అర్థరాత్రి ఫోన్‌ వచ్చిందా..ఇక అంతే.. ఓరుగల్లును షేక్ చేస్తున్న ఆ కాల్ కథేంటి?

అర్థరాత్రి ఫోన్‌ వచ్చిందా..ఇక అంతే.. ఓరుగల్లును షేక్ చేస్తున్న ఆ కాల్ కథేంటి?
x
Highlights

ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఎదురు మాట్లాడినా, తన పార్టీపై చిన్న మాటన్నా, సోషల్ మీడియాలో కామెంట్ చేసినా, అదేరోజు అర్థరాత్రి ఫోన్ కాల్ మోగుతుంది. అందులో...

ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఎదురు మాట్లాడినా, తన పార్టీపై చిన్న మాటన్నా, సోషల్ మీడియాలో కామెంట్ చేసినా, అదేరోజు అర్థరాత్రి ఫోన్ కాల్ మోగుతుంది. అందులో మొదటి డైలాగ్, ఇక్కడ నేనే రాజు, నేనే మంత్రి. ఎదురు మాట్లాడితే తాట తీస్తానని తీవ్ర స్వరంతో బెదిరింపులు. అవతలి వ్యక్తి స్వపక్షమైనా, విపక్షమైనా, దారినపోయే దానయ్య ఐనా, డోంట్‌ కేర్. అందరికీ సేమ్‌ డైలాగ్. అందుకే ఆ నియోజకవర్గంలో అర్థరాత్రి ఫోన్‌ కాల్ దడ పుట్టిస్తోందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరా ఎమ్మెల్యే? అర్థరాత్రి ఫోన్‌ బెదిరింపుల హార్రర్ కథేంటి?

ఏ ప్రజాప్రతినిధిని అయినా, ప్రజలకు సేవచేస్తాడని ఎన్నుకుంటారు. ఎన్నికలకు ముందు రాజకీయంగా మాటల తూటాలతో ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడానికి అస్త్రశాస్త్రాలను ఉపయోగిస్తారు. గెలుపు వరించాక మాత్రం నియోజకవర్గ ప్రజలందరినీ ఒకేలా చూడాలి. కానీ అక్కడ అంతా సీన్ రివర్స్. ఎన్నికలకు ముందు ఒక లెక్క. ఎన్నికల తరువాత ఒక లెక్క అన్నట్లు వ్యవహరిస్తున్నారట ఆ ఎమ్మెల్యే.

ఒకవైపు కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండటం, అనుకోని రాజకీయ ప్రత్యర్థి ఆ నియోజకవర్గంలోకి రావడంతో, పంథా మార్చారట ఎమ్మెల్యే. ప్రతిపక్ష పార్టీల నేతలకు, స్వపక్షంలోని కొందరి నేతలకు ఇటీవల కాలంలో రాత్రి సమయాల్లో ఫోన్ కాల్స్ చేసి, ఇక్కడ ఇక అంతా నేనే మీరు పార్టీకి పని చెయ్యాలి, లేదంటే పోలీసులు తెల్లవారేలోపు మీ ఇంటి ముందు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నేనే రాజు, నేనే మంత్రి అంటూ బెదిరిస్తారట. ఇతరులను మాటలతో భయభ్రాంతులకు గురిచేయడంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు, ప్రతిపక్ష పార్టీల నేతలకు, ఎవరికి చెప్పుకోవాలో పాలుపోవడటం లేదట.

తెలంగాణ రాష్ట్రంలో రెండవ రాజధానిగా పేరొందిన వరంగల్ మహా నగరంలోని తూర్పు నియోజకవర్గంలో రాత్రయితే చాలు, ఎమ్మెల్యే నుంచి ఎవరికి ఫోన్ వస్తుందోనని టెన్షన్‌ పడుతున్నారట. అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నది నన్నపనేని నరేందర్. అర్థరా్త్రి కాల్స్ చేస్తోంది ఈ‍యనేనంటూ వరంగల్‌లో రచ్చ అవుతోందట.

నన్నపనేని నరేందర్. అనతికాలంలోనే ఎమ్మెల్యేగా ఎదిగిన నేత. ఒకప్పుడు అనారోగ్యంతో చావు అంచులకు వరకూ వెళ్లారు. కాలం కలిసొచ్చి టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి జాయిన్ అయ్యారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలుపొంది, వరంగల్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, అప్పుటి సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖకు టీఆర్ఎస్‌ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో, సురేఖ పార్టీ మారారు. ఖాళీ అయిన ఆ స్థానాన్ని నరేందర్‌కు అప్పగించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి వద్దిరాజు రవిచంద్రపై గెలుపొందారు. ఇక్కడి వరకు ఓకే. ఇప్పుడా ఎమ్మెల్యే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి అన్నట్లు వ్యవహరిస్తున్నారని అక్కడి జనం చర్చించుకుంటున్నారు..

2018 ఎన్నికల తర్వాత, అంతా సాఫీగానే సాగుతోంది అనుకున్న సమయంలో, నెల రోజులుగా తూర్పు నియోజకవర్గంలో రాజకీయ తుపాను మొదలైంది. మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు తిరిగి కార్యకర్తల అభీష్టం మేరకు అంటూ, వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోకి రావడం, పాత టిఆర్‌ఎస్ క్యాడర్‌ను తమవైపు లాక్కోవడంతో పాటు, అక్కడ కార్పొరేటర్లు తమ వల్లే గెలిచారు అనడంతో, నియోజకవర్గంలో రాజకీయ దుమారం స్టార్ట్ అయ్యింది. ఎవరు కొండా దంపతుల వైపు వెళతారోనని ఆరా తీసి మరీ, ఎమ్మెల్యే రాత్రి సమయంలో ఫోన్ కాల్స్ చేస్తున్నారట. కాంగ్రెస్ గాని, కొండా దంపతుల వద్దకు గానీ, ఎవరు వెళ్లినా, మీ సంగతి చూస్తానని వార్నింగ్‌లు ఇస్తున్నారట. ఇప్పటి స్వపక్షంలోని కొందరు, తమకు సంబంధం లేకున్నా రాత్రిపూట ఫోన్‌లు చేసి వార్నింగ్ ఇస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌ అధిష్టానం దృష్టికి విషయాన్ని చేరవేశారట. ఇక ప్రతిపక్ష పార్టీల నేతలకు సైతం కాల్స్ వెళ్లడంతో, కాల్ రికార్డింగ్స్ ఉన్నా, ఎన్నికల సమయం కోసం వేచి చూస్తున్నారట. అదును చూసి నేనే రాజు.. నేనే మంత్రి ఆడియోలను బయట పెట్టాలనుకుంటున్నారట. ఎమ్మెల్యే తీరుపై గులాబీ అధిష్టానం సైతం సీరియస్‌గా వుందట. తూర్పు ఎపిసోడ్‌లో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందని అక్కడి నేతలు, ప్రజలు వేచి చూస్తున్నారట.


Show Full Article
Print Article
Next Story
More Stories