Top
logo

కేటీఆర్ సీఎం అయితే తప్పేంది.. గుత్తా మాటలకు అర్థాలే వేరా?

కేటీఆర్ సీఎం అయితే తప్పేంది.. గుత్తా మాటలకు అర్థాలే వేరా?
X
Highlights

ఆ సీట్లో కూర్చుంటే, ఎవ్వరైనా అలా ఒదిగిపోవాల్సిందే. ఎంత ఎదిగినా, ఆ పీఠమెక్కితే సైలెంట్‌ అవ్వాల్సిందే. అంతవరకూ...

ఆ సీట్లో కూర్చుంటే, ఎవ్వరైనా అలా ఒదిగిపోవాల్సిందే. ఎంత ఎదిగినా, ఆ పీఠమెక్కితే సైలెంట్‌ అవ్వాల్సిందే. అంతవరకూ జనంలో తిరుగుతూ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగే నేతయినా, కాళ్లూ చేతులు కట్టేసుకోక తప్పదు. బయట పెద్దగా తిరగరు. పొలిటికల్ కామెంట్లు కూడా చెయ్యరు. ఆ పదవే అంత. రూల్సే అంత. కానీ అదే పదవి అధీష్టించిన ఓ నాయకుడు, మాత్రం ఆ రూల్స్‌ను కాస్త బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. కుర్చీపై గుస్సాగా వున్న ఆ లీడరే, ఎందుకైనా మంచిదని భవిష్యత్తు కోసమే గళం విప్పుతున్నారట. ఇంతకీ ఏదా పదవి? ఎవరా నేత?

రాష్ట్ర గవర్నర్ తర్వాత రెండో స్థాయి ప్రోటో కాల్ ఉండే పదవి శాసన మండలి ఛైర్మన్ పదవి. పేరుకు మాత్రమే పెద్ద పదవి, కానీ దాన్ని అధీష్టించాలంటే చాలా మంది నేతలు అయిష్టతనే వ్యక్తం చేస్తుంటారు. ఎందుకో శాసనసభ స్పీకర్ కన్నా, పెద్ద పదవే అయినా, అంత క్రేజీ ఉండదంటారు. ఆ సీట్ల్లో కూర్చుంటే కీలక ప్రజాజీవితం కోల్పోతామనే భావన నాయకుల్లో నెలకొని వుంటుందట. అంతేకాదు, ఆ పోస్ట్ తర్వాత, ఇక రాజకీయంగా శూన్యమేననే సెంటిమెంట్‌ కూడా వుండటంతో, మండలి చైర్మన్‌ సీటు పట్ల, చాలామంది నేతలకు చిరాకు. చివరికి ఏ పదవీ రాకపోతే, ప్రోటోకాల్ కోసం ఆ సింహాసనంపై కూర్చుంటుంటారు నేతలు. ఇష్టంలేని కాపురంలా వుంటూనే, మరో బ్రేక్ కోసం ఎదురుచూస్తుంటారు.

ఉమ్మడి రాష్ట్రంలో చాలాకాలం శాసన మండలి రద్దయ్యింది. రాజకీయంగా అసెంబ్లీలో అవకాశం లేని నేతలకు, పదవుల్లో సర్దుబాటు చేయడం కోసం ఉపయోగ పడుతుందనే వాదన ఉంది. చాలా రాష్ట్రాల్లో శాసన మండలి అనే వ్యవస్థే లేదు. ఇది శాసన సభపై పెత్తనం చెలాయించడం కోసమే మాత్రమేననే అభిప్రాయం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ సారి, ఈ వ్యవస్థ పనితీరు చర్చనీయాంశమే. ఎన్టీఆర్ హయాంలో దీని అవసరం ఏంటని, ఏకంగా రద్దు చేశారు. ఆ తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో, కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చాక శాసన మండలిని పునరుద్దరించారు.

ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఏ రాష్ట్ర శాసన మండలి, ఆ రాష్ట్రానికి ఉన్నా, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా పనిచేసిన స్వామిగౌడ్ వ్యాఖ్యలతో మరోమారు చర్చనీయాంశమైంది. తాను ప్రజా జీవితంలో చురుగ్గా ఉండే సమయంలో, మండలి ఛైర్మన్ పదవి ఇచ్చి నోరు కట్టేసారనే మాటలు చర్చకు తెరలేపాయి. అయితే ప్రస్తుత ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా చురుకైన ప్రజాజీవితం గడిపిన లీడరే. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి బాగోగులు చూసుకునే నేత. గతంలో ఎంపీగా అభివృద్ది పనుల్లో భాగస్వామ్యం అయ్యో లీడర్. అలాంటి నాయకుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత, రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించారు. కానీ రాజకీయంగా గులాబీ బాస్ కేసీఆర్ లెక్కలు మాత్రం సెట్‌ కాలేదేమో గానీ, గుత్తా సుఖేందర్ రెడ్డికి శాసన మండలి చైర్మన్ పదవి కట్టబెట్టారు.

మండలి ఛైర్మన్ పీఠంపై కూర్చున్న నాటి నుంచీ, ఎందుకో గుత్తా కాస్త గుస్సాగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆయన ప్రతి సందర్భంలోనూ, ఎప్పుడూలేని విధంగా, రాజకీయంగా మాట్లాడుతున్నారు. గతంలో మండలి ఛైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తులు పాలిటిక్స్ గురించి మాట్లాడకుండా దూరంగా ఉండేవారు. కానీ, గుత్తా అందుకు విరుద్ధంగా నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష రాజకీయాలపై, ప్రతి సందర్బంలోనూ గొంతు విప్పుతున్నారు. ఇప్పుడు ఏకంగా కేటీఆర్ సీఎం అయితే తప్పేంది అని అంటున్నారు. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఏదో అనుకుంటే, ఇంకేదో జరిగిందనే భావనా, లేక మళ్లీ క్యాబినెట్లో స్థానంకోసం ప్రయత్నాలా అని అందరూ చర్చించుకుంటున్నారు.

అవసరమైతే ఛైర్మన్ పీఠం నుంచి తప్పుకొనైనా, తన ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కాకుదడనే ఉద్యేశ్యంతోనే, గుత్తా ఇలాంటి రాజకీయ కామెంట్స్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. కామ్‌గా ఉంటే, రానున్న రోజుల్లో గత ఛైర్మన్ స్వామిగౌడ్ లాగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని, నిత్యం తన నియోజకవర్గంలో, ప్రజల్లో తిరుగుతున్నారట. అవసరమైతే మళ్లీ క్యాబినెట్లో స్థానం కోసం ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇలాంటి కీలక రాజకీయ కామెంట్స్ చేస్తున్నారని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Web TitleWhat's wrong in KTR becoming Chief Minister? Gutta Sukender
Next Story