పొన్నం ప్రభాకర్‌కు ఏమైంది.. ఆయన అంతర్మథనానికి కారణమేంటి?

పొన్నం ప్రభాకర్‌కు ఏమైంది.. ఆయన అంతర్మథనానికి కారణమేంటి?
x
పొన్నం ప్రభాకర్‌
Highlights

ఆయన గడగడలాడించే స్పీకర్. మాటల తూటాలు పేల్చే డైలాగ్‌ గన్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఒకప్పుడు రాజకీయాలను ఇరగదీసిన తెలంగాణ లీడర్. ఇప్పుడాయన సప్పుడు లేదు....

ఆయన గడగడలాడించే స్పీకర్. మాటల తూటాలు పేల్చే డైలాగ్‌ గన్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఒకప్పుడు రాజకీయాలను ఇరగదీసిన తెలంగాణ లీడర్. ఇప్పుడాయన సప్పుడు లేదు. కీలకమైన పదవి ఇచ్చినా, ఆనాటి ధూంధాం లేదు. ఇంతకీ ఎవరాయన? ఏమైంది ఆయనకు?

పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. పొన్నం ప్రభాకర్ అంటే ఒకప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలియని రాజకీయ నేతల్లేరు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, అటు కేంద్రంలో ఇటు రాష్టంలో ఆయన చాలా కీలకమైన లీడర్‌గా చలామణి అయ్యారు. చాలా కిందిస్థాయి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన పొన్నం ప్రభాకర్, ఎంపీగా గెలిచిన తరువాత కేంద్ర రాజకీయాల్లో కూడా పేరు తెచ్చుకున్నారు. ఎంపీ ఫోరమ్ కన్వీనర్‌గా కూడా పనిచేశారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండదండలు కూడా ఉండటంతో పొన్నం ప్రభాకర్‌కు, పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ హవా నడిపించారు. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత, ఆయన పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.

సొంత జిల్లా కరీంనగర్‌లోను పొన్నం వ్యూహాలు రాజకీయంగా చాలానే ఫలించాయి. ఎన్‌ఎస్‌యూఐ నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నో వ్యూహాలతో ఆయన పైకి వచ్చారు. అలాంటి నేత, ఇప్పుడు మాత్రం డీలా పడిపోయారు. సొంత జిల్లాలో కాంగ్రెస్‌ను బతికించుకోలేకపోతున్నారు. ఇటీవల వచ్చిన వరుస ఎన్నికల ఫలితాలు చూస్తే, ఆ విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్, మూడో స్థానంలో నిలిచారు. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లోను పోటీ చేసి, థర్డ్‌ ప్లేసే మిగిలింది.

కరీంనగర్ జిల్లా మున్పిల్ ఎన్నికల విషయంలో పూర్తిగా అన్నీ తానై నడిపించారు పొన్నం. అవీ పార్టీలో గొడవలకు కూడా దారి తీశాయి. కరీంనగర్ డిసిసి కటకం మృత్యుంజయం కూడా ఈ విభేదాల కారణంగానే పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఇవన్నీ జరిగినా పొన్నం పట్టు వీడకుండా తన వ్యూహం ప్రకారమే టికెట్లు ఇచ్చారు. అయినా కరీంనగర్ జిల్లా మున్పిపాలిటి ఎన్నికల్లో, ఎక్కడా కాంగ్రెస్‌కి, అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేకపోయారు. ఇక కరీంనగర్ నగర పాలక ఎన్నికల్లో అయితే, పార్టీ ప్రకటించిన మేయర్ అభ్యర్థితో సహా చాలా మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇవన్నీ పొన్నం ప్రభాకర్‌కి రాజకీయంగా వరుసగా తగులుతున్న ఎదరుదెబ్బలే. సరిగ్గా పదేళ్ల క్రితం తన మాటంటే శాసనంగా నడిచిన పొన్నం, ఇప్పుడు ఇలా రాజకీయ ఎదరుదెబ్బలు తింటున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల తరువాత ఆయన మీడియా ముందుకు కూడా రాలేకపోయారు.

తెలంగాణ ఉద్యమ సమయంలోను పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెడుతుంటే, లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్పేని అడ్డుకున్నారు పొన్నం. తెలంగాణ కాంగ్రెస్‌లో ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్నారు. అయినా, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అక్కడి నుంచి నేటి వరకు మళ్లీ కోలుకోలేదు పొన్నం. ప్రతీ ఎన్నికల్లో ఆయనకు ఎదరుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటు క్యాడర్‌లో మనోస్దైర్యం నింపడంలోను, పొన్నం విఫలం అవుతున్నారనే చర్చ జరుగుతోంది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న పొన్నం వ్యూహాలు, కరీంనగర్‌లో ఎందుకు తిరగబడుతున్నాయో, ఆయన అనుచరులకీ తెలియని పరిస్థితి.

మొత్తానికి తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది తామేనంటూ కాంగ్రెస్‌ చెప్పుకున్నా క్యాష్‌ చేసుకోలేకపోయింది. తెలంగాణ ఉద్యమకారున్ని అంటూ పొన్నం అంటున్నా, అపజయాల నుంచి బయటపడెయ్యలేకపోతోంది. మరి పొన్నం సక్సెస్‌ ట్రాక్‌ ఎప్పుడు పడతారో, పదేళ్లనాటి హవాను ఎప్పుడు నడిపిస్తున్నారన్నది, కాలమే సమాధానం చెప్పాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories