వరంగల్‌లో పాలకుల నిర్లక్ష్యంపై మండిపడుతోన్న ప్రజానీకం

వరంగల్‌లో పాలకుల నిర్లక్ష్యంపై మండిపడుతోన్న ప్రజానీకం
x
Highlights

కాకతీయ రాజులు ఏలిన రాజధాని, తెలంగాణ రాష్ట్రంలో రెండవ రాజధానిగా పిలవబడుతున్న నగరం ఓరుగల్లు. రోజురోజుకూ విస్తరిస్తున్న ఈ సిటీలో అభివృద్ధి అటకెక్కింది....

కాకతీయ రాజులు ఏలిన రాజధాని, తెలంగాణ రాష్ట్రంలో రెండవ రాజధానిగా పిలవబడుతున్న నగరం ఓరుగల్లు. రోజురోజుకూ విస్తరిస్తున్న ఈ సిటీలో అభివృద్ధి అటకెక్కింది. హామీలు మాటలకే తప్ప చేతల్లో శూన్యం కావటంతో కనీస సదుపాయాలు కూడా అందటం లేదు. నమ్మి అధికారం కట్టబెడితే పాలకులు పట్టనట్లు వ్యవహరించటంపై ఓరుగల్లు ప్రజానీకం మండిపడుతోంది.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఎన్నికల హడావుడి ప్రారంభం అయ్యింది. పాగా వేయడానికి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు వ్యూహాల్లో నిమగ్నం అయ్యాయి. అయితే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదంటున్నారు ఓరుగల్లు వాసులు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్మార్ట్ సిటీ పథకం ఉన్నా ఎక్కడా అందుకు తగిన అభివృద్ధి జరగలేదు. రోడ్లు, డ్రైనేజీలు అద్వాన్నంగా ఉన్నాయి. నాలుగున్నరేళ్లలో ఒక్క పని కూడా చేయలేదు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం, పరిశ్రమలు ఇలా ఒక్క హామీని కూడా పాలకులు నెరవేర్చలేదు. దీంతో అధికార పార్టీపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. స్మార్ట్ సిటీ, అమృత్ స్కీమ్‌, హెరిటేజ్ స్కీమ్‌లు ఉన్నా లాభం లేకుండా పోయిందంటున్నారు.

1994 లో మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ గా ఏర్పడిన వరంగల్ నగరం 2015 లో 42 గ్రామాలను కలుపుకొని గ్రేటర్ మున్సిపాలిటీ గా రూపాంతరం చెందింది. పేరుకే హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం కానీ అభివృద్ధి లో మాత్రం ఆమడ దూరంలో ఉందంటున్నారు ఇక్కడి ప్రజలు. 42 ఏళ్లుగా నగరానికి మాస్టర్ ప్లాన్ లేదు. నాలాల విస్తరణ జరగలేదు. నాలాలపై అక్రమ నిర్మాణాలు. ఎఫ్టీఎల్ లో నిర్మాణాలు ఇలా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రోడ్ల గురించి, డ్రైనేజీల గురించి చెప్పనక్కర్లేదు. ఇక అమృత్ పధకం ఉన్నా సిటీ వాసులకు మంచినీళ్ళు సరిగా అందకపోవటంపై మండిపడుతున్నారు జనం.

ఇక వరంగల్‌లో విలీనం చేసిన విలీన గ్రామాల పరిస్థితి అద్వాన్నంగా ఉన్నాయి. వేలకోట్ల నిధులు వచ్చినా అభివృద్ధి జరగలేదు. ఇటీవల వరంగల్‌లో వచ్చిన వరదలు ఇక్కడి పాలకుల నిర్లక్ష్యానికి ఉదాహరణగా నిలుస్తున్నాయంటున్నారు సిటీవాసులు. నాణ్యత లేని రోడ్లు , డ్రైనేజీలు, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories