున్న పలుకుబడితో భార్యను కూడా ఓ సారి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అంతటి ఇమేజ్ ఉన్న ఆ నేత ఇప్పుడు నియోజకవర్గానికి ముఖం చాటేశారా? తన కంచుకోట అని చెప్పుకున్న ఆ నియోజకవర్గం వైపు ఇక చూడరా? ఇదే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే అర్థమై ఉంటుంది. మనం ఇప్పటిదాకా ఎవరి గురించి చెప్పుకున్నామో. అవును పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించే. వాయుసేనలో కెప్టెన్‌గా, ఆ తర్వాత రాష్టపతి భవన్ లో పనిచేసి, కాంగ్రెస్ జాతీయ నాయకత్వ సహకారంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు ఉత్తమ్. 1999లో తొలిసారి కోదాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. మరుసటి ఎన్నికల్లో 2004లో కూడా అదే కోదాడ నుంచి గెలిచారు. 2009లో మాత్రం నూతనంగా ఏర్పడిన హుజూర్ నగర్ నుంచి బరిలోకి దిగి విజయ పరంపరను కొనసాగించి, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ కొట్టారు. అయితే మొన్నటి సాధారణ ఎన్నికల్లో పార్టీ అవసరాల కోసం నల్లగొండ లోక్ సభ నుంచి బరిలోకి దిగిన ఉత్తమ్, అక్కడ కూడా తన గెలుపు ప్రవాహాన్ని కొనసాగించారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా తను ఎంపీగా గెలవడంతో అనివార్యంగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఉత్తమ్ ఉప ఎన్నికల్లో తన భార్య పద్మావతిని బరిలోకి దించి ఘోరంగా ఓటమిని చూశారు. అయితే అంతకుముందే కోదాడలో భార్యను కూడా గెలిపించుకోలేదన్న అపవాదును మోస్తున్న ఉత్తమ్, హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో ఘోర పరాజయంతో అవమానాన్ని ఎదుర్కొన్నారని స్థానికంగా పెద్ద చర్చే జరిగింది. అందుకే ఉప ఎన్నికల ఫలితం వెలువడిన తర్వాత ఇప్పటివరకు నియోజకవర్గం ముఖం కూడా చూడలేదని అంటున్నారు హుజూర్ నగర్ వాసులు. వాస్తవానికి నేడో, రేపో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ కు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఇంతటి పరిస్థితుల్లో కూడా నియోజకవర్గ ముఖం చూడడం లేదనే వార్తలు హుజూర్ నగర్ లో ఊపందుకున్నాయి.

ఉత్తమ్ నేరుగా అధిష్టానం ఆశీస్సులతో ఎమ్మెల్యే సీటు దక్కించుకుని, రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదటి నుంచి హై ప్రోఫైల్ మెయింటెన్ చేస్తుంటారు. అందుకే వందసార్లు తిరిగినా కొంతమంది గ్రామీణ స్థాయి నేతలను గుర్తుపట్టరని అంటుంటారు. కాంగ్రెస్‌కు సంస్థాగతంగా ఉన్న క్యాడర్ బలానికి తోడు, మొదటి నుంచి ఉత్తమ్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది పోల్ మేనేజ్ మెంట్ మాత్రమేనని రాజకీయవర్గాల్లో చర్చ ఉంది. అలా మొదటి నుంచి గెలుపుకు అలవాటు పడిన ఉత్తమ్, ప్రస్తుత ఎదురీత పరిస్థితులను ఎదుర్కొలేక తన భార్య ఓటమిని తట్టుకోలేక పోతున్నారన్న చర్చ నడుస్తోంది. సొంత నియోజకవర్గాలుగా చెప్పుకున్న కోదాడ, హుజూర్ నగర్ ఈ రెండు చోట్లా పరాజయం, ఇప్పుడు ఉత్తమ్ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసిందని అంటున్నారు. దాంతో అవమానం భారంతో నియోజకవర్గం వైపు చూడడానికి కూడా ఉత్తమ్ ఇష్టపడటం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

రాష్ట్ర శాసనసభకు ముందస్తుగా గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తమ కంచుకోటలుగా చెప్పుకున్న నియోజకవర్గాలను కాంగ్రెస్ నేతలు కోల్పోయారు. సీనియర్ నేత జానారెడ్డి ధీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జునసాగర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదు పర్యాయాలుగా వరుస విజయాలను నమోదు చేసిన నల్లగొండ, ఉత్తమ్ సొంత నియోజకవర్గంగా పేరుగాంచిన కోదాడ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అయితే త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని ప్రచారం జరిగడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి వంటి వారు ఫలితాల ఎఫెక్ట్ క్యాడర్ మీద పడకుండా మరుసటి రోజే నియోజకవర్గంలో పర్యటించారు. ఆ తర్వాత వరుస పర్యటనలతో క్యాడర్ ను సమాయత్తం చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు కోర్టు కేసులతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కానీ అతి త్వరలోనే వివాదం లేని మున్సిపాల్టీలకు ఒకటి, రెండు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం ప్రస్తుతం కొనసాగుతోంది. అయినా నియోజకవర్గంలో పర్యటించి క్యాడర్‌ను ఓటమి నుంచి బయటపడేసే ప్రయత్నాలపై కనీసం దృష్టి పెట్టడం లేదు ఉత్తమ్ దంపతులు.

మొదటి నుంచి పదవితో ఉన్న ఉత్తమ్ ఇప్పుడు పదవి లేకుండా నియోజకవర్గంలో ఉండకపోవచ్చని ఆ పార్టీ కార్యకర్తల్లోనే జోరుగా చర్చ నడుస్తోంది. నల్లగొండ ఎంపీగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా హుజూర్ నగర్ తో ఎటువంటి సంబంధం లేకపోవడం కొంత ఇబ్బందికర పరిస్థితి అంటున్నారు. ఇప్పుడు నియోజకవర్గానికి వస్తారన్న ఆశలు కూడా లేవని చెబుతున్నారు. అందుకే ఉంటే హైదరాబాద్, లేదా కోదాడలో అందుబాటులో ఉంటారని హుజూర్ నగర్ లో ఇక ఉత్తమ్ చరిత్ర ముగిసిన అధ్యాయంగా చెప్పుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్‌లో కొంతమంది నేతలు అనుకుంటున్నారు. ఎలాగూ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలుండటం, దానికి తోడు ఎంపీగా ఉన్నందున ఢిల్లీలో మాకాం వేసి, ఏఐసిసి, సెంట్రల్ వర్కింగ్ కమిటీ స్థాయిలో ఏవైనా పదవులు పొందేందుకు ప్రయత్నించవచ్చని, ఇటీవల దివంగతులైన మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి స్థానంలో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తుండవచ్చని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు.

ఏదేమైనా రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. కానీ హుజుర్ నగర్ లో ఎమ్మెల్యే గా ఓడిన పద్మావతి ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇప్పటి వరకు హుజుర్ నగర్ లో పర్యటించలేదు. కనీసం ఎన్నిక తర్వాత మాట్లాడక పోవడంతో, క్యాడర్‌లో నిరాశ నెలకొంది. ఓటమి‌ రాజకీయాన్ని స్వీకరించే రాజకీయం ఉత్తమ్ కు ఇంకా అలవాటు కాలేదన్నది మాత్రం నిజమని చాలా మంది బహిరంగంగానే మాట్లాడుతున్నారు.


Next Story