logo

అమాత్య యోగం పట్టేదెవరికి?

అమాత్య యోగం పట్టేదెవరికి?
Highlights

తెలంగాణలో కేబినెట్‌ విస్తరణ ఎప్పుడు? అసలు ఉంటుందా? ఉండదా? ఉంటే ఏ జిల్లాకు ఎంత ప్రాధాన్యం ఇలా ఎవరి లెక్కలు...

తెలంగాణలో కేబినెట్‌ విస్తరణ ఎప్పుడు? అసలు ఉంటుందా? ఉండదా? ఉంటే ఏ జిల్లాకు ఎంత ప్రాధాన్యం ఇలా ఎవరి లెక్కలు వారికున్నా ఖమ్మంలో మాత్రం దీనిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. జిల్లా నుంచి ఎవరికి అమాత్యయోగం పట్టనుందోనన్న ప్రచారం ముఖ్య నేతల అనుచరులను ఆలోచింపచేస్తుంది. సీఎం కేసీఆర్‌ ఇచ్చే ప్రయారిటీ సీనియారిటీకా సిన్సియారిటీకా అన్న చర్చ ఖమ్మం గుమ్మంలోని రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపడతారనే ప్రచారం ఊపందుకోవడంతో ఖమ్మం జిల్లాలో మంత్రిపదవిఎవరికి దక్కనుందనే అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రావడం, ఎమ్మెల్సీ, స్థానిక, ప్రాదేశిక ఎన్నికలన్నీ పూర్తవ్వడంతో ఇక మంత్రివర్గాన్ని విస్తరించడం పక్కా అంటూ పార్టీ వర్గాల్లో వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మంత్రి వ‌ర్గన్ని ఏర్పాటు చేయడంతో మరి తెలంగాణలో విస్తర‌ణకు ముహుర్తం ఎప్పుడా అని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. గత మంత్రివర్గ ఏర్పాటులో చోటు దక్కని ఖమ్మం నుంచి మంత్రి యోగం ఎవరికి దక్కనుందనేది ఇపుడు జిల్లామొత్తం హాట్ టాపిక్‌గా మారింది.

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే ఎన్నిక‌ల ఫ‌లితాల నుంచి ఎంపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ వరకు చాలా ప‌రిణ‌మాలు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మంత్రి తుమ్మలతో పాటు ఏకంగా తొమ్మిది స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఎంపీ ఎన్నిక‌ల్లో మాత్రం ఎవ‌రు ఉహించ‌ని విధంగా భారీ మెజారిటితో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఘన విజ‌యం సాధించారు. నామా గెలుపులో కీల‌కంగా వ్యవహరించిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమారు మంత్రి ప‌ద‌విపై ఆశ పెట్టుకున్నారు. మరోవైపు జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన స‌భ్యుల‌ను స్పీక‌ర్ గులాబీ స‌భ్యులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవ‌డంతో వారి నుంచి కూడా ఆశావాహులు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. తమకూ ఒక ఆవ‌కాశం ఇవ్వాలంటు టీడీపీ నుంచి చేరిన సండ్ర వెంకటవీరయ్య గులాబీ పెద్దలను కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలా వారీగా చూసుకుంటే సీఎం కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేదు. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాల్లో కేవలం ఒక్క ఖమ్మం స్థానంలో మాత్రమే పువ్వాడ అజయ్ గెలుపొందారు. జిల్లాలో స్థానిక నేతల అంతర్గత పోరు వల్లే మొత్తం స్థానాలు ఓడామనే భావనలోఉన్న కేసీఆర్‌ మీడీయా సాక్షిగా తన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వేగంగా చోటు చేసుకున్న పరిణామాలతో మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్గ తప్ప మిగిలిన వారంతా గులాబీ గూటికి చేరారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పక్కకు పెట్టి టీడీపీ నుంచి వచ్చి చేరిన నామా నాగేశ్వరరావుకు సీటు ఇచ్చారు. దీంతో తప్పని పరిస్థితుల్లో పార్టీ నేతలంతా కలిసి కట్టుగా పనిచేసి ఖమ్మం స్థానం గెలిపించారు కాబట్టి ఈసారి ఇక్కడి నుంచి ఎవరికి మంత్రి వర్గంలో స్థానం లభిస్తోందనే చర్చ జోరందుకుంది. ఖమ్మం కోటా నుంచి కేసీఆర్‌కు సన్నిహితుడైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కుతుందని ప్రచారం కూడా సాగుతోంది. మరి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అదృష్టవంతుడెవరో తెలియాలంటే కేబినెట్‌ విస్తరణ వరకు వేచి చూడాల్సిందే.


లైవ్ టీవి


Share it
Top