తెలంగాణలో వరుస ఎన్​కౌంటర్లకు కారణం ఏమిటి?

తెలంగాణలో వరుస ఎన్​కౌంటర్లకు కారణం ఏమిటి?
x
Highlights

తెలంగాణ వస్తే.. ఎన్ కౌంటర్లే ఉండవన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఎందుకు నిజం కావడం లేదు. రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల అలజడి, వరుస ఎన్​కౌంటర్లు జరగడానికి...

తెలంగాణ వస్తే.. ఎన్ కౌంటర్లే ఉండవన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఎందుకు నిజం కావడం లేదు. రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల అలజడి, వరుస ఎన్​కౌంటర్లు జరగడానికి కారణాలెంటి.? నయా రాష్ట్రంలో పేలిన తూటాలెన్ని దొరికిన తుపాకులెన్ని.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో 11 ఎన్​కౌంటర్లు జరిగాయి. ఇప్పటి వరకు 26మంది చనిపోయారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లో అలజడి తారా స్థాయికి చేరింది. ఆదిలాబాద్, మంగ్లీ మన్నెం ఇప్పటికీ నిద్ర పోవడం లేదు. అటు పోలీసులు, ఇటు మావోలు తుపాకుల మోత మోగిస్తున్నారు. గడిచిన మూడు వారాల్లోనే జరిగిన 4 ఎన్​కౌంటర్లలో 8 మంది మావోయిస్టులు​ ప్రాణాలు విడిచారు. ఈ సందర్భంగా ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు ఉద్యమ నేత కేసీఆర్ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నాయి.

తెలంగాణ వచ్చాక 2015 జూన్​లో 19 ఏళ్ల వివేక్​ సహా ఇద్దరు మహిళా మావోయిస్టులను ఎన్​కౌంటర్​ చేశారు. అదే ఏడాది సెప్టెంబర్​ 15న ఉమ్మడి వరంగల్​ జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో శ్రుతి, సాగర్​ పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. ఆ తర్వాత చాలా కాలంపాటు మావోయిస్టు కార్యకలాపాలు, ఎన్​కౌంటర్ల ముచ్చటే వినిపించలేదు. తర్వాత మళ్లీ 2017 డిసెంబర్​ 14న తుపాకుల మోత వినిపించింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా బోడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో 9మంది నక్సల్స్​ ప్రాణాలు విడిచారు. ఇలా తరుచూ అక్కడక్కడ మావోల ఏరివేత జరుగుతూనే ఉంది.

కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు రాక, ఉపాధి లేక తీవ్ర నిరాశలో ఉన్న యువత పోరు బాట పడుతున్నాయి. ఇక పోడు, అసైన్డ్​ భూములను వివిధ అవసరాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడాన్ని గిరిజన, దళిత, ఇతర బలహీనవర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీటిని ఆసరాగా చేసుకొని మావోయిస్టులు జనాలకు దగ్గరవుతున్నారని పోలీసులు గుర్తించారు. ఇందుకు తగినట్లే సానుభూతిపరులను అరెస్ట్​ చేస్తున్నారు పోలీసులు.

లాక్​డౌన్ టైంలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోకి మావోయిస్ట్​ దళాలు, ప్రత్యేకంగా పది యాక్షన్​ టీంలు ప్రవేశించాయని నిఘా వర్గాలు పసిగట్టాయి. అందుకే సరిహద్దు జిల్లాల్లో వేలాది బలగాలతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఒక దశలో డీజీపీ మహేందర్​రెడ్డి స్వయంగా ఆసిఫాబాద్​ వెళ్లి నాలుగురోజుల పాటు అక్కడే ఉండి ఈ కూంబింగ్​ను పర్యవేక్షించారు. ఇలాంటి ఘటనలతో ప్రశాంతంగా ఉన్న పచ్చని అడవుల్లో మళ్లీ అలజడి మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందో అని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories