పగలు ఎండ..రాత్రి చలి.. భాగ్యనగరంలో విచిత్ర వాతావరణ పరిస్థితి

పగలు ఎండ..రాత్రి చలి.. భాగ్యనగరంలో విచిత్ర వాతావరణ పరిస్థితి
x

Weather Changes hyderabad

Highlights

పగటిపూట నెత్తిన సూర్యుడు మండిపోతున్నాడు. అదే రాత్రైతే చలి తీవ్రతకు అల్లాడిపోతున్నారు.

పగటిపూట నెత్తిన సూర్యుడు మండిపోతున్నాడు. అదే రాత్రైతే చలి తీవ్రతకు అల్లాడిపోతున్నారు. పూర్తిగా ఎండా లేదు. పూర్తిగా చలి లేదు. ఈ విచిత్ర పరిస్థితి హైదరాబాద్ లో వారం రోజులుగా కొనసాగుతోంది. వాతావరణ విచిత్ర పరిస్థితి వల్ల వృద్ధులు, చిన్నారులు మొదలుకుని ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అర్దం కాని వాతావరణ పరిస్థితుల పై ఓ స్టోరీ..

మధ్యాహ్నం మండుటెండలు... మాపటేళ అయ్యేకొద్దీ పెరుగుతున్న చలి.... పగలు గరిష్ఠంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత.. సాయంత్రం నుంచి తగ్గుతూ వచ్చి తెల్లవారుజామున 4 గంటల సమయానికి కనిష్ఠంగా 16 డిగ్రీలకు తగ్గుదల. ఇలా హైదరాబాద్ లో నెలకొన్న విచిత్రమైన పరిస్థితి ఇది. హైదరాబాద్ లో వాతావరణ పరిస్థితి ఏటా భిన్నంగా ఉంటుంది. కానీ ఈ సారి వేసవికి ముందే ఎండలు మండిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి రాత్రి ఏడు నుంచి తెల్లవారి 8 గంటల వరకు ప్రజలను చలితో పాటు చలిగాలులు వణికిస్తున్నాయి. మరోవైపు ఉదయం 10 గంటలు దాటిందంటేనే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇక మధ్యాహ్నానికి ఎండలు హడలెత్తిస్తున్నాయి.

ఎండాకాలంలో ఎండలు, వర్షాకాలంలో వర్షాలు, చలికాలంలో చలి విపరీతంగా ఉండడం సర్వసాధారణమే. కానీ ఈ సారి ఫిబ్రవరి మాసంలో పగలు ఎండ, రాత్రి చలితో ప్రజలు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడం.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుండడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

ఓ వైపు కరోనా మహమ్మారి టెన్షన్... మరోవైపు సీజనల్ వ్యాదుల ఇబ్బందులతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి ఆహారంతో పాటు వ్యాయామం... చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories