మాజీ ఎంపీ కవితను సరికొత్త పాత్రలో చూడబోతున్నామా.. కవిత రాజకీయ భవిష్యత్తుపై సీఎం కేసీఆర్ ప్లాన్ అదేనా?

మాజీ ఎంపీ కవితను సరికొత్త పాత్రలో చూడబోతున్నామా.. కవిత రాజకీయ భవిష్యత్తుపై సీఎం కేసీఆర్ ప్లాన్ అదేనా?
x
కవిత రాజకీయ భవిష్యత్తుపై సీఎం కేసీఆర్ ప్లాన్ అదేనా?
Highlights

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా.. మాజీ ఎంపీ కవితను చూడబోతున్నామా..? నిన్నటి వరకు పెద్దల సభకు, చిన్మమ్మకు బెర్త్ దాదాపుగా ఖరారు అన్న గులాబీ నేతలు, ఇప్పుడు మాట...

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా.. మాజీ ఎంపీ కవితను చూడబోతున్నామా..? నిన్నటి వరకు పెద్దల సభకు, చిన్మమ్మకు బెర్త్ దాదాపుగా ఖరారు అన్న గులాబీ నేతలు, ఇప్పుడు మాట ఎందుకు మారుస్తున్నారు...? ఆమె రాజ్యసభ వద్దంటున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత...? కవిత మంత్రి కావాలంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎమ్మెల్సీ అవుతారా? కవిత రాజకీయ భవిష్యత్తుకు గులాబీ బాస్, ఇచ్చిన భరోసా ఏంటి?

మాజీ ఎంపీ కవితను సరికొత్త పాత్రలో చూడబోతున్నామా? కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? రాజ్యసభకా? రాష్ట్ర అసెంబ్లీకా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పెద్దల సభకు వెళ్లడం దాదాపుగా ఖరారయ్యిందనే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త ప్రచారం జోరందుకుంది. ఆమె పెద్దల సభకు కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించబోతున్నారని, గులాబీ పార్టీలో టాక్ వినిపిస్తోంది.

పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న జాగృతి అధ్యక్షురాలు కవిత, లోక్‌సభ ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు. సీఎం తనయగా, దేశ రాజకీయాల్లోను చురుకుగా వ్యవహరించిన కవిత, కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఐతే కవిత రాజకీయ భవిష్యత్తుకు, సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారనే ప్రచారం జరిగింది. సీనియర్ నేత కేకే పదవీ కాలం త్వరలో ముగియబోతోంది. ఆ స్థానం నుంచి కేసీఆర్ కుమార్తె రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం సాగింది. ఐతే కొద్ది రోజులుగా కేకే స్థానం నుంచి పార్టీ అధినేత కేసీఆర్ రాజ్యసభకు వెళ్తారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కవిత సైతం రాజ్యసభకు కాకుండా ప్రజల నుంచి ఎన్నుకునే పదవిలో ఉండాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే ఆమె రాజ్యసభకు కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించబోతున్నారట. ఈ ప్రచారం ప్రస్తుతం గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది.

రాష్ట్ర రాజకీయాల్లో తాను త్వరలో యాక్టివ్ కాబోతున్నట్లు ఆమె తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కవిత పాత్ర ఎలా ఉండబోతుందన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉన్నా ఒక వేళ తన తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభకు వెళ్తే ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి కవిత బరిలో దిగుతారనే చర్చ మొదలైంది.

గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కవిత గెలవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఐదేళ్ల పాటు ఎంపీగా సేవలందించిన కవిత త్వరలో ఎమ్మెల్యేగా అవకాశం వస్తే మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కవిత అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఐతే కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నా, రాజ్యసభకు వెళ్లొద్దనుకున్న ఆమె, మండలికి ఎందుకు వెళ్తారని ప్రశ్నిస్తున్నారు ఆమె అనుచరులు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, త్వరలో కవితను మంత్రిగా చూసే అవకాశం ఉంటుందని ఆమె అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారట.

ఏమో గుర్రం ఎగురావచ్చు అంటున్నారు పార్టీ క్యాడర్. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమని చెవులు కొరుక్కుంటున్నారు గులాబీ శ్రేణులు. కూతురు రాజకీయ భవిష్యత్తుపై సీఎం కేసీఆర్ పూర్తి భరోసా ఇచ్చారని పార్టీలో చర్చ జరుగుతున్నా తన కుమార్తెను ఏ విధంగా సెట్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టిన సీఎం త్వరలో కూతుర్ని రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ చేస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories