Top
logo

ముహూర్తాలన్నీ దాటిపోతున్నాయ్.. రాములమ్మ ఘర్‌వాపసి మెలిక ఏంటి?

ముహూర్తాలన్నీ దాటిపోతున్నాయ్.. రాములమ్మ ఘర్‌వాపసి మెలిక ఏంటి?
X
Highlights

దుబ్బాక క్యాంపెయిన్‌ టైంలోనే ఆమె పార్టీ మారతారన్న ప్రచారం జరిగింది. ఫలితం తర్వాత అట్టహాసంగా రీఎంట్రీ...

దుబ్బాక క్యాంపెయిన్‌ టైంలోనే ఆమె పార్టీ మారతారన్న ప్రచారం జరిగింది. ఫలితం తర్వాత అట్టహాసంగా రీఎంట్రీ వుంటుందన్న చర్చా సాగింది. ఇక గ్రేటర్‌ హోరులోనే పక్కాగా రాములమ్మ ఘర్‌వాపసీ అంటూ మాటలు వినపడ్డాయి. కానీ ఎప్పటికప్పుడు ముహూర్తాలన్నీ దాటిపోతున్నాయి. విజయశాంతి మాత్రం, అఫిషియల్‌గా కాషాయ గడపలో కాలు మోపడం లేదు. ఏదో మెలిక వున్నందుకే, ఆమెకు క్లియరెన్స్ దొరకడం లేదా? విజయశాంతి డిమాండ్లపై కమలం, తర్జనభర్జన పడుతోందా? ఇంతకీ ఏంటా మెలిక? డిమాండ్స్ ఏంటి?

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌ పర్సన్, విజయశాంతి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లడం కన్‌ఫాం. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి డౌట్‌ లేదు. అటు కాంగ్రెస్ కీ లీడర్స్ బుజ్జగించినా వినకపోవడం, ఇటు బీజేపీ స్టేట్ టాప్ లీడర్స్‌తో మీటింగ్‌లే ఇందుకు నిదర్శనం. అంతేకాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం, విజయశాంతి త్వరలోనే బీజేపీలోకి రాబోతున్నారని చాలాసార్లు కన్‌ఫాం కూడా చేశారు. రేపో మాపో ఆమె ఘర్‌వాపసీ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికితోడు, ప్రతిరోజూ ఆమె, కేసీఆర్‌ సర్కారుపై ట్విట్టర్ వేదికగా తిట్లు, శాపనార్థాలు పెడుతూనే వున్నారు. కాంగ్రెస్‌కు సపోర్ట్‌గా ప్రకటనలు చెయ్యడం లేదు. బీజేపీ పాయింట్‌ ఆఫ్ వ్యూలోనే విమర్శలు చేస్తున్నారు. ఇంతకుముందే చెప్పినట్టు, విజయశాంతి కాషాయ కండువా కప్పుకోవడం పక్కా. అయితే, ఎప్పటికప్పుడు వాయిదాలు పడిపోతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు వచ్చినరోజే ఆమె కమలం గూటికి చేరతారని ఒకసారి, అమిత్ షా సమక్షంలో రీఎంట్రీ ఇస్తారని మరోసారి, హస్తినలోనే కండువ మార్చబోతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ అవేమీ జరగలేదు. అసలింతకూ, బీజేపీలోకి విజయశాంతి వెళతారా? ఎందుకు లేట్ అవుతోందన్న ప్రశ్నకు, అదిరిపోయే ఆఫ్ ది రికార్డ్ విషయం ఒకటి బయటకు పొక్కింది. ఏంటది?

బీజేపీలోకి మళ్లీ గనుక వెళితే, మంచి పోస్ట్‌తోనే వెళ్లాలన్నది విజయశాంతి పట్టుదల అట. ఏదో చిన్నా చితక పదవితో కండువా మార్చుకోవడం ఆమెకు ఏమాత్రం ఇష్టంలేదట. జాతీయస్థాయిలో కీలకమైన పదవి ఒకటి డిమాండ్ చేస్తున్నారట విజయశాంతి. డీకే అరుణ కంటే మంచి పదవిని ఆశిస్తున్నారట. ప్రధాని మోడీ లేదంటే అమిత్‌ షా, ఇద్దరూ కాదంటే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలోనే పార్టీ మారతానని, కొన్ని డిమాండ్స్ పెట్టారట. ఇవే రాములమ్మ ఘర్‌వాపసీని మరింత లేట్ చేస్తున్నాయట. షరతుల్లేకుండా పార్టీలోకి వస్తే బాగుంటుంది కానీ, ఇలా సవాలక్ష డిమాండ్లు పెట్టడం ఏంటని, అధిష్టాన పెద్దలు కొంత అసహనం వ్యక్తం చేశారట. దీనికితోడు, రాష్ట్ర బీజేపీ నేతల్లో కొందరు, ఆమె రీఎంట్రీ పట్ల అంత హ్యాపీగా లేరట. నిలకడలేని మాటలు, క్షేత్రస్థాయిలో ఆందోళనలకు వెళ్లకపోవడం వంటివి, వారికి నచ్చడం లేదు. షోకేసులో బొమ్మలా ఆమెను చూసుకోవాలంటే కష్టమని అంటున్నారట. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా, పార్టీ ఆఫీసు మెట్లెక్కకుండా వున్నందుకే, కాంగ్రెస్‌లో ఆమెకు మద్దతు కరువైందని గుర్తు చేస్తున్నారట కమలం నేతలు. ఇలా ఇటు రాష్ట్ర నేతల ఫిర్యాదులు, అటు జాతీయస్థాయి పదవుల షరతులతో, విజయశాంతి రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట కాషాయ పెద్దలు.

అయితే, విజయశాంతి బీజేపీలోకి రావడాన్ని బీజేపీలో అత్యధిక నేతలు ఆహ్వానిస్తున్నారట. ఆమె వస్తే, తెలంగాణ బీజేపీకి కొత్త గ్లామర్ వచ్చినట్టేనని అంటున్నారట. అందులోనూ కేసీఆర్‌తో కలిసి ఎక్కువ రోజులు కలిసి పని చేశారు కాబట్టి, టీఆర్ఎస్ అధినేతపై ఆమె విమర్శలకు వెయిటేజీ వుంటుందని అభిప్రాయపడుతున్నారట. అధిష్టానం సైతం రాములమ్మ పట్ల పాజిటివ్‌గానే వుందట. అయితే, ఆమె షరతులు, పోస్ట్‌ల కండీషన్లే కొంత ఇబ్బందిగా మారాయట. ఈ మెలికలు తొలగిపోతే, ఆమె చేరికకు లైన్ క్లియర్ అయినట్టే. త్వరలోనే విజయశాంతి ఘర్‌వాపసీ కార్యక్రమం, గ్రాండ్‌గా వుంటుందని, ఆమె అనుచరులు మాత్రం ఘనంగా చెప్పుకుంటున్నారు. చూడాలి ఏమవుతుందో.

Web TitleWhat Is Vijayashanti Waiting For?
Next Story